Share News

బడికి బైబై.. ఆటలతో ఎంజాయ్‌..

ABN , Publish Date - Apr 24 , 2026 | 01:06 AM

నిన్నటివరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు సెలవుల మూడ్‌లోకి వెళ్లారు.

బడికి బైబై.. ఆటలతో ఎంజాయ్‌..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

నిన్నటివరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు సెలవుల మూడ్‌లోకి వెళ్లారు. శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాలల్లో 2025-2026 సంవత్సరానికి సంబంధించిన ప్రోగ్రెస్‌ కార్డులు అందజేశారు. విద్యా సంవత్సరం ముగిసిపోవడంతో చిన్నారులు వేసవి సెలవుల్లో ఉల్లాసంగా గడిపేందుకు ప్లాన్‌లు చేసుకున్నారు. ఇప్పటికే ఇంటర్‌ ఫలితాలు వచ్చాయి. మరో వారం రోజుల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా రానున్నాయి. పిల్లల విద్యా ప్రణాళికల్లో తల్లిదండ్రులు నిమగ్నమైతే పిల్లలు మాత్రం ఆటల సందడిలో మునిగిపోనున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉచిత సమ్మర్‌ క్యాంపులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంవత్సరం పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఎదురు చూస్తున్న సెలవుల శుక్రవారం నుంచి మొదలుకానున్నాయి. జూన్‌ 12వరకు పిల్లలకు ఆటవిడుపుగా మారనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 667 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ, జడ్పీహెచ్‌ఎస్‌, కేజీబీవీ, టీఎస్‌ఎంఎస్‌, డీఎన్‌టీ, ఎంపీపీఎస్‌, ఎంపీయూపీఎస్‌, ఎంపీ హెచ్‌ఎస్‌, ఆర్బీఎస్‌, తెలంగాణ రెసిడెన్షియల్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో 79747 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 535 ప్రభుత్వ పాఠశాలల్లో 46598 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 109 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 13 కేజీబీవీ, 7మోడల్‌ స్కూల్‌, 337 మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలు, 38 మండల పరిషత్‌ అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలు, మూడు మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, ఒకటి ఆర్‌బీఎస్‌, ఒకటి డీఎన్‌టీ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 38629 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 18179 మంది. బాలికలు 20450 మంది ఉన్నారు. 21 రెసిడెన్షియల్‌ పాఠశాలలో 7762 మంది విద్యార్థులు ఉండగా, బాలురు 2583 మంది, బాలికలు 5179 మంది ఉన్నారు. 122 ప్రైవేట్‌ పాఠశాలల్లో 2123 మంది విద్యార్థులు ఉన్నారు. 24న ప్రారంభమయ్యే వేసవి సెలవుల తరువాత జూన్‌ 12న బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. దాదాపు నెలరోజుల పాటు వీరి అల్లరి తట్టుకోవడానికి తల్లిదండ్రులు ఆటవిడుపును అందిస్తున్నారు. తల్లిదండ్రులు రకరకాలైన ఆట వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు కూడా సీజన్‌ బట్టి కొత్తకొత్త రకాల ఆటవస్తువులను తీసుకొచ్చారు. ఈసారి పిల్లలు ఎలకా్ట్రనిక్‌కు సంబంధించిన గేమ్‌లను కొనుగోలు చేస్తున్నారు. చిన్నపిల్లలకు ఆటలతో పాటు మేథస్సుకు పదును పెట్టే బిజినెస్‌ గేమ్స్‌, వీడియో గేమ్స్‌లపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు స్విమ్మింగ్‌, స్కేటింగ్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, జిమ్నాస్టిక్స్‌, బాక్సింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి శిబిరాలు కూడా వెలిశాయి. హ్యాండ్‌బాల్‌, చెస్‌ క్రీడలను కూడా విద్యార్థులు ఇష్టపడుతున్నారు. క్రికెట్‌, షటిల్స్‌ బ్యాట్ల అమ్మకాలు కూడా జోరుగానే ఉన్నాయి. పిల్లలందరూ ఒకచోట చేరి క్యారం లాంటి ఆటలే కాకుండా పాతకాలపు పచ్చీస్‌, కైలాసం ఆటలు ఆడుతున్నారు. వీటికనుగుణంగానే గత సంవత్సరంకంటే ఈ సంవత్సరం ఆటసామగ్రి 30 శాతం పెరిగింది. క్యారంబోర్డులు రూ 250 నుంచి రూ 1800, షటిల్‌బ్యాట్లు రూ 150 నుంచి రూ 600, బిజినెస్‌ గేమ్‌లు రూ 100 నుంచి రూ 200, చెస్‌బోర్డు, కాయిన్‌లు రూ 50 నుంచి రూ 1500 వరకు, టెన్నికాయిట్‌ రూ 30 నుంచి రూ 80, టీవీవిడియో గేమ్స్‌ రూ 400 నుంచి రూ 600వరకు, ఇంగ్లీష్‌ లర్నింగ్‌ గేమ్స్‌ రూ 600, ప్లేస్టేషన్‌లు రూ 12వేలు, తంబోలా రూ 100, ఎలక్ట్రికల్‌ ఇతర గేమ్‌లు కూడా రూ 1200 వరకు లభిస్తున్నాయి.

అనుబంధాలను పెంచనున్న సెలవులు

యాంత్రిక జీవితంలో పట్టణాలకే పరిమితమైన పెద్దలతో పాటు పిల్లలు గ్రామాల్లో ఉండే అమ్మమ్మలు, నాన్నమ్మలతో గడిపే సమయమే దొరకదు. శుభాకార్యాల సమయంలోనూ, పండుగల సందర్భంగా కలవడమే ఉంటుంది. ఒకటి రెండు రోజులకు మించి పిల్లలు ఊళ్లలో గడిపే అవకాశం ఉండదు. వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు ఎంచక్కా గ్రామాల్లో ఉండే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల ఇళ్లకు వెళ్లవచ్చని భావిస్తారు. అక్కడ ఉండే బాబాయ్‌లు, అన్నయ్యలు, బావలు, పిన్నిలు, పెద్దమ్మలు, వదినలు ఇలా రకరకాల బంధువులు వారి పిల్లలతో కలిసి గడుపుతారు. వివిధ రకాల వ్యక్తులు, పిల్లలు, మాటతీరు, వ్యవహారశైలి, భావోద్వేగాలు, సాంఘీకశైలి కూడా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని సంప్రాదాయ ఆటలపై కూడా ఆసక్తి పెరుగుతుంది.

టూర్‌ ప్లాన్‌

వేసవిలో మరికొందరు విహార యాత్రలు వెళ్లడానికి టూర్‌ ప్లాన్‌లు చేసుకుంటారు. పిల్లలకు సెలవులు కావడంతో కొందరు తీర్థయాత్రలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటే మరికొందరు ఊటీ, కుల్‌మోనాలి, గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం ద్వారా సృజనాత్మకతకు ఉపయోగపడుతాయని భావిస్తారు.

వేసవిలోనూ జాగ్రత్తలు...

వేసవిలో పిల్లల పట్ట జాగ్రత్తలు వహించాలి. భగ్గుమంటున్న ఎండలు పిల్లలను అస్వస్థతకు గురిచేస్తాయి. ప్రధానంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలి. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. వేసవిలో ఎక్కువగా చెరువులు, వాగులు, బావులకు వద్దకు స్విమ్మింగ్‌ వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. ఈతలో అనుభవం లేకపోవడంతో ప్రమాదాలకు గురవుతారు. పిల్లలు సెల్‌ఫోన్‌, సినిమాలు చూడడం, గేమ్స్‌ ఆడడంపై కాకుండా నాలెడ్జ్‌ పెంచుకునే విధంగా జనరల్‌ నాలెడ్జ్‌ స్టోరీ బుక్స్‌ చదివే విధంగా ఆసక్తి పెంచాలి. పాజిటివ్‌ థింకింగ్‌, మెడిటేషన్‌, యోగాపై ఆసక్తి పెంచాలని సూచిస్తున్నారు.

ఒకే యూనిపామ్‌.. ప్రత్యేక కిట్‌..

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు విద్యార్థుల్లో అందరు ఒకటే అనే భావం కల్పించే దిశగా ప్రభుత్వం ‘ఒకే రాష్ట్రం.. ఓకే యూనిఫామ్‌’ విధానం వచ్చే కొత్త విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తేవడానికి చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పేర్లతో ఉన్న పాఠశాలలను ప్రభుత్వమే నిర్వహిస్తున్న వేర్వేరు రంగులు, డిజైన్లతో కలిగిన యూనిఫామ్‌ అమలు అవుతోంది. ఈ తేడాను తొలగించే దిశగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఒకే రకమైన డ్రెస్‌ కోడ్‌ ఉండే విధంగా ఒకే రంగు, ఒకే డిజైన్‌తో యూనిఫామ్‌ అమలు చేయనున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం భోజనం, అల్పాహారం కూడా విద్యార్థులకు అందించే కార్యక్రమం కూడా మొదలుకానుంది. విద్యార్థులందరికీ ఒకే రకమైన యూనిఫామ్‌ అందించే కార్యక్రమం చేపట్టారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ 21 వస్తువులతో కూడిన ప్రత్యేకమైన స్కూల్‌ కిట్లను అందించనున్నారు. పాఠశాల పునఃప్రారంభం రోజున మూడు జతల యూనిఫాం,రెండు జతల సాక్సు, స్కూల్‌ బ్యాగ్‌, బెల్ట్‌, టై, నోట్‌బుక్స్‌, టెస్ట్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌, పెన్నులు, పెన్సిల్‌, ఎరేజర్‌, షార్పనర్‌, జామెంట్రీ బాక్స్‌, డిక్షనరీ వస్తువులతో పాటు వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ట్రాక్‌సూట్‌, నైట్‌డ్రెస్‌ లాంటి దుస్తులతోపాటు బెడ్‌షీట్‌, బ్లాంకెట్‌, టవల్‌, ప్లేట్‌, గ్లాస్‌, కప్పు స్పూన్‌, ట్రంక్‌ బాక్స్‌ స్టేషనరీ కిట్‌లాంటి వసతి వస్తువులు కూడా అందిస్తారు. ప్రభుత్వం ఇంకా ఏ విధంగా అందించబోతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వ మాత్రం వచ్చే విద్యా సంవత్సరంలో యూనిఫామ్‌ విద్యార్థులకు అందించే కిట్ల పంపిణీపై పకడ్బందీగా ఏర్పాటు చేస్తోంది.

Updated Date - Apr 24 , 2026 | 01:06 AM