కాంగ్రెస్‌కు గుడ్‌బై..
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:35 AM
కాంగ్రెస్‌లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రస్థానం ముగిసింది. 20 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జీవన్‌రెడ్డి ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితుల సూచనలు స్వీకరించి భవిష్యత్ వ్యూహాన్ని ప్రకటిస్తానని జీవన్‌రెడ్డి వెల్లడించారు
- పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జీవన్‌రెడ్డి రాజీనామా
- బీఆర్‌ఎస్‌లో చేరుతారా.. బీజేపీ వైపు మొగ్గుతారా?
-జిల్లాలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం
జగిత్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రస్థానం ముగిసింది. 20 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జీవన్‌రెడ్డి ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితుల సూచనలు స్వీకరించి భవిష్యత్ వ్యూహాన్ని ప్రకటిస్తానని జీవన్‌రెడ్డి వెల్లడించారు. ఆయన బీఆర్‌ఎస్‌లో చేరుతారా.. బీజేపీ వైపు మొగ్గు చూపుతారా.. ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు మంత్రిగా, ఒక పర్యాయం ఎమ్మెల్సీగా పనిచేసిన జీవన్‌రెడ్డి తదుపరి అడుగులు ఎటువైపు వేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
ఫపంచాయతీ సమితితో రాజకీయ అరంగేట్రం...
పెగడపల్లి మండలం బతికపెల్లిలో తాటిపర్తి రాంచంద్రారెడ్డి-లింగమ్మ దంపతులకు 1951 జనవరి 5న జన్మించారు. ఉస్మానియ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివిన జీవన్‌రెడ్డి జగిత్యాల కోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. జీవన్‌రెడ్డి అహల్యదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, చంద్ర కృష్ణారెడ్డి అనే ముగ్గురు కుమారులున్నారు. 1981లో మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా మొదటిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి 1983లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అదే ఏడాది జనవరి 9న ఎన్టీఆర్ కేబినెట్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర్‌రావు కేబినేట్‌లో ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆతర్వాత టీడీపీతో విభేదించి 1984 సంవత్సరంలో రాజీవ్‌గాంధీ నాయకత్వంతో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1985లో జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 సంవత్సరంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన జీవన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన జీవన్‌రెడ్డి అనంతరం 1999, 2004, 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించి, ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు.
ఫ భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో వ్యూహరచన
2006లో కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి పోటీ చేసి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేతిలో ఓడిపోయారు. అయితే సదరు ఎన్నికల్లో ఆయన ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో తనదైన గుర్తింపు పొందాడు. ఆ తర్వాత 2008లో మరోమారు కాంగ్రెస్ నుంచి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి కేసీఆర్‌తో పోటీ పడి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో జీవన్ రెడ్డి కేవలం సుమారు 14 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2006 సంవత్సరంలో జీవన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. 2009 వరకు ఆ పదవిలో కొనసాగిన ఆయన ఆర్‌అండ్‌బీ శాఖను నిర్వహించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రికార్డులోకెక్కి శాసన సభ పక్ష ఉప నేతగా వ్యవహరించాడు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి పోటీ చేసి మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెటుపొంది రికార్డు సాధించారు. శాసన మండలిలో అడుగుపెట్టిన జీవన్‌రెడ్డి రైతుల, పట్టభధ్రుల, ప్రజల సమస్యలపై పోరాడుతూ తనదైన ముద్రవేసుకున్నాడు. 2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీఆర్‌ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన ఎమ్మెల్యే కోటా, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో వ్యూహరచన చేస్తున్నారు.
ఫజీవన్‌రెడ్డి పయనమెటు?
జగిత్యాల కాంగ్రెస్‌లో కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాల వల్ల మనస్తాపానికి గురయిన జీవన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల డీసీసీ, టీపీసీసీ, ఏఐసీసీ నేతల బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలించకపోవడం జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తప్పుకోవడం జరిగింది. జగిత్యాలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అనంతరం జరిగిన పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా మార్చారు. కాంగ్రెస్ సర్కారుతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించిన సమయం నుంచి జీవన్ రెడ్డి అడుగడుగున తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటని పలు సందర్బాల్లో బహిరంగంగానే ప్రశ్నించారు. ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదన్న ప్రధాన కారణంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జీవన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న చర్చలు రాజకీయ వర్గాల్లో చోటుచేసుకుంటున్నాయి.