కమనీయం.. రామయ్య కల్యాణం..
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:21 AM
ముల్లోకాలు మురిసేలా సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్ర్తోక్తంగా కన్నుల పండువలా నిర్వహించారు.
వేములవాడ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ముల్లోకాలు మురిసేలా సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్ర్తోక్తంగా కన్నుల పండువలా నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్ర పరిసరాల్లోని గుడిచెరువు పార్కింగ్ స్థలంలో శివార్చన వేదికపైన చేపట్టిన రామయ్య కల్యాణ తంతును కనులారా వీక్షించిన భక్తజనం మూర్తీభవించిన భక్తిభావంతో పులకించిపోయారు. రాజన్న ఆలయంలో ఈవో రమాదేవి ఆధ్వర్యంలో శ్రీరామనవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం రాజరాజేశ్వర స్వామివారితో పాటుగా సీతరామచంద్రస్వామి, అనంతపద్మనాభస్వామి వారలకు ఏకాంతంగా ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలోని మూలవిరాట్టు మూర్తులకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఆశీనులను చేసి భక్తుల కోలాహలం, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా గుడి చెరువులోని శివార్చన వేదికపై తీరోక్క పూలతో అందంగా అలంకరించిన కల్యాణవేదిక వద్దకు తీసుకువచ్చారు. పల్లకీ సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు జైశ్రీరాం నినాదాలు చేశారు. సీరారామచంద్ర స్వామివారల కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా జరిపించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన కల్యాణమహోత్సవ ఘట్టం మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. అనంతరం రాజన్న ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానం కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో నిర్వహించే సీతారామంచంద్రస్వామి వారి కల్యాణమహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఉదయం 6 గంటలకు పట్టు వస్ర్తాలతో భీమేశ్వర ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆలయంలోకి వెళ్లగానే అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భీమేశ్వర స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్‌కు అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా, ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాన్ని అందజేశారు. అలాగే సీతారాముల కల్యాణమహోత్సవానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో పాలవర్గ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ స్వామివారికి పంపిన పట్టు వస్ర్తాలను బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ శ్రీస్వామి వారికి అందజేశారు.
భారీగా తరలివచ్చిన భక్తజనం
వేములవాడలో నిర్వహించిన సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గురువారం రాత్రి భక్తులు తరలివచ్చి రాజన్న ఆలయ వసతిగదులతో పాటుగా గుడి చెరువు పార్కింగ్‌లో ఏర్పాటు చేసిన కల్యాణవేదిక చలువపందిళ్ల కింద సేదతీరారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు 50 వేలకు పైగా భక్తులు వచ్చినట్లు ఆలయాధికారులు అంచనా వేస్తున్నారు. కల్యాణాన్ని తిలికించేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చల్లటినీటిని, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. భక్తులు వీక్షించేందుకు ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు. దీంతో భీమన్న ఆలయంతో పాటుగా గుడి చెరువు పార్కింగ్ స్థలం, పట్టణ వీధులు భక్తులతో కిటకిటలాడాయి.
రామయ్య పెళ్లిలో హిజ్రాల సందడి..
వేములవాడలో కన్నులపండువగా చేపట్టిన రామయ్య దివ్య కల్యాణమహోత్సవానికి పెద్ద సంఖ్యలో హిజ్రాలు తరలివచ్చి సందడి చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన హిజ్రాలు పెళ్లికూతురులా ముస్తాబయ్యారు. సీతారామచంద్రస్వామి సీతమ్మకు మాంగళ్యధారణ చేస్తున్న సమయంలో హిజ్రాలు ఒకరికి ఒకరు తలపై జీలకర్ర, బెల్లం పెట్టుకుని మంగళసూత్రం కట్టుకుని స్వామివారిని మనువాడినట్లుగా ఊహించుకుంటూ, తలంబ్రాలు పోసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అలాగే రాజరాజేశ్వర స్వామివారికి ధారణ చేపించుకున్న శివపార్వతులు కూడా పెద్ద సంఖ్యలో కల్యాణానికి తరలివచ్చారు. కల్యాణ తంతు జరుగుతున్న సమయంలో శివపార్వతులు తలంబ్రాలు చల్లుకుంటూ స్వామివారిని పెళ్లాడినట్లు స్మరించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.