Share News

అధిక సాంద్రత పత్తితో మంచి దిగుబడి

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:05 AM

: అధిక సాంద్రత పత్తి పంట విధానంలో రైతులు మంచి దిగుబడి సాధించవచ్చని కేవికే శాస్త్రవేత్త డాక్టర్‌ మహేష్‌ అన్నారు. బుధవారం జమ్మికుంట మండలం వావిలాల రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ ఆంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

అధిక సాంద్రత పత్తితో మంచి దిగుబడి
సమావేశంలో మాట్లాడుతున్న ఏవో ఖాదర్‌ హుస్సేన్‌.

జమ్మికుంట, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): అధిక సాంద్రత పత్తి పంట విధానంలో రైతులు మంచి దిగుబడి సాధించవచ్చని కేవికే శాస్త్రవేత్త డాక్టర్‌ మహేష్‌ అన్నారు. బుధవారం జమ్మికుంట మండలం వావిలాల రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ ఆంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవికే శాస్త్రవేత్త డాక్టర్‌ మహేష్‌ మాట్లాడుతూ సాధారణ సాగు పద్ధతిలో ఎకారకు ఐదు వేల నుంచి ఆరు వేల మొక్కలు ఉంటే, అధిక సాంద్రత పద్ధతిలో 20 వేల నుంచి 23 వేల మొక్కలు ఉంటాయన్నారు. మ్యాపిక్వైట్ట్‌ క్లోరైడ్‌ అనే గ్రోత్‌ రెగ్యులేటర్‌ను వాడి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చన్నారు. రెండో పంటగా మొక్కజొన్న వేయాలనుకుంటే డిసెంబరు చివరి వరకు పత్తి పంటను తీసివేయవచ్చన్నారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రాన్ని రైతులు సందర్శించి నాచురల్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ విధానాన్ని తెలుసుకోవాలని సూచించారు. బయో రిసోర్స్‌ సెంటర్‌లో పంట కీటక నియంత్రణ కాషాయాల తయారీ తెలుసుకుని, సాగులో పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు ఖాదర్‌ హుస్సేన్‌, భూంరెడ్డి, సర్పంచ్‌ అర్జున్‌, ఏఈవో రాజేష్‌, ఉప సర్పంచ్‌ సతీష్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:05 AM