ప్రభుత్వాలు మారినా మంచి పథకాలు కొనసాగించాలి
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:32 AM
కాంగ్రెస్ వాళ్లకు కేసీఆర్ పేరంటేనే నచ్చుతలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
వీర్నపల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ వాళ్లకు కేసీఆర్ పేరంటేనే నచ్చుతలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో’ కేసీఆర్ కంటి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా కళ్లజోళ్లలను బుధవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గతంలో వైస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాలను బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినా తొలగించకుండా కొనసాగించామన్నారు. బీఆర్ ఎస్ సర్కార్ అమలు చేసిన కేసీఆర్ కంటి వెలుగు, కేసీఆర్ కిట్టు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందన్నారు. వాళ్లకు కేసీఆర్ పేరంటేనే నచ్చుతలేదన్నారు. కేసీఆర్ కిట్టు స్థానంలో ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మంచిగుంటుండే.. ప్రభుత్వాలు మారినా మంచి పథకాలను కొనసాగించాలన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారుతుంటాయని ప్రజలకు లబ్ధి చేకూర్చేలా పని చేయాలని పేర్కొన్నారు. ప్రజల దయ ఉంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలో వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో లేకపోయినా ప్రజల ఇళ్లలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని, జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి కోట్లాది మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లను అందించారని అన్నారు. మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీర్నపల్లి మండలంలోనే మొదలుపెట్టాలని నిర్ణయించి వీర్నపల్లి, గర్జనపల్లిలో సుమారు 5వేల మందికి పరీక్షలు నిర్వహించారన్నారు. 1371మందికి కళ్లజోళ్లను అందిం చామన్నారు. అందులో 250మంది పిల్లలున్నారని అన్నారు. 171 మంది కి శస్త్రచికిత్సలు సిరిసిల్లలోని ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రిలో చేయించామన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్రామానికి వైకుంఠ రథం, రోడ్డు విస్తరణలో 24 మంది ఇళ్లు కోల్పోయిన బాధితుల ఇళ్ల నిర్మాణ బిల్లులను కలెక్టర్‌తో మాట్లాడి ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో పాలన సౌలభ్యం కోసం నూతన మండలాలలు, తండాలను గ్రామపం చాయతీలు, జిల్లాలను ఏర్పాటు చేసి అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్ చైర్మన్ రవీందర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, సర్పంచ్ జ్యోత్స్న, హైదరాబాద్‌కు చెందిన సబేర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు మల్లేశం, సురేశ్‌నాయక్, సంతోష్‌నాయక్, కళావతి, భూల, చాంద్‌పాషా, రవి, భాస్కర్, సాగర్, దేవరాజు, రవి, రాజేశ్, శ్రీకాంత్, శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు.