Share News

97 జీవోను రద్దు చేయాల్సిందే..

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:00 AM

పాలిటెక్నిక్‌ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న 97 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు.

97 జీవోను రద్దు చేయాల్సిందే..

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న 97 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పాలిటెక్నిక్‌ ఆదర్శ మహిళా కళాశాల విద్యార్థినులతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆదివారం మాట్లాడారు. జీవో 97 విషయంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్న విద్యార్థులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగానే జీవో నంబరు 97 పుట్టుకొచ్చిందన్నారు. పాలిటెక్నిక్‌ విద్యను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. పాలిటెక్నిక్‌ విద్యను నిర్వీర్యం చేసి ఆయా కళాశాలలకు చెందిన కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ విద్యను స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేయాలని చూస్తే విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జీవో నంబరు 97ను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌వీ శాతవాహన యూనివర్సిటీ ఇన్‌చార్జి చుక్క శ్రీనివాస్‌, నాయకులు గంగాధర చందు, మొగిలోజు వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:00 AM