Share News

‘చేయూత’నివ్వండి..!

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:51 AM

గతంలో ఉన్న ఆసరా పింఛన్లు ‘చేయూత’గా మారాయి. కొత్త పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు నిరీక్షిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా అర్హులు దరఖాస్తు చేసుకొని కార్యాలయాలు చుట్టూ పింఛన్‌ మహాప్రభో.. అంటూ తిరుగుతున్నారు.

‘చేయూత’నివ్వండి..!

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

గతంలో ఉన్న ఆసరా పింఛన్లు ‘చేయూత’గా మారాయి. కొత్త పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు నిరీక్షిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా అర్హులు దరఖాస్తు చేసుకొని కార్యాలయాలు చుట్టూ పింఛన్‌ మహాప్రభో.. అంటూ తిరుగుతున్నారు. 2022 ఆగస్టులో చివరిసారిగా పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత భర్త చనిపోతే భార్యకు పింఛన్‌ బదిలాయింపు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేయూత పథకంలో ప్రభుత్వం ప్రస్తుతం లక్షా 16వేల 323 పింఛన్‌దారులకు ప్రతినెలా రూ 25.35 కోట్లు పంపిణీ చేస్తోంది. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 30,965 మందికి రూ.6.24 కోట్లు, దివ్యాంగుల పింఛన్లు 9,570 మందికి రూ 3.84 కోట్లు, వితంతువు 23,962 మందికి రూ 4.78 కోట్లు, చేనేత 3,433 మందికి రూ 69 లక్షలు, గీతకార్మికులు 2,245 మందికి రూ 45 లక్షలు, ఒంటరి మహిళలు 1,787 మందికి 36 లక్షలు, బీడీ కార్మికులు 43,183 మందికి రూ 8.69 కోట్లు, పైలేరియా 949 మందికి 19 లక్షలు, డయాలసిస్‌ పేషేంట్లు 133 మందికి రూ 3 లక్షలు, బీడీ టేకేదార్లు 465 మందికి రూ 9 లక్షలు జమ చేస్తున్నారు. గత ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌కు వయస్సు అర్హతను 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించింది. దీంతో జిల్లాలో వేల సంఖ్యలోనే దరఖాస్తు చేసుకొని చేయూత పింఛన్‌ కోసం దాదాపు మూడున్నర ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆసరా పథకం పేరుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులతో పాటు ఒంటరి మహిళలు, డయాలసిస్‌ బాధితులు, ఫైలేరియా, హెచ్‌ఐవీ పేషంట్లకు పింఛన్లను మంజూరు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే చేయూత పథకంగా పేరు మార్చారు. దీంతోపాటు రూ 2016 ఉన్న పింఛను రూ 4 వేలకు, దివ్యాంగులకు రూ 4016 ఉన్న దానిని రూ ఆరు వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కొత్త పింఛన్ల ఊసేలేదు. ఇప్పటికీ పాత పెన్షనే అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌ కార్డులు అందించిన క్రమంలో కొత్త పింఛన్లు కూడా ఇస్తారని దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూసిన నిరాశే మిగిలింది.. గతంలో ఆరు గ్యారెంటీగా పథకాల కోసం చేసుకున్న దరఖాస్తులో ఎక్కువగా పింఛన్‌ కావాలని ఆప్షన్‌ ఇచ్చిన వాళ్లే ఉన్నారు. దీంతోపాటు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో పింఛన్‌ మహాప్రభో అంటూ దరఖాస్తులు చేసుకుంటున్నారు.

ఫ 76,501 మంది దరఖాస్తులు

జిల్లాలో గత ప్రభుత్వం ఆసరా పథకం కింద పింఛన్లు అందిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటి స్థానంలో చేయూత ప్రకటించినా అర్హులకు నిరాశ తప్పడం లేదు. జిల్లాలో ఆరు గ్యారంటీలకు 1.92 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో ప్రధానంగా ఫించన్‌ కోసం 76,501 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చేయూత ఫించన్‌కు 71,677 మంది, దివ్యాంగులు 4,824 మంది దరఖాస్తులు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల్లో ఒకటిగా ప్రకటించిన కాంగ్రెస్‌ పింఛన్‌ సొమ్ము సాధారణ పింఛన్‌దారులకు రూ 4వేలు, దివ్యాంగులకు రూ 6 వేలు ఇస్తామని ప్రకటించినా అమల్లోకి రాలేదు. పెంచడంతో పాటు అర్హులైన వారందరికి పింఛన్లు మంజూరుచేస్తామని స్వీకరించిన దరఖాస్తులకు మోక్షం కలిగే తీరు మాత్రం కనిపించడం లేదు.

ఫ అందరికీ వర్తించని బదలాయింపు

కుటుంబంలో వృద్ధాప్య పింఛన్‌దారులు ఒకరు చనిపోతే వారి కుటుంబంలో భార్యకు గానీ, భర్తకు గానీ పింఛన్‌ మంజూరు చేసి బదలాయింపు ప్రక్రియ మాత్రమే కొనసాగిస్తున్నారు. ఇది కూడా అందరికి వర్తింపచేయడం లేదు. జిల్లాలో పింఛన్ల కోసం మూడున్నర ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో ఒకసారి మాత్రమే కొత్తవారికి పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో చాలా మందికి పింఛన్లు రాలేదని ఎదురుచూశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తరువాత దరఖాస్తుల స్వీకరణతో హడావిడి చేసినా పింఛన్లు మాత్రం అందడం లేదు. వృద్ధాప్య పింఛన్లు మాత్రం ఒకరు మరణిస్తే ఒకరికి అందిస్తున్నారు. ఇందులో కూడా కేవలం వృద్ధప్య పింఛన్‌ మాత్రమే బదలాయింపు చేస్తున్నారు. దివ్వాంగులు, ఇతర చేనేత, గీత కార్మికులు చనిపోతే భార్యకు వితంతు పింఛన్‌ కింద ఇవ్వడం లేదు.

Updated Date - Mar 11 , 2026 | 12:51 AM