అవకాశమివ్వండి..
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:38 AM
పుర పోరుకు కీలకమైన ఓటర్ జాబితా రూపకల్పనకు ఎన్నికల కమిషన్ డ్రాఫ్ట్ ఓటర్ జాబితా వెల్లడించడంతోనే జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఆశావహులు తెరపైకి వచ్చారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పుర పోరుకు కీలకమైన ఓటర్ జాబితా రూపకల్పనకు ఎన్నికల కమిషన్ డ్రాఫ్ట్ ఓటర్ జాబితా వెల్లడించడంతోనే జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఆశావహులు తెరపైకి వచ్చారు. మరోవైపు ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలుపెట్టడంతోనే ప్రధాన పార్టీలు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో పాగా వేయడానికి దృష్టి సారించాయి. ముందస్తుగానే బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ఆశావహులతో సమావేశం నిర్వహించి మార్గనిర్దేశం చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, వేములవాడ బీజేపీ నాయకులతో సిరిసిల్లలో సమావేశం నిర్వహించారు. ఈసారి మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా సన్నాహాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు ఉత్సాహంగా ఉన్నా సమన్వయ లోపాలు బయటపడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు తెరపైకి రావడంతోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల పెద్దల చుట్టూ పోటీకి సిద్ధమైన ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అవకాశమివ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎవరికి వారు పార్టీ టికెట్లు పొందాలని ప్రయత్నాలు మొదలు పెట్టడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తమ ఉనికిని చాటుకోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో 260 సర్పంచుల్లో కాంగ్రెస్ 96 మంది, బీఆర్‌ఎస్ 106 మంది, బీజేపీ 21 మంది, సీపీఎం ముగ్గురు, ఇతరులు 34 మంది గెలుపొందారు. వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్న రెండు నియోజకవర్గాల్లో ఎవరికి వారు పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోను సిరిసిల్లలో బీఆర్‌ఎస్, వేములవాడలో కాంగ్రెస్ ఈసారి బలంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే సిరిసిల్ల వేములవాడ రెండు మున్సిపాలిటీలు ఉండడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టి పెడతారని, దీంతో రెండు మున్సిపాలిటీలో త్రిముఖ పోటీ ఉంటుందని చర్చ మొదలైంది. 2020, జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తక్కువగా ఉంది. సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో 67 వార్డులు ఉండగా ఐదు వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందుగానే ఏకగ్రీవం కాగా బీఆర్‌ఎస్ 38, కాంగ్రెస్ మూడు, బీజేపీ 9మంది, ఇతరులు 17 మంది గెలుపొందారు. సిరిసిల్లలో 39 వార్డులో 22 మంది బీఆర్‌ఎస్, రెండు కాంగ్రెస్, మూడు బీజేపీ, 12 స్థానాల్లో బీఆర్‌ఎస్ రెబల్స్ గెలిచారు. తర్వాత వారు బీఆర్‌ఎస్ గూటికి చేరారు. వేములవాడలో 28 వార్డుల్లో బీఆర్‌ఎస్ 16 మంది, బీజేపీ ఆరుగురు, కాంగ్రెస్ ఒకరు, స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు. ఈసారి మాత్రం మూడు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతుందని చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాలోని రెండు మున్సిపాలిటీలో ఎన్నికల వేడి మొదలు కావడంతో ఆశావహులు వార్డుల్లో తిరగడం మొదలుపెట్టారు.
ఫ తుది ఓటరు జాబితాకు కసరత్తు...
సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో తుది ఓటరు జాబితా ఈనెల 10న వెల్లడించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉండగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం 1,22,836 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 59,522 మంది, మహిళలు 63,290 మంది, జెండర్లు 24 మంది ఉన్నారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 3,768 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 81,959మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39,942 మంది, మహిళలు 42,011 మంది, జెండర్లు ఆరుగురు ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 40,877మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,580 మంది, మహిళలు 21,279 మంది, జెండర్లు 18మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,699 మంది ఎక్కువగా ఉన్నారు.