వంట కార్మికులపై గ్యాస్ బండ
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:18 AM
పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం తయారీ గ్యాస్ పొయ్యిపైనే చేయాలనే కలెక్టర్ ఆదేశాలు వంట కార్మికులకు భారంగా మారాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం తయారీ గ్యాస్ పొయ్యిపైనే చేయాలనే కలెక్టర్ ఆదేశాలు వంట కార్మికులకు భారంగా మారాయి. ప్రభుత్వం చెల్లించే మెస్ చార్జీలు తమకు చన్నీళ్లకు వేడినీళ్లుగా తోడై ఆర్థికంగా ఆదుకుంటున్నాయని మధ్యహ్న భోజన కార్మికులు అంటుంటారు. గ్యాస్‌పొయ్యిపైనే భోజనం తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో ఆర్థిక తోడ్పాటు మాటేమోగానీ అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గ్యాస్ బండ, మరోవైపు పెరుగుతున్న కోడిగుడ్ల ధరలు తమను నష్టాలపాలు చేస్తున్నాయని అంటున్నారు.
ఫ పెరిగిన కోడిగుడ్ల ధరలతో ఇబ్బందులు
ప్రభుత్వం ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి 6.78 రూపాయలు, ఆరు నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు 10.17 రూపాయలు చెల్లిస్తున్నది. వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో కోడిగుడ్లు అందించడానికి అదనంగా ఒక్కో విద్యార్థికి రోజుకు ఆరు రూపాయలు చెల్లిస్తున్నది. తొమ్మిది, పది చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి 13.17 రూపాయలు చెల్లిస్తూ ఆ ధరలోనే కోడిగుడ్డు ఇవ్వాలని ఆదేశించింది. ఈ డబ్బుతో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మెనూ అందజేయాల్సి ఉంటుంది. ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు రోజుకు 100 గ్రాములు, ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు రోజుకు 150 గ్రాముల బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. కూరగాయలు, పప్పు, చింతపండు, నూనె, పోపు దినుసులు, పసుపు, కారం తదితర వంట సామగ్రి, రాగి పౌడర్ ప్రభుత్వం చెల్లించే మెస్ చార్జీల నుంచి వంటకార్మికులు సమకూర్చుకోవలసి ఉంటుంది. ప్రభుత్వం కోడిగుడ్డు కొనుగోలు కోసం వంట కార్మికులకు ఆరు రూపాయలు చెల్లిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర 7.50 నుంచి 8 రూపాయల వరకు ఉన్నది. దీంతో ఒక్కో విద్యార్థిపై అదనంగా నెలకు 25 రూపాయల వరకు నష్టం భరించాల్సి వస్తున్నదని మధ్యాహ్న భోజన కార్మికులు వాపోతున్నారు.
ఫ గ్యాస్ సిలిండర్లకు నెలకు రూ. 8,500 వరకు ఖర్చు
ఇంతకాలం జిల్లాలోని వంట కార్మికులు కట్టెలపొయ్యిపై భోజనం తయారు చేసి విద్యార్థులకు అందిస్తూ వస్తున్నారు. పాఠశాల ఆవరణలో పొగ రాకుండా విద్యార్థులు అనారోగ్యంపాలుకాకుండా చూసేందుకు గ్యాస్ పొయ్యిలపై భోజనం తయారు చేసి అందించాలని ఆదేశించారు. వంట తయారు చేయడానికి ప్రతి పాఠశాలకు రెండు సిలిండర్లు మంజూరు చేశారు. ఈ సిలిండర్ల గ్యాస్ కోసం 2,274 రూపాయలు వంట కార్మికులు చెల్లించాల్సి వస్తున్నది. వంట పొయ్యిల కొనుగోలు కోసం 8,500 రూపాయల వరకు వంట కార్మికులే భరించుకోవలసి వస్తున్నది. 200 నుంచి 250 మంది విద్యార్థులు చదివే పాఠశాలలో ఒక్కో గ్యాస్ సిలిండర్ మూడు నుంచి నాలుగు రోజులవరకు మించి రావడం లేదు. నెలకు కనీసం ఆరు సిలిండర్లు కొనాల్సి రావడంతో వంటకార్మికులు ఏడు వేల నుంచి 8,500 రూపాయల వరకు గ్యాస్ కోసం ఖర్చుచేయాల్సి వస్తున్నది. గతంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తే ఆరు నెలలకు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయల ఖర్చు అయ్యేదని, ఇప్పుడు వంట చేయడానికి ఆ మొత్తం నెలరోజులకే సరిపోతున్నదని మధ్యాహ్న భోజన కార్మికులు వాపోతున్నారు.
ఫ సకాలంలో అందని మెస్ చార్జీలు
అష్టకష్టాలు పడి విద్యార్థులకు భోజనం పెడుతున్నా సకాలంలో మెస్ చార్జీలు చెల్లిస్తున్నారా అదీ లేదు. ప్రస్తుతం జిల్లాలో ఐదు నెలల మెస్ చార్జీలు బకాయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం తయారు చేస్తే ఎంతోకొంత తమకు ఉపాధి దొరుకుతుందని భావిస్తే ఉపాధిమాటెమో కానీ అప్పులు చేసి పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. మెస్ చార్జీల కోసం, కోడిగుడ్లకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలని పలు మార్లు వివిధ రూపాల్లో ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలతో అప్పులభారం, ఇటు కోడిగుడ్లకు, వంట దినుసులకు ఎదురు పెట్టుబడి పెడుతుంటే ఇప్పుడు అదనంగా నెత్తిన గ్యాస్‌బండ బారం మోపారని, దీంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తున్న విధంగానే గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరపై పాఠశాలలకు సరఫరా చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు కోరుతున్నారు.
ఫ సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలి
- బాబాయమ్మ, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గ్యాస్ పొయ్యిలపై వంట చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ ఆదేశాలను మేము తప్పక పాటిస్తాం. గ్యాస్ కొనుగోలు చేయాలంటే ఆర్థిక బారం పడుతుంది. ఇందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక నిధులను కెటాయించడంలేదు. సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం సరఫరా చేస్తే ఆర్థిక బారం తగ్గుతుంది.
----------------------