గంగులా.. మూటాముల్లె సర్దుకుని వెళ్లిపో..
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:32 AM
‘గంగుల కమలాకర్...నేను నయాపైసా తీసుకురాలేదని అబద్దాలాడుతున్నవు కదా.. నేను పైసలు తెచ్చినట్లు నిరూపిస్తే కరీంనగర్ వదిలి వెళ్లిపోతానని అన్నావు కదా.... ఇదిగో బుక్ లెట్. కరీంనగర్ కోసం నేను ఎన్ని నిధులు తెచ్చానో, ఏయే అభివృద్ధి పనులు చేశానో.. ఆ వివరాలన్నీ ఈ బుక్ లెట్ లో ఉన్నాయి.
కరీంనగర్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘గంగుల కమలాకర్...నేను నయాపైసా తీసుకురాలేదని అబద్దాలాడుతున్నవు కదా.. నేను పైసలు తెచ్చినట్లు నిరూపిస్తే కరీంనగర్ వదిలి వెళ్లిపోతానని అన్నావు కదా.... ఇదిగో బుక్ లెట్. కరీంనగర్ కోసం నేను ఎన్ని నిధులు తెచ్చానో, ఏయే అభివృద్ధి పనులు చేశానో.. ఆ వివరాలన్నీ ఈ బుక్ లెట్ లో ఉన్నాయి. ఐదు లక్షల పుస్తకాలను ప్రింట్ చేసి ఇంటింటికీ పంపుతున్నా... అన్నమాట ప్రకారం... నువ్వు మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోతావా’.. అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బండి సంజయ్ తొలిరోజు కిసాన్ నగర్, కాపువాడ మారుతీనగర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో పాల్గొని ప్రసంగించారు. వేలాదిగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఏం ఒరగబెట్టిందని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు అవినీతి, అక్రమాలు, కబ్జాలు చేసి పేదల ఉసురు పోసుకున్నారన్నారు. కబ్జాలకు పాల్పడి జైలుకు పోయినోళ్లలో సగం మందికి బీఆర్‌ఎస్‌లో టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు. వాళ్లకు ఓట్లేస్తే జాగాలతోపాటు పుస్తెల తాడు కూడా గుంజుకుపోతారన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. తాను నయాపైసా తీసుకురాలేదని అబద్దాలాడుతున్నారని విమర్శించారు. తాను రూపొందించిన బుక్‌లెట్‌లో తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనుల వివరాలన్నీ ఉన్నాయన్నారు. ఈ బుక్‌లెట్‌ను ఇంటింటికి పంపిణీ చేస్తానని తెలిపారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఎన్నికలప్పుడే కనిపిస్తాడని, ప్రజలు ఆయనను ఎన్నడో మర్చిపోయారని ఎద్దేవా చేశారు. అధికారంలో లేని బీఆర్‌ఎస్‌కు ఓట్లేసి ప్రయోజనం లేదని అన్నారు. పొరపాటున బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే... కేంద్రం ఇచ్చిన పైసలను దారి మళ్లించి కమీషన్లు దండుకుంటారని విమర్శించారు.
- కిసాన్‌నగర్ సభలో స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మా బంధువులు ఆకుల కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్న. పదేళ్ల ఏళ్ల క్రితం ఎట్లుండేది? ఇప్పుడు ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసినవే’ అని అన్నారు. ఇప్పుడు మళ్లీ మీ ముందుకొచ్చిన 28, 29, 30 డివిజన్లలోని బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. మరిన్ని నిధులు తెచ్చి ఇంకా అభివృద్ధి చేస్తా అని తెలిపారు.
- కాపు వాడ సభలో మాట్లాడుతూ ‘నేను ఇక్కడే పుట్టి పెరిగిన. కాపువాడ బిడ్డను. పెద్ద ఎత్తున పైసలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా‘ అని భరోసా ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మోదీ వద్దకు కార్పొరేటర్లను తీసుకుపోయి నిధులు తెస్తానని చెప్పారు.
ఫ నయాపైసా ఇవ్వని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలి..
కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ...కరీంనగర్ కార్పొరేషన్ కు నయాపైసా ఇవ్వని కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. గ్యారంటీలు, మేనిఫెస్టో హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలన్నారు. ఓట్లు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు, కరీంనగర్ ఇన్‌చార్జి డాక్టర్ జి మనోహర్‌రెడ్డితోపాటు 28, 29, 30, 35, 36 వార్డుల బీజేపీ అభ్యర్థులు కుర్ర రాజేశం, సోమిడి వేణు, నక్క సరితా సుభాషిణి, సాధవేని సుజాత, తోట అనిల్ పాల్గొన్నారు.