గ్యాంగ్‌లీడర్
ABN , Publish Date - May 14 , 2026 | 01:29 AM
అతనొక గ్యాంగ్‌లీడర్... బిహార్‌కు చెందిన అతడు ప్లాన రూపొందిస్తాడు.. అతడి అనుచరులు ఆచరిస్తారు.
- కిరాయి దొంగలతో పీఎంజే దోపిడీ
- ఐదుగురి పాత నేరస్థులకు టార్గెట్ ఫిక్స్
- ఆయుధాలను సమకూర్చింది గ్యాంగ్ లీడరే... అతడికే సొమ్ము అప్పగింత
కరీంనగర్ క్రైం, మే 13 (ఆంధ్రజ్యోతి): అతనొక గ్యాంగ్‌లీడర్... బిహార్‌కు చెందిన అతడు ప్లాన రూపొందిస్తాడు.. అతడి అనుచరులు ఆచరిస్తారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ ఇదే గ్యాంగ్‌లీడర్ డైరక్షనలో జరిగినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఆ గ్యాంగ్ లీడర్ తన అనుచరులకు కూడా కనిపించలేదని, ఆయన ఎవరో కూడా ఎవరికీ తెలియదని సమాచారం.. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం దోపిడీకి పాల్పడ్డ ఐదుగురికి పరిచయం లేదు. వీరందరినీ గ్యాంగ్‌లీడర్ ఎంపిక చేసి వాట్సప్ ద్వారా ఒక ముఠాగా ఏర్పాటు చేశాడు. అనంతరం వారికి టార్గెట్‌ను ఫిక్స్ చేశాడు. ఘటనకు రెండు రోజుల ముందు దోపిడీ దొంగలకు గుర్తుతెలియని వ్యక్తి ఐదు పిస్టళ్లను అందజేశాడు. ఆ ముఠా మే3న పీఎంజే జ్యువెలర్స్‌లో దోపిడీకి పాల్పడింది. అనంతరం దొంగలు దోచిన సొమ్ములతోపాటు ఆయుధాలను గ్యాంగ్ లీడర్ సూచించిన ఒక చిరునామాలో అప్పగించారు. అంతటితో వారి పని ముగిసింది. ఆ తరువాత దొంగలు ఎవరి స్థావరాలకు వారు వెళ్లిపోయారు.
ఫ నెల జీతానికి చోరీలు
కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్‌లో బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకుపోయింది అంతరాష్ట్ర కిరాయి దొంగల ముఠాగా పోలీసుల విచారణలో స్పష్టమైంది. బిహార్‌కు చెందిన ఒక పెద్ద రాబరీ గ్యాంగ్ లీడర్ ఈ దోపిడికి సూత్రధారి. ఆ గ్యాంగ్ లీడర్ రచించిన దోపిడీ పథకాన్ని ఐదుగురు కిరాయి దొంగలు అమలు చేశారని వెల్లడైంది. ఈ దొంగల్లో బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారున్నట్లు సమాచారం. కిరాయి దొంగలకు గ్యాంగ్ లీడర్ నెలనెలా జీతం ఇస్తూ చోరీలను చేయిస్తుంటాడని, పెద్ద దోపిడీ చేసినప్పుడు అదనంగా పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబుతాడని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
ఫ ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు..
కిరాయి దోపిడీ దొంగల్లో ఒకరికి మరొకరు పరిచయం లేకుండా ఇతర రాషా్ట్రలకు చెందినవారిని ఒక టీంగా ఏర్పాటు చేసి, వారికి ఒక టార్గెట్ ఇస్తూ, ఆ లీడరే వారికి ఆయుధాలను సమకూర్చుతుంటాడని తెలిసింది. పీఎంజే జ్యువెలర్స్ దోపిడడీ ఘటనలో ఐదుగురు దొంగలను ఎంపిక చేసి, టార్గెట్‌ను ఫినిష్ చేసేందుకు రెక్కీ కూడా గ్యాంగ్ లీడర్ డైరెక్షనలో నిర్వహించినట్లు తెలిసింది. దోపిడీ దొంగలు ఐదుగురికి మరో గుర్తుతెలియని వ్యక్తి ద్వారా ఐదు పిస్టళ్లను ఘటనకు రెండు రోజుల ముందు అందజేసినట్లు తెలిసింది. పని పూర్తికాగానే దోపిడీ సొమ్మును గుర్తు తెలియని వ్యక్తికి అందజేసిన దుండగులు ఎవరి స్వస్థలాలాకు వారు వెళ్లిపోయారు. దోపిడీ ఘటనలో నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాల పుటేజీలతోపాటు దుండగులు వాడిన సెల్‌ఫోనలే కీలకంగా పనిచేశాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరు దోపిడి ఘటనలో పాల్గొనగా, మరో ఇద్దరు వారికి సహకరించినవారుగా తెలుస్తోంది. ప్రధాన సూత్రధారి కోసం పోలీసుల వేట సాగుతున్నది.