Share News

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్‌

ABN , Publish Date - May 24 , 2026 | 12:16 AM

సిరిసిల్ల ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేసి వారి నుంచి 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5గ్రాముల వెండి ఆభరణాలు, మూడు బైక్‌లు, ఆటోలు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు.

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్‌

సిరిసిల్ల అర్బన్‌, మే 23 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేసి వారి నుంచి 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5గ్రాముల వెండి ఆభరణాలు, మూడు బైక్‌లు, ఆటోలు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు. సిరిసిల్ల పోలీస్‌ సబ్‌డివిజనల్‌ కార్యాలయంలో శనివారం టౌన్‌ సీఐ శ్రీనివాస్‌, టౌన్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్‌ చేసిన దొంగల ముఠాతోపాటు స్వాధీనం చేసుకున్న వాహనాలు, బంగారు అభరణాలను చూపించారు. అనంతరం జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ సిరిసిల్ల పట్ణణం బీవైనగర్‌కు చెందిన అడెపు రవి అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. పొద్దంతా పట్టణంలో రెక్కీ చేసి తన స్నేహితులైన కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన సామల్ల బాలకిషన్‌, వేములవాడ అర్బన్‌ మండలంలోని చింతల్‌ఠాణా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన బోదాసు గోపి, సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన వేముల సాయిచరణ్‌రెడ్డి, కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన గాజులవేణి అరుణ్‌ కుమార్‌, ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్‌ గ్రామానికి చెందిన మూల అభిలాష్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. రాత్రి సమయాల్లో తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. అడెపు రవి గతంలో 18 దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మళ్లీ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనాలు చేసి బంగారు, వెండి ఆభరణాలను అమ్మితే వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా సిరిసిల్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గతనెల 26వ తేదీ నుంచి ఈనెల 21వ తేదీవరకు తాళాలు పగులగొట్టి ఐదు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. యజమానుల ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. శనివారం నిందితులు ఏదైనా పెద్ద దొంగతనం చేయడానికి ఆటోలో వస్తుండగా నమ్మదగిన సమాచారంతో సిరిసిల్లలోని ఎల్లమ్మ సర్కిల్‌ వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిని విచారించగా దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు ముస్తాబాద్‌లోని కస్తూరి సాయితేజతో పాటు బంగారు, వెండి ఆభరణాలు వేములవాడ పట్టణానికి చెందిన శీలం సంతోష్‌రెడ్డికి అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేశామని చెప్పారని వివరించారు. దొంగల ముఠా నుంచి బంగారు, వెండి ఆభరణాలు, రూ.1500 నగదు, 3 బైక్‌లతోపాటు ఆటోలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దొంగల ముఠా నుంచి ఆభరణాలను కొనుగోలు చేసిన ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన టౌన్‌ సీఐ శ్రీనివాస్‌, టౌన్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌, సిబ్బంది పుల్కమ్‌ శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, మారుతి, రవి, నాంపెల్లి శ్రీనివాస్‌, నాగరాజు లను డీఎస్పీ నాగేంద్రచారి అభినందించారు.

Updated Date - May 24 , 2026 | 12:16 AM