అర్బన్ బ్యాంకు పీఐసీ కమిటీ చైర్మన్‌గా గడ్డం విలాస్‌రెడ్డి
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:40 PM
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జి కమిటీ (పీఐసీ) చైర్మన్‌గా రెండోసారి గడ్డం విలాస్‌రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు.
కరీంనగర్ టౌన్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జి కమిటీ (పీఐసీ) చైర్మన్‌గా రెండోసారి గడ్డం విలాస్‌రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు. నవంబరు 1న జరిగిన అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో నిబంధనలను పాటించకుండా అనేక తప్పిదాలకు పాల్పడ్డట్లు ఆధారాలతో గడ్డం విలాస్‌రెడ్డి వరంగల్‌లోని సహ కార ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన వరంగల్ ట్రిబ్యునల్ జడ్జి పాలకవర్గ ఎన్నికల ఫలితాలపై స్టే విధించారు. జూలై 2 నుంచి ఆ పాలకవర్గానికి బ్యాంకు కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఎలాంటి హక్కులేదని, ఎన్నికలకు ముందు ఉన్న పర్సన్ ఇన్‌చార్జి కమిటీ బ్యాంకు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించాలని జూలై 1న ఆదేశాలు జారీ చేశారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు బ్యాంకు సీఐవో నునుగొండ శ్రీనివాస్ డీసీవో నుంచి మౌఖిక అనుమతి తీసుకొని మంగళవారం గడ్డం విలాస్‌రెడ్డి చైర్మన్‌గా, ఆనాటి కమిటీ సభ్యులకు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా చైర్మన్ విలాస్‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని, డిపాజిటర్లు, ఖాతాదారులు, సభ్యులు అభద్రతకు లోనుకావద్దని కోరారు. నవంబరులో జరిగిన బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో అనేక తప్పిదాలు, లోపాలు జరిగాయని, వాటన్నింటిని ఆధారాలతో సహా ట్రిబ్యునల్‌లో దాఖలు చేయడంతో ఆదేశాలిచ్చారని తెలిపారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పనిచేస్తామని, ఇది న్యాయం తప్పకుండా గెలుస్తుందనడానికి నిదర్శనమని భావోద్వేగానికి గురయ్యారు. ట్రిబ్యునల్ తీర్పు ఇంకా పూర్తిగా రాలేదని, హైకోర్టులో కూడా మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా తీర్పులను గౌరవిస్తామన్నారు. తప్పిదాలకు పాల్పడిన ముగ్గురు అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులుగా మడుపు మోహన్, ఇ లక్ష్మణ్‌రాజు, విద్యాసాగర్, సందీప్, ముక్క భాస్కర్, మూల లక్ష్మి, షమీయొద్దీన్, మంగి రవీందర్, నాగుల సతీష్, మార్క రాజు బాధ్యతలు స్వీకరించారు.