Share News

మహిళల భద్రతకు పటిష్ట రక్షణ

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:26 AM

పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు చట్టపరమైన భరోసా కల్పించడంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంది. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పైవ్రేట్‌ సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్‌ మాల్స్‌, పారిశ్రామిక సంస్థల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి, కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు సంబంధించి 138 మహిళా రక్షణ కమిటీలు పనిచేస్తున్నాయి.

మహిళల భద్రతకు  పటిష్ట రక్షణ

ప్రభుత్వ, పైవ్రేట్‌ సంస్థల్లో 138 కమిటీలు

కలెక్టరేట్‌లోని 56 విభాగాలకు ప్రత్యేక కమిటీలు

మండల స్థాయి నుంచి కార్పొరేట్‌ సంస్థల వరకు పర్యవేక్షణ

షీ-బాక్స్‌ పోర్టల్‌లోనూ ఆన్‌లైన్‌ ఫిర్యాదులకు అవకాశం

పెద్దపల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు చట్టపరమైన భరోసా కల్పించడంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంది. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పైవ్రేట్‌ సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్‌ మాల్స్‌, పారిశ్రామిక సంస్థల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి, కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు సంబంధించి 138 మహిళా రక్షణ కమిటీలు పనిచేస్తున్నాయి. కలెక్టరేట్‌లోని 56 విభాగాలకు కమిటీలను ఏర్పాటు చేయగా, మండల స్థాయిలోనూ కమిటీలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్‌ రంగంలో మరో 56 కమిటీలు పని చేస్తున్నాయి.

ఫ 2013 చట్టంతో మహిళలకు రక్షణ

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధం, ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీ) ఏర్పాటు తప్పనిసరి. పది మందికంటే తక్కువ మంది పనిచేసే సంస్థల్లో లేదా యజమానిపైనే ఫిర్యాదు ఉన్న సందర్భాల్లో జిల్లా స్థాయి స్థానిక కమిటీని ఆశ్రయించవచ్చు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తన, లైంగిక ప్రయోజనాల కోసం ఒత్తిడి, బెదిరింపులు వంటి చర్యలను చట్టం పరిధిలోకి తీసుకుంటారు.

ఫ షీ-బాక్స్‌లో ఆన్‌లైన్‌ ఫిర్యాదు

మహిళలు తమకు ఎదురైన వేధింపులపై కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ షీ-బాక్స్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌సైట్‌లో స్వయంగా ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. సంబంధిత అంతర్గత లేదా జిల్లా స్థానిక కమిటీకి ఫిర్యాదు చేరేలా వ్యవస్థ పనిచేస్తుంది. ఫిర్యాదు పురోగతిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. బాధిత మహిళల వివరాలు, విచారణకు సంబంధించిన సమాచారం గోప్యంగా ఉంచేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయి.

ఫ 90 రోజుల్లో విచారణ..

ఫిర్యాదు అందిన తర్వాత సంబంధిత కమిటీ విచారణ చేపట్టి 90 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలి. ఆరోపణలు నిరూపితమైతే సంబంధిత ఉద్యోగిపై సర్వీసు నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా సిఫారసు చేస్తారు. నేర తీవ్రత ఆధారంగా సస్పెన్షన్‌, ఉద్యోగం నుంచి తొలగింపు వంటి చర్యలు ఉండవచ్చు. క్రిమినల్‌ నేరాలకు సంబంధించిన అంశాలుంటే పోలీసు కేసులు, చట్టప్రకారం జైలు శిక్షకు అవకాశం ఉంటుంది. అంతర్గత కమిటీని ఏర్పాటు చేయకపోవడం, చట్టం నిబంధనలు పాటించకపోవడం వంటి యాజమాన్య ఉల్లంఘనలకు మొదటిసారి రూ.50 వేల వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. పునరావృతమైతే రెట్టింపు జరిమానాతో పాటు సంస్థ లైసెన్సు రద్దుకు అవకాశం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా పారిశ్రామికంగా కీలక ప్రాంతం. సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, ఇటుక బట్టీలు, రైస్‌మిల్లులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థలు, వివిధ పరిశ్రమల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పనిచేస్తున్నారు. పని ప్రదేశాల్లో మహిళలకు ఎదురయ్యే సమస్య లను గుర్తించడం, ఫిర్యాదులను స్వీకరించడం, విచారణ చేపట్టడం, బాధితు లకు న్యాయం జరిగేలా చూడటం కమిటీల ప్రధాన బాధ్యతగా ఉంటుంది.

ఫ అవగాహన కార్యక్రమాలతో భరోసా

దయా అరుణ జిల్లా మహిళా సాదికారత కేంద్ర కో ఆర్డినేటర్‌

జిల్లాలో ఇప్పటికే మహిళా రక్షణ కమిటీల ఏర్పాటు, అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళలకు చట్టాలపై వివరించాం. పని ప్రదేశాల్లో ఎదురయ్యే వేధింపులు, వివక్ష, అసభ్య ప్రవర్తన, మానసిక ఒత్తిళ్లు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసి మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు 448 అవగాహన సదస్సులు నిర్వహించాం. మహిళలు తమకు ఎదురయ్యే సమస్య లను సంబంధిత కమిటీలకు ఫిర్యాదు చేయాలి.

.

Updated Date - Nov 07 , 2026 | 01:26 AM