Share News

డిఫాల్ట్‌ మిల్లులకు.. మళ్లీ ధాన్యం కేటాయింపులు

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:47 AM

ధాన్యం సేకరణ నుంచి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ ప్రభుత్వానికి అప్పగించే వరకు.. ప్రతిదశలోనూ పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉంది. కానీ జిల్లాలో డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్ల వ్యవహారం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.

డిఫాల్ట్‌ మిల్లులకు.. మళ్లీ ధాన్యం కేటాయింపులు

- ధాన్యం కేటాయింపుల్లో.. కొరవడిన పారదర్శకత?

- రూ.300కోట్లకు పైగా బకాయిలు.. అయినా కొనసాగుతున్న కేటాయింపులు!

- మిల్లర్లపైనే కాదు.. అధికారులపైనా విచారణ జరపాలంటున్న ప్రజలు

పెద్దపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణ నుంచి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ ప్రభుత్వానికి అప్పగించే వరకు.. ప్రతిదశలోనూ పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉంది. కానీ జిల్లాలో డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్ల వ్యవహారం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.300కోట్లకు పైగా ఉన్నప్పటికీ, ఆయామిల్లులకు తిరిగి ధాన్యం కేటాయింపులు జరగడం వెనుక మర్మమేమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నినెలలుగా జిల్లాలోని కొందరు రైస్‌మిల్లర్లు సీఎంఆర్‌ ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సివిల్‌ సప్లయి శాఖలోని కొందరు అధికారుల అండదండలు ఉన్నాయనే అనుమానాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఫ ఒక సీజన్‌ బకాయిలు తేలకుండానే.. మరోసారి కేటాయింపులా?

ఒక సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ బియ్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అప్పగించని మిల్లులకు, అదేమిల్లింగ్‌ యూనిట్లకు మరోసారి ధాన్యం కేటాయింపులు ఎలా చేస్తున్నారన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. గతంలోనే బకాయిలు ఉన్న మిల్లుల ఆర్థికపరిస్థితి, సీఎంఆర్‌ అప్పగింతల పురోగతి, రికవరీ స్థితిగతులను పరిశీలించకుండా కొత్తగా ధాన్యం కేటాయింపులు చేయడం వెనుక అధికారుల నిర్ణయాలేమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బకాయిలు ఉన్న మిల్లులకు మళ్లీ ధాన్యం కేటాయింపులు జరిగితే ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం, ధాన్యం బకాయిల రికవరీ మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ అధికారులపైనా విచారణ జరగాలి..

ఇప్పటికే డిఫాల్ట్‌ మిల్లర్ల నుంచి బకాయిల రికవరీ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే కేవలం మిల్లర్లపై కేసులు నమోదు చేయడం, ఆస్తుల వివరాలు సేకరించడం మాత్రమే సరిపోదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేసిన అధికారులు ఎవరు?.. బకాయిలు ఉన్నా, కేటాయింపులకు అనుమతులు ఎలా ఇచ్చారు?. సీఎంఆర్‌ బియ్యం అప్పగింతలపై పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?. నిబంధనల ఉల్లంఘనలు జరిగినప్పుడు అధికారులు ఎందుకు స్పందించలేదు?. అనే అంశాలపై కూడా విచారణ జరగాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ నిఘా వర్గాల దృష్టిలో అధికారుల పాత్ర?

రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లర్ల బకాయిలు, సీఎంఆర్‌ వ్యవహారాల్లో చోటుచేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై వివిధస్థాయిల్లో పరిశీలన జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలోనూ సంబంధిత అధికారుల నిర్ణయాలు, ధాన్యం కేటాయింపుల రికార్డులు, సీఎంఆర్‌ అప్పగింతల వివరాలు పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా స్థాయిలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందన్నది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.

ఫరికార్డుల పరిశీలనతోనే అసలు నిజాలు బయటకు!

గతసీజన్లలో ధాన్యం కేటాయింపులు ఎవరెవరికి జరిగాయి? ఏయే మిల్లులు ఎంతధాన్యం తీసుకున్నాయి? ఎంత సీఎంఆర్‌ బియ్యం ప్రభుత్వానికి అప్పగించాయి? ఎంత బకాయి మిగిలింది? బకాయిలు ఉన్నప్పటికీ తిరిగి కేటాయింపులు పొందిన మిల్లులు ఎన్ని? ఆయా కేటాయింపులకు ఆమోదం తెలిపిన అధికారులు ఎవరు? అనే అంశాలపై సమగ్రంగా రికార్డులు పరిశీలిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఫ బాధ్యులపై చర్యలు ఎప్పుడూ?

ప్రభుత్వ ధాన్యం, ప్రజాధనానికి సంబంధించిన ఈ వ్యవహారంలో తప్పు చేసిన మిల్లర్లతోతపాటు నిబంధనలను ఉల్లంఘించిన వారికి సహకరించినట్లు తేలిన అధికారులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. డిఫాల్ట్‌మిల్లర్ల బకాయిల రికవరీతోపాటు, వారికి తిరిగి ధాన్యం కేటాయించిన నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తానికి పెద్దపల్లి జిల్లాలో మిల్లర్ల బకాయిల వ్యవహారం ఇప్పుడు మిల్లర్లకే పరిమితం కాకుండా అధికారుల పాత్రపైనా ప్రశ్నలు లేవనెత్తుతోంది. బకాయిలు ఎందుకు పేరుకుపోయాయి? డిఫాల్ట్‌ మిల్లులకు మళ్లీ కేటాయింపులు ఎలా జరిగాయి? ఈ నిర్ణయాల వెనుక ఎవరున్నారు? అన్న ప్రశ్నలకు సమగ్ర విచారణే సమాధానం చెప్పాల్సి ఉంది.

Updated Date - Nov 02 , 2026 | 12:47 AM