ప్రాణహిత జలాల వినియోగంపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:21 AM
ప్రాణహిత నదీ జలాల వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి తాటిపర్తి జీవన రెడ్డి అన్నారు
- మాజీ మంత్రి తాటిపర్తి జీవన రెడ్డి
జగిత్యాల, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత నదీ జలాల వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి తాటిపర్తి జీవన రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన రెడ్డి మాట్లాడారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మేడిగడ్డ కుంగిపోయి రూ. లక్ష కోట్లు కొట్టుకుపోయింది అని అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్‌లు ఒక భాగం మాత్రమేనని తెలిపారు. మూడు బ్యారేజ్‌లు పునరుద్ధరించాలంటే సుమారు రూ. నాలుగు వందల కోట్లు మాత్రమే అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రాణహిత నది జలాలను వినియోగించునే విధముగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకే కాదు.. యావత రాషా్ట్రనికి ఆధారమన్నారు. హైదరాబాద్ నగర దాహార్తి తీర్చడంతో పాటు, పారిశ్రామిక అవసరాలకు, మూసీ ప్రక్షాళనకు కూడా ప్రాణహితపై ఆధార పడబోతున్నామని తెలిపారు.రాష్ట్రంలో తుమ్మడి హేట్టి బ్యారేజ్ తవ్విన కాలువలను రీ డిజైన చేయాలని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చిందని గుర్తు చేశారు. అయినా ఇప్పటివరకు డిజైన కూడా రూపొందించలేదని విమర్శించారు. మేడిగడ్డ పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మేడిగడ్డ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషనరెడ్డి విమర్శనాత్మకంగా చూడడమే తప్ప...నిర్మాణాత్మకంగా నీటిని వినియోగించుకునేలా ఆలోచించకపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు తాటిపర్తి దేవందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దుర్గయ్య, చల్‌గల్ సర్పంచ జున్ను రాజేందర్, రమేశ తదితరులు పాల్గొన్నారు.