‘భోజనం’పై దృష్టి..
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:46 AM
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలలు ప్రారంభం కాకముందే హెచ్‌ఎంలు. మధ్యాహ్నం భోజనం నిర్వాహకులకు శిక్షణ కూడా ఇచ్చారు. భోజనంలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరగకుండా ప్రతిరోజు జాగ్రత్తగా చర్యలు తీసుకునే దిశగా ఆదేశాలు ఇచ్చింది.
- పకడ్బందీగా మధ్యాహ్న భోజనం మెనూ అమలు
- పరిశీలనకు మానిటరింగ్ కమిటీలు
- నిర్వాహకులపై కోడిగుడ్డు భారం
- వారానికి మూడుసార్లు ఇవ్వలేక ఆందోళన
- జిల్లాలో 490 పాఠశాలలు.. 41 వేల మంది విద్యార్థులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలలు ప్రారంభం కాకముందే హెచ్‌ఎంలు. మధ్యాహ్నం భోజనం నిర్వాహకులకు శిక్షణ కూడా ఇచ్చారు. భోజనంలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరగకుండా ప్రతిరోజు జాగ్రత్తగా చర్యలు తీసుకునే దిశగా ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం మధ్యాహ్న భోజన పరిశీలనకు మానిటరింగ్ కమిటీలు వేశారు. పక్కాగా మెనూ అమలయ్యే విధంగా నిఘా పెట్టింది. కానీ నిత్యం సరుకుల ధరలు పెరిగిపోవడం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు భారంగా మారిన పరిస్థితుల్లోనే విద్యార్థులకు అందించే కోడిగుడ్డు ధర మరింత భారంగా మారింది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు ప్రభుత్వం చెల్లిస్తున్న బిల్లులకు ఏమాత్రం సరిపోకపోవడంతో లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 490 పాఠశాలలున్నాయి. ఇందులో 111 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలు, రెండు ప్రభుత్వ పాఠశాలలు, 13 కేజీబీవీ, 7 మోడల్ స్కూల్, 314మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 38 మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలు ఉండగా, 41 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 18,179 మంది, బాలికలు 20,450 మంది ఉన్నారు. వీరికి పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను భరిస్తోంది. ప్రభుత్వం మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రూ.6.78 పైసలు, ప్రాథమికోన్నత విద్యార్థులు 6 నుంచి8 వరకు రూ.10.17 పైసలు, ఉన్నత పాఠశాలలో 9,10 తరగతుల విద్యార్థులకు రూ.13.17 చెల్లిస్తున్నారు పారితోషికంగా రూ.3 వేలు ఇస్తున్నారు. కోడిగుడ్డుకు అదనంగా రూ.6 చెల్లిస్తున్నారు.
కోడిగుడ్డుతో రూ.2 అదనపు భారం
మధ్యాహ్న భోజనంలో వారానికి మూడుసార్లు విద్యార్థులకు కోడిగుడ్డు అందిస్తున్నారు. ప్రభుత్వం గుడ్డు అందించడానికి అదనంగా రూ.6 చెల్లిస్తున్నా భారంగానే మారింది. మార్కెట్లో కోడిగుడ్డు ధర 8రూపాయలకు చేరింది. దీంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒక కోడిగుడ్డుపై 2రూపాయల భారం మోయాల్సి వస్తోంది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు కోడిగుడ్డు అందించడం భారంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు 9,10 తరగతులకు గుడ్డు రేటు అదనంగా ఇవ్వడం లేదు. 100 మంది విద్యార్థులు ఉండే పాఠశాలలో వారానికి రూ.250 వరకు భారం పడుతుందని నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డు ధర రూ.10 రూపాయలు పెంచాలని కోరుతున్నారు.
తిథి భోజన్
మధ్యాహ్న భోజనంలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు తిథి భోజనం పేరుతో విద్యార్థులకు ఆహారం అందించే అవకాశం కల్పిస్తున్నారు. ప్రధానంగా ఎవరైనా ముఖ్యమైన సందర్భాల్లో పిల్లలకు భోజనం సమకూర్చవచ్చు. పుట్టినరోజు, పెళ్లిరోజు ఇతర ముఖ్యమైన రోజుల్లో స్వీట్లు, ఇతర తినుబండారాలు సమకూర్చే వీలును కల్పిస్తున్నారు.
ఒక్కోచోట.. ఒక్కో మెనూ..
ప్రభుత్వం పకడ్బందీగా మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణపై మెనూ అమలు చాలా పాఠశాలల్లో పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధన ప్రకారం సోమవారం కిచిడి, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, గుడ్డు, మంగళవారం రాగి జావా, సాంబార్, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, బుధవారం అన్నం ఆకుకూర పప్పు, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, గుడ్డు, గురువారం రాగి జావా, వెజిటేబుల్ బిర్యాని, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, శుక్రవారం అన్నం సాంబార్, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, గుడ్డు, శనివారం రాగి జావా, అన్నం, ఆకుకూర పప్పు మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ అందించాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్ల మెనూ పాటించడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా వెజిటేబుల్ కర్రీలు సాంబార్‌లాగా ఉంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మరోవైపు మధ్యాహ్న భోజనం అందించే సమయంలో నిబంధనలు ప్రభుత్వం జారీ చేసింది. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు శుచి, శుభ్రత పాటించేలా పలు నిబంధనలు అమలు చేస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించడానికి ముందు వంట కార్మికులు పీపీఈ కిట్లను వాడాలి. తలకు క్యాప్, అప్రాన్, చేతులకు గ్లౌజులు, ఫేస్ మాస్క్ ధరించాలి. పదార్థాలు 65 డిగ్రీల వేడిలో వడ్డించాలి. రక్షిత మంచినీరు అందించాలి. కానీ నిబంధనలు నామమాత్రంగానే పాటిస్తున్నారు.