వరి సాగుపైనే మొగ్గు
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:44 AM
ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నా రైతులు వరి సాగుపైనే మొగ్గు చూపుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నా రైతులు వరి సాగుపైనే మొగ్గు చూపుతున్నారు. చివరి దశలో పం టలు ఎండిపోకుండా ఉండేందుకు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తున్నా కూడా రైతులు ముమ్మరంగా వరి నాట్లు వేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 2,11,611 ఎకరాలకు గాను, ఇప్పటి వరకు 2,05,112 ఎకరాల్లో 98.9 శాతం వరి నాట్లు వేశారు. పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటల్లోకి నీళ్లు రావడంతో పాటు బోరు బావులు, వ్యవసాయ బావుల్లో కూడా భూగర్భ జలాలు పెరగడంతో రైతులు ధైర్యం చేసి వరి నాట్లు వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రైతాంగం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపైనే ఆధారపడి పంటలను సాగు చేస్తోంది. ఎస్సారెస్పీ డి-83, డి-86 కాలువల ద్వారా దాదాపు లక్షా 76 వేల ఎకరాలకు యేటా సాగు నీరందుతున్నది. అయితే ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిస్థితి ఆశాజనకంగా లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 43.65 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులోకి 60 టీఎంసీలు వస్తే గానీ, ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేసే అవకాశాలు లేవు. ప్రాజెక్టు ఎగువ భాగాన మహారాష్ట్ర పరిధిలో గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. వాటి ఎగువ భాగాన కురిసే వర్షాల వల్ల వచ్చే వరద నీటిని వచ్చినట్లే దిగువకు వదిలి పెట్టనున్నారు. ఆ నీరంతా ఎస్సారెస్పీలోకి వస్తుంది. అయితే వర్షాలు పడక పోతాయా, 60 టీఎంసీలకు ప్రాజెక్టు చేరక పోతుందా అనే ఆశతో రైతులు ఉన్నారు. జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి ఇప్పటి వరకు మిడ్ మానేరుకు సుమారు 16 టీఎంసీల నీటిని తరలించగా, అక్కడి నుంచి ఎల్‌ఎండీకి వదిలి పెడుతున్నారు. ఒకవేళ ఈ సీజన్‌లో ఎస్సారెస్పీకి సరిపడా నీళ్లు రాకుంటే లింకు కెనాల్ ద్వారా జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఎల్లంపల్లి నీటిని వాడుకునే అవకాశాలున్నాయి. ఆ భరోసాతోనే రైతులు ఎక్కువగా వరి నాట్లు వేస్తున్నారు..
ఫ జిల్లాలో 2,05,112 ఎకరాల్లో వరి నాట్లు..
ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2,79,517 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న వివిధ రకాల పంటలను సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 2,57,661 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో వరి 2,11,611 ఎకరాలకు గాను, 2,05,112 ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారని జిల్లా వ్యవసాయ శాఖాధికారి బి శ్రీనివాస్ తెలిపారు. మిగతా పత్తి, మొక్కజొన్న పంటలు వేశారని తెలిపారు. వర్షాల రీత్యా సాధారణ వర్షపాతం 551.6 మిల్లీమీటర్లకు గాను, 581.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంతర్గాం, కమాన్‌పూర్, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో సాధారణా నికి మించి వర్షాలు కురవగా, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లో సాధారణం కంటే తక్కువే వర్షం పడింది. మిగతా మండలాల్లో సాధారణ స్థితికి చేరుకున్నాయి. వర్షాలు పడడం వల్లనే రైతులు ఎక్కు వగా వరి నాట్లు వేస్తున్నారు. వారం రోజుల నుంచి అక్కడక్కడా చిరు జల్లులు మాత్రమే పడుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలలో భారీ వర్షాలు పడతాయని, ఎస్సారెస్పీ ద్వారా కూడా నీళ్లు వస్తాయనే భరోసాతో రైతులు నాట్లు వేస్తున్నారు. గత ఏడాది ఎస్సారెస్పీ నుంచి ఆగస్టు 17న ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఆ నీళ్లు జిల్లాకు చేరుకునే సరికి మూడు రోజులు పట్టింది.