Share News

ఇందిరమ్మ ఇళ్లపై ఫోకస్‌

ABN , Publish Date - Apr 25 , 2026 | 02:02 AM

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం ముందుకు సాగక ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని గమనించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పూర్తయ్యే సరికి జిల్లాలో 3,318 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి గృహప్రవేశాలు జరిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

ఇందిరమ్మ ఇళ్లపై ఫోకస్‌

- ప్రజాపాలన కాలంలో 3,318 గృహప్రవేశాల లక్ష్యం

- ఏప్రిల్‌ మాసాంతానికి 1,659 ఇళ్ల పూర్తి

- జిల్లాలో 10,779 ఇళ్ల మంజూరు

- ప్రగతిలో 6,880 ఇళ్లు

(కరీంనగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం ముందుకు సాగక ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని గమనించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పూర్తయ్యే సరికి జిల్లాలో 3,318 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి గృహప్రవేశాలు జరిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నెలాఖరు వరకు 1,659 ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నెల 23 వరకు ఇప్పటికే 1,097 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పనులు వేగవంతంగా జరిగేందుకు డబ్బు చెల్లింపును వేగవంతం చేయడమే కాకుండా నిర్మాణాల విషయంలో కొంత సడలింపు ఇచ్చి డబ్బు చెల్లిస్తున్నది. ప్రజా పాలన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 2,04,523 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇళ్ల స్థలాలు ఉండి పక్కా ఇళ్లు లేని వారు చేసుకున్న దరఖాస్తులను ఎల్‌-1లో పొందుపరిచారు. ఈ విభాగం కింద 77,023 దరఖాస్తులు వచ్చాయి. పక్కా ఇళ్లు, ఇంటి స్థలం కూడా లేని వారిని ఎల్‌-2 జాబితాగా పేర్కొన్నారు. అలాంటి ఆరి దరఖాస్తులు 48,899 వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో 10,779 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఇళ్ల స్థలం ఉండి పక్కా ఇళ్లు లేని వారికి తొలివిడతలో మంజూరు లభించింది. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 1351, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 1160, చిగురుమామిడి మండలంలో 341, మానకొండూర్‌ మండలంలో 852, శంకరపట్నం మండలంలో 546, గన్నేరువరం మండలంలో 307, హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో 264, హుజూరాబాద్‌ మండలంలో 404, సైదాపూర్‌ మండలంలో 585, జమ్మికుంట మున్సిపాలిటీలో 345, జమ్మికుంట మండలంలో 359, చొప్పదండి మండలంలో 584, కొత్తపల్లి పాత మున్సిపల్‌ పరిధిలో 204, కొత్తపల్లి మండలంలో 519, వీణవంక మండలంలో 468, రామడుగులో 737, చొప్పదండి మున్సిపాలిటీలో 110, తిమ్మాపూర్‌ మండలంలో 596, గంగాధరలో 711, ఇల్లందకుంట మండలంలో 336 ఇళ్లను మంజూరు చేశారు. వీటిలో 870 ఇళ్లకు ఇంజనీరింగ్‌ అధికారులు మార్కవుట్‌ చేయగా 6,870 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 1,340 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌లో 843 ఇళ్లు రూఫ్‌ లెవల్‌లో 3,876 ఇళ్లు స్లాబ్‌ లెవల్‌లో 811 ఇళ్లు దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్నాయి. జూన్‌ 12కు ప్రజాపాలన ప్రగతి పథం 99 రోజుల కార్యాచరణ పూర్తవుతున్న దశలో 3,318 ఇళ్ల గృహప్రవేశాలు చేయించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 3876 ఇళ్లు రూఫ్‌ లెవల్‌కు రావడంతో ఫినిషింగ్‌ పనులు పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులు లబ్ధిదారులను నిత్యం కలుస్తూ పనులు వేగవంతం చేయిస్తున్నారు. మొదటి విడత మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావస్తున్న దశలో రెండవ విడత మంజూరు ఇస్తారని తెలుస్తున్నది.

ఫ వేగవంతంగా ఇళ్ల నిర్మాణ పనుల

- గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో గృహప్రవేశాలు చేసేందుకు నిర్మాణ పనులను చకచకా చేస్తూ ముందుకు సాగుతున్నారు. 3,318 ఇళ్ల గృహ ప్రవేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగా ఇళ్ల నిర్మాణాల పనులు సాగుతున్నాయి. జూన్‌ 12న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ముగుస్తున్న నేపథ్యంలో వీలైనన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

Updated Date - Apr 25 , 2026 | 02:02 AM