Share News

కూలీల హాజరు శాతం పెంపుపై దృష్టి

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:11 AM

వీబీజీరాంజీ పనుల్లో కూలీల హాజరు శాతం మరింత పెంచాలని డీఆర్‌డీవో రఘువరన్‌ సూచించారు.

కూలీల హాజరు శాతం పెంపుపై దృష్టి
పోతారంలో పనులను పరిశీలిస్తున్న డీఆర్‌డీవో రఘువరన్‌

డీఆర్‌డీవో రఘువరన్‌

కథలాపూర్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : వీబీజీరాంజీ పనుల్లో కూలీల హాజరు శాతం మరింత పెంచాలని డీఆర్‌డీవో రఘువరన్‌ సూచించారు. మండలంలోని పోతారంలో చేపడుతున్న ఫారం పాండ్‌, పర్యులేషన్‌ ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా నిర్ణయించిన లక్ష్యం నెరవేరేలా చూడాలని సిబ్బందికి చెప్పారు. ప్రస్తుతం గ్రామాల్లో రోజువారీగా కనీసం వంద మంది పనులకు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. డబ్బులు ఖాతాల్లో ప్రతీ నెలా పడుతున్నాయా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఫారం పాండ్ల నిర్మాణాలు భూగర్భ జలాలను పెంచుతాయని పల్లెల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ఎల్‌నినో ప్రభావాన్ని నీటి కుంటల నిర్మాణాలతో అధిగమించడానికి అవకాశం ఉందన్నారు. పోతారంలో ఏడు నీటి కుంటల లక్ష్యం నిర్ణయించగా ఇప్పటికే నాలుగు పూర్తి చేయడం పట్ల స్థానిక ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ముస్కం లక్ష్మణ్‌, సర్పంచ్‌ ధర్మపురి స్వప్నజలంధర్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మాలోతు శంకర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు ఎగ్యారపు శ్రీధర్‌, అంబాజీ, పంచాయతీ కార్యదర్శి అశోక్‌, కూలీలు ఉన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:11 AM