Share News

చేపల వేట నిషేధం

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:39 AM

జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో జూలై, ఆగస్టు మాసాల్లో మత్స్యకారులు చేపలు పట్టవద్దని మత్స్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

చేపల వేట నిషేధం

జగిత్యాల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో జూలై, ఆగస్టు మాసాల్లో మత్స్యకారులు చేపలు పట్టవద్దని మత్స్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ఉల్లఘించి ఎవరైనా చేపలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జూలై, ఆగస్టు నెలల్లో చేపల పునరుత్పత్తి ప్రక్రియ ఉంటుంది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి చేపల పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీయవద్దని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో, ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌ జలాశయంలో మానిటరింగ్‌ కమిటీ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఫజిల్లాలో మత్స్య శాఖ పరిస్థితి ఇలా..

జిల్లా వ్యాప్తంగా 275 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 19,220 మంది సభ్యులున్నారు. ఇందులో 88 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 4,217 మంది మహిళలు, 187 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 15,003 మంది పురుష మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 511 గ్రామ పంచాయతీ చెరువులకు 3,130 హెక్టార్ల విస్తీర్ణం, 185 డిపార్ట్‌మెంట్‌ చెరువులకు 15,162 హెక్టార్ల విస్తీర్ణం ఉంది. ఒక రెండు కిలోల చేప నుంచి సుమారు రెండు లక్షలకు పైగా పిల్లలు పునరుత్పత్తి అవుతాయని మత్స్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందులో 10 శాతం బతికినా 20వేల చేపలు ఉత్పత్తి అవుతాయి. ఈ రెండు నెలల్లో ఒక్క చేపను కోల్పోయినా దాని నుంచి వచ్చే చేప పిల్లలను కోల్పోయినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు జలాశయాల్లో చేప పిల్లల సంఖ్యను పెంచేందుకు మత్స్య శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చేపల పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు మత్స్యకారులను హెచ్చరిస్తున్నారు.

ఫచెరువుల్లోని చేపలతోనే ఉత్పత్తి..

కొన్నేళ్లుగా జిల్లాలో ప్రధాన జలాశయాలతో పాటు చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను వదులుతున్నారు. గత యేడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 1.68 కోట్ల సబ్సిడీ చేప పిల్లలను విడుదల చేయాలనే లక్ష్యానికి గాను సుమారు 60 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. చేప పిల్లలను చెరువులో వదిలే సమయం సరిగా లేకపోడంతో చిన్న చేప పిల్లలను పెద్దవి తినడంతో పాటు వాతావరణం సహకరించక కొన్ని చేప పిల్లలు మృతి చెందడంతో ఈ పథకం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న చేపలను రెండు నెలల పాటు వేటాడకుండా వదిలేస్తే ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలు అవసరం లేకుండా చెరువుల్లోని చేపలతోనే లక్షల చేప పిల్లలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందం టున్నారు. ఈ మేరకు జిల్లాలో నెలకు సుమారు 450 టన్నుల చేప పిల్లలు ఉత్పిత్తి అయ్యే అవకాశం ఉందని మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు.

ఫనిషేధం ఎందుకంటే...

వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఈ సమయంలో చేపల్లో పునరుత్పత్తి హార్మోన్‌ బలంగా వృద్ధి చెందుతుంది. జూలై, ఆగస్టు మాసాల్లో చేపలు తమ పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. దీంతో చేప పిల్లలు బయటకు వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జలాశయాల్లోకి కొత్త నీరు వస్తుండడంతో పాటు చెత్తా చెదారం కొట్టుకొచ్చి నీళ్లపై తేలుతూ ఉంటుంది. ఈ సమయంలో చెత్తా చెదారం కింది భాగంలో ఆడ చేపలు గుడ్లపై పొదుగుతుంటాయి. వాటిపై సూర్యరశ్మి పడి రెండు మూడు రోజుల్లోనే గుడ్ల నుంచి చేప పిల్లలు బయటకు వస్తాయి. ఈ ప్రక్రియంతా జూలై, ఆగస్టు నెలల్లో మూడు నుంచి ఐదు సార్లు జరుగుతుంది.

రెండు నెలలు చేపలు పట్టొద్దు..

-సురేశ్‌, జిల్లా మత్స్య శాఖ అధికారి

జూలై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌ జలాశయం, గోదావరి తదితర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధించాం. ఈ రెండు నెలల్లో ఒక చేపను పట్టినా లక్షల చేప పిల్లలు పుట్టకుండా చేసినట్లే. జూలై, ఆగస్టు నెలల్లోనే చేపలు పునరుత్పత్తి చేస్తుంటాయి. జలాశయాల్లోని చేపలకు ఇబ్బంది కలగకుండా మత్స్యకారులు సహకరించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 2026-27 సంవత్సరానికి లైసెన్సులు జారీ చేయం.

Updated Date - Jul 08 , 2026 | 12:39 AM