చేప పిల్లలు రెడీ..
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:09 AM
మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీ ప్రక్రియపై ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈసారి నీలినీడలు కమ్ముకున్నాయని మత్స్యకారులు భావించారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీ ప్రక్రియపై ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈసారి నీలినీడలు కమ్ముకున్నాయని మత్స్యకారులు భావించారు. వానాకాలం మొదలై రెండు నెలలు గడిచినా సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో ఉచిత చేపపిల్లల పథకంపై అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ప్రభుత్వం చేపపిల్లల సరఫరాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మత్స్యకారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరుతోంది. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా కొంత ఆలస్యంగానైనా టెండర్ ప్రక్రియ ప్రారంభించడానికి మత్స్యశాఖ కసరత్తు ప్రారంభించడంతో ఈసారి మత్స్యకారులకు ఉపాధికి ఇబ్బంది లేదని భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ అధికారులు 2026-27 యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి రెండు మూడు రోజుల్లోనే టెండర్ ప్రక్రియ ప్రారంభించి, సెప్టెంబర్ చివరి వరకు పంపిణీ పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించారు.
గత సంవత్సరం 1.35 కోట్ల చేపపిల్లల పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఏటా ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత చేప పిల్లల పథకం ద్వారా చేపలను పెంచి మత్స్యకారులు జీవనోపాధిని పొందుతున్నారు. జిల్లాలో గత సంవత్సరం 348 చెరువులు, కుంటలు, శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టు, ఎగువ మానేరు ప్రాజెక్ట్, అన్నపూర్ణ ప్రాజెక్ట్, మల్కపేట ప్రాజెక్టులో 1.35 కోట్ల చేప పిల్లలను వదిలారు. నాలుగు రకాల చేప పిల్లలు ప్రధానంగా బొచ్చె, రవులు, బంగారు తీగ, మేరియా రకాల పిల్లలను వదిలారు. ఈసారి 2026-27 సంవత్సరానికి మత్స్య శాఖ రూపొందించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం 1,48,45,479 చేప పిల్లలను జిల్లాలోని 456 చెరువులు, నాలుగు ప్రాజెక్టుల్లోకి వదలనున్నారు. జిల్లాలోని ప్రధాన శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టులోకి 28.50 లక్షలు, నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులోకి 10.50 లక్షలు, అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టులోకి 1369500 లక్షలు, చెరువుల్లోకి దాదాపు 95 లక్షల చేప పిల్లలను వదిలే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి చేప పిల్లలు పంపిణీ చేసే ముందు జిల్లా అధికారుల బృందం క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు, చెరువులను పరిశీలించి టెండర్లను ఫైనల్ చేస్తారు. వివిధ సైజుల్లో చేప పిల్లలను సరఫరా చేయడానికి టెండర్లను ఆహ్వానిస్తారు. చేప పిల్లల సరఫరా టెండర్లపై కాంట్రాక్టర్లు గతంలో ఆసక్తి చూపకపోవడంతో పలుమార్లు టెండర్లకు ఆహ్వానించాల్సి వచ్చింది. వర్షాకాలం ఆరంభంలోనే సమృద్ధిగా వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులోకి నీరు చేరడంతోనే ఉచిత చేప పిల్లలు వదిలితే ఉత్పత్తి పెరుగుతుందని మత్స్యకారులు అంటున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చేప పిల్లలు వేస్తే ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చేపలు కిలో వరకు సైజు పెరగాలంటే కనీసం 6 నెలల సమయం పడుతుంది. జూలై, ఆగస్టు మాసాల్లో చెపపిల్లలను వదిలితేనే విక్రయించే అవకాశాలు ఉంటాయని మత్స్యకారులు చెప్తున్నారు.
జిల్లాలో మత్స్య సహకార పరిస్థితి ఇది...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్య కారులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉపాధిని అందుకుంటున్నారు. జిల్లాలో మత్స్య శాఖ పరిధిలో 401 చెరువులు ఉన్నాయి. 168మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, 9220 మంది సభ్యులు ఉన్నారు. 48 మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, రెండు ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం వరకు మిడ్ మానేరులో చేపలు పట్టడానికి 741 మంది మత్స్యకారులకు, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లో 251 మంది, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లో 52 మంది మత్స్యకారులకు లైసెన్స్‌లు జారీ చేశారు.
చేపపిల్లలు చెరువుల్లో వదిలిన తీరు
సంవత్సరం చెరువులు /కుంటలు వదిలినవి
2016- 17 92 30.5 లక్షలు
2017- 18 66 20 లక్షలు
2018- 19 95 57.48 లక్షలు
2019- 20 313 100.91 లక్షలు
2020- 21 362 115.61 లక్షలు
2021- 22 392 119.25 లక్షలు
2022 -23 392 138.27 లక్షలు
2023 -24 440 141.00 లక్షలు
2024-25 324 46.71 లక్షలు
2025 -26 348 135.6 లక్షలు
2026-27 456 148.45 లక్షలు