Share News

అంగన్‌వాడీల్లో ‘తొలిముద్ద’

ABN , Publish Date - Apr 08 , 2026 | 01:36 AM

గర్భం దాల్చిన నాటిన నుంచి చిన్నారుల ఎదుగుదల వరకు పౌష్టికాహారం అందించే ఆరోగ్య కేంద్రాలుగా అంగన్‌వాడీలు పనిచేస్తున్నాయి. చిన్నారులకు ఆటపాటలతో ప్రీ ప్రైమరీ విద్యను అందించడంతోపాటు గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలకు పౌష్టికాహారం అందిస్తున్నారు.

అంగన్‌వాడీల్లో ‘తొలిముద్ద’

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

గర్భం దాల్చిన నాటిన నుంచి చిన్నారుల ఎదుగుదల వరకు పౌష్టికాహారం అందించే ఆరోగ్య కేంద్రాలుగా అంగన్‌వాడీలు పనిచేస్తున్నాయి. చిన్నారులకు ఆటపాటలతో ప్రీ ప్రైమరీ విద్యను అందించడంతోపాటు గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం తాజాగా చిన్నారులకు పౌష్టికాహార లోపాన్ని అధిగమించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోని తొలి ముద్ద బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించగా అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్‌ కోసం సన్నాహాలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 586 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. 40 వేల లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో 3,234 మంది గర్భిణులు, 2600 మంది బాలింతలు, మూడు సంవత్సరాల్లోపు పిల్లలు 13,302 మంది, మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు 7,841 మంది పిల్లలు ఉన్నారు. ఇందులో బ్రేక్‌ఫాస్ట్‌కు అర్హులు దాదాపుగా 17,837మంది ఉన్నారు. ఇప్పటికే ఏడు నెలల నుంచి మూడేళ్ల వరకు వయసున్న చిన్నారులకు బాలామృతం, ప్రతినెల 16 కోడిగుడ్లు అందిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు, బాలింతలకు ప్రతిరోజు ఉడికించిన కోడిగుడ్డు, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇదే క్రమంలో చిన్నారులు ఉదయం వేళల్లో ఇళ్ల వద్ద ఏమి తినకుండానే అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న వారు ఉన్నారు. వీరు మధ్యాహ్నం వరకు నీరసించిపోయే పరిస్థితి ఉండడంతో చిన్నారులకు తొలిముద్దు బ్రేక్‌ఫాస్ట్‌ పేరుతో పోషకాహారం అందించనున్నారు.

ఉప్మా.. కిచిడి..

అంగన్‌వాడీ వచ్చే చిన్నారులు పోషకాహార లోపాన్ని అధిగమించే దిశగా పిల్లల ఎత్తు, బరువు ద్వారా పోషణ లోపం, తీవ్ర పోషణ లోపాన్ని గుర్తించి అంగన్‌వాడీ టీచర్లు ఆన్‌లైన్‌ చేస్తున్నారు. పోషణ్‌ ట్రాకర్‌, ఎల్‌హెచ్‌ఏఎస్‌ యాప్‌లో వివరాలు పొందుపరుస్తూ పోషణ పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ వారికి పోషకాహారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు తొలిముద్ద బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమంలో చిన్నారులకు ఉప్మా, కిచిడి అందిస్తారు. ప్రభుత్వమే పోషకాల మిశ్రమం కలిగిన సామగ్రి పంపించనుంది. చిన్నారుల ఎత్తు, మానసిక ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా విటమిన్లు, ప్రోటీన్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పేద కుటుంబాల చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఖాళీలతో ఇబ్బంది..

అంగన్‌వాడీ కేంద్రాల్లో తొలిముద్ద బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అమలుచేయడంలో టీచర్‌, ఆయాల ఖాళీలు ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. 586 అంగన్‌వాడీ కేంద్రాల్లో 235 పైగా ఖాళీలు ఉన్నాయి. ఇందులో 55 టీచర్లు, 180 ఆయాలు ఖాళీలు ఉన్నాయి. టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యత పక్కనే ఉన్న కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో అదనపు భారం మోయాల్సి వస్తోంది. ఈక్రమంలోనే చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్‌ అందించడం కూడా ఇబ్బందికరంగానే మారుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రారంభానికి సన్నాహాలు

- లక్ష్మీరాజం జిల్లా సంక్షేమ అధికారి

అంగన్‌వాడీ కేంద్రాల్లో బాల్యం దశలోనే చిన్నారులకు వయస్సుకు తగిన పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తొలిముద్ద బ్రేక్‌ ఫాస్ట్‌ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 586 అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్‌కు సన్నాహాలు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతోనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం.

Updated Date - Apr 08 , 2026 | 01:36 AM