Share News

అంగనవాడీ కేంద్రాల్లో ‘తొలిముద్ద’

ABN , Publish Date - Apr 06 , 2026 | 02:18 AM

అంగనవాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అంగనవాడీ కేంద్రాల్లో ‘తొలిముద్ద’

గణేశనగర్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): అంగనవాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిముద్ద పేరిట చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంతరెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. జిల్లాలో చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. చిన్నారులు చాలా మంది ఎత్త్తుకు తగ్గ బరువు లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లోపాన్ని అధిగమించేందుకు ఈ పథకం దోహదపడనుంది. జిల్లాలో త్వరలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ జిల్లాలో 777 అంగనవాడీ కేంద్రాలు

జిల్లాలో 777 అంగనవాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మూడేళ్లు నిండిన చిన్నారులు 22,046 మంది ఉన్నారు. ప్రస్తుతం ఏడు నెలల నుంచి మూడేళ్ల వరకు చిన్నారులకు బాలామృతం, నెలకు 16 కోడిగుడ్లు ఇస్తున్నారు. అంగనవాడీ కేంద్రాలకు వచ్చే మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజు ఉడికించిన గుడ్డు, ఒక పూట భోజనం పెడుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, సాంబరు వడ్డిస్తున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలకు ఈ కార్యక్రమం అమలవుతుంది. అయితే మధ్యాహ్నం తర్వాత చిన్నారులకు భోజనంతో వారు నీరసించిపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చిన్నారులకు కిచిడి, ఉప్మా తదితర అల్పాహారం అందించే ఏర్పాట్లు చేసింది. చిన్నారులకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తొలిముద్ద కార్యక్రమాన్ని చేపడుతోంది.

ఫ చిన్నారుల హాజరు శాతం పెంచేందుకు..

జిల్లాలో అంగనవాడీ కేంద్రాలకు వచ్చే చాలా మంది చిన్నారుల తల్లిదండ్రులు వారి వారి పనులకు వెళ్తుంటారు. ఉదయం పూట చిన్నారులు ఇంట్లో తినీతినకుండానే కేంద్రాలకు వెళ్లడంతో అక్కడ నీరసించిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో వీరికి భోజనం పెడతారు. చాలా మంది చిన్నారులు 10 గంటలు దాటితే కానీ కేంద్రాలకు రావడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలు నడుస్తుండగా, చాలా కేంద్రాల్లో చిన్నారుల గైర్హాజరు కనిపిస్తోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో చిన్నారులు తొమ్మిది గంటల వరకే కేంద్రానికి వచ్చినా అల్పాహారం ఇవ్వడంతో తిని కేంద్రంలో ఉంటారు. చిన్నారుల హాజరు శాతం పెరుగుతుంది.

ఫ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు తొలిముద్ద

ఎం సరస్వతి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి

అంగనవాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో పోషకాహారం లోపం అధిగమించేందుకు తొలిముద్ద కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో త్వరలోనే ప్రారంభిస్తాం. చిన్నారుల గైర్హాజరు శాతం తగ్గుతుంది.

Updated Date - Apr 06 , 2026 | 02:18 AM