Share News

పొలాల్లో మంటలు..

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:10 AM

యాసంగి సీజన్‌ ముగిసిపోయింది. ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు భూమిని సాగుకు సిద్ధం చేసుకోవడానికి పంట వ్యర్థాలను తగలబడుతున్నారు.

పొలాల్లో మంటలు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

యాసంగి సీజన్‌ ముగిసిపోయింది. ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు భూమిని సాగుకు సిద్ధం చేసుకోవడానికి పంట వ్యర్థాలను తగలబడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు భూముల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా భూసారానికి ముప్పు ఏర్పడుతుందని.. అలాగే కాలుష్యం కోరల్లో పల్లెలు చిక్కుకుంటున్నాయని చెబుతున్నా రైతుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కోతలు పూర్తికాగానే వరి కొయ్యలు, మొక్కజొన్న, పత్తి వ్యర్థాలను తగలబెడుతున్న మంటలు భూముల్లో ఎగిసిపడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్న రైతులు గ్రామాల్లో వ్యర్థాలను తగలబడుతున్న క్రమంలో పొగ కమ్ముకొని ఊపిరాడక మృత్యువాత పడుతున్నారు. ఈ సీజన్లో ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో రైతు ఎలుక నారాయణ మృతిచెందాడు. దీంతోపాటు ఇతర నష్టాలు కూడా రైతులు చూస్తున్నారు. పొలంలో పెట్టిన నిప్పు వల్ల ఇతర పొలాల్లోకి వ్యాపించడంతో బోరుబావుల వద్ద ఉన్న విలువైన వస్తువులు తగలబడి పోతున్న సంఘటనలు ఉన్నాయి. ప్రధానంగా పొలాల వద్ద ఈత, తాటి వనాలు దగ్ధం కావడంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. రహదారులపై వెళ్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

నిప్పు పెట్టడం నష్టమే..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో ప్రధానంగా వరి సాగు చేస్తారు. రైతులు ప్రస్తుతం హార్వెస్టర్ల ద్వారానే వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఎక్కువ భాగం మిగిలిపోతున్నాయి. వాటిని నిప్పుపెట్టి కాల్చడం ద్వారా త్వరగా భూమి చదును అవుతుందని రైతులు భావిస్తున్నారు. నిప్పు పెట్టడం వల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో గాలి కాలుష్యం పెరగడం, విపరీతమైన పొగవల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా మంట వేడికి మట్టిలోని నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు నశించి నేల నిస్సారంగా మారుతుంది. రైతులకు మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు, సూక్ష్మజీవులు నశిస్తాయి. దీనివల్ల గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీసి వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పంట వ్యర్థాలను తగలబెట్టే బదులు భూమిలోనే కలియదున్నడం ఎంతో మేలు జరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరి కోతలు ముగియగానే నేల గట్టిపడిన అనంతరం నీళ్లు పెట్టి రొటోవేటర్‌తో వరి కొయ్యలు, ఇతర వ్యర్థాలను పొలంలోనే కలియదున్నడం వల్ల వర్మీ కంపోస్ట్‌గా తయారై పంటకు మేలుచేసే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంట వ్యర్థాలను పొలంలోనే ఉంచడం ద్వారా మంచి ఎరువుగా మారి మరింత దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా రసాయన ఎరువులు అధిక మోతాదులో వినియోగించే అవకాశం తగ్గుతుందని, రైతులకు కొంత మేరకు ఆర్థిక భారం కూడా తగ్గిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కఠిన చర్యలకు జీవో 27 జారీ

పంట పొలాల్లో వ్యర్థాలను తగలబెట్టే రైతులు, యాజమాన్యాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడానికి నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పంట వ్యర్థాల దాహనాన్ని పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్‌ 27 జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పర్యావరణ పరిహారం పేరుతో భారీ జరిమానాలు విధిస్తారు. సాధారణ వ్యర్థాలు కాలిస్తే రూ 5 వేలు, భారీ స్థాయిలో తగలబెడితే రూ 25వేల వరకు జరిమానాలు విధిస్తారు. రైతులే కాకుండా ప్రైవేట్‌ సంస్థలు, కమ్యూనిటీలు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఆయా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు జరిమానా వసూలు చేస్తాయి. స్థానిక సంస్థలే వ్యర్థాలను కాలుస్తే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారిపై చర్యలు తీసుకుంటుంది.

ఖరీఫ్‌లో 2.48 లక్షల ఎకరాల్లో సాగు..

జిల్లాలో ఖరీఫ్‌లో 2 లక్షల 48 వేల 507 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇందులో వరి లక్షా 91 వేల366 ఎకరాలు, పత్తి 47120ఎకరాలు, పెసర 65 ఎకరాలు, కందులు 853 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 3430 ఎకరాలు, ఇతర పంటలు 5593 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందుకోసం వరి 56789 క్వింటాళ్ల విత్తనాలు, అవసరం అవుతాయని అంచనాలు వేయగా కందులు 120.6 క్వింటాళ్లు, మొక్కజొన్న 59.84 క్వింటాళ్లు, పత్తి 123790 ప్యాకెట్లు, పెసర్లు 4.18 క్వింటాళ్లు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. వానాకాలం సాగుకు సంబంధించి 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, ఎరువులు 57399 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ఖరీఫ్‌ సాగులో 57399 మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల ఎరువులను వినియోగిస్తారు.యూరియా 25944మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 3760 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 22710మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4225 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 760 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. జిల్లాలో ప్రస్తుతం 7639 మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఎరువుల్లో యూరియా 4283 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 601 మెట్రిక్‌ టన్నులు, పొటాషియం 188మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 2567 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి.

Updated Date - Jun 04 , 2026 | 01:10 AM