పక్కదారి పడుతున్న సన్నబియ్యం
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:59 AM
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ఇరవై శాతానికి పైగా జిల్లాలో పక్కదారి పడుతున్నాయి. రేషన్ షాపుల డీలర్లే సూత్రధారులుగా వ్యవహరిస్తూ వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి రైస్‌మిల్లర్లకు విక్రయిస్తున్నారు. వీళ్లే గాకుండా సంచార జాతులకు చెందిన వాళ్లు బియ్యం కొంటాం.. బియ్యం కొంటాం.. అంటూ మైకులు పెట్టుకుని బహిరంగంగా తిరుగుతూ వినియోగదారుల నుంచి సన్న బియ్యం కొను గోలు చేస్తూ అక్రమ దందా నిర్వహిస్తున్నారు. అయినా పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు రేషన్ షాపులను తనిఖీ చేసి అక్రమ దం దాకు అడ్డుకట్ట వేయడం లేదు.
- రేషన్ షాపుల్లోనే విక్రయిస్తున్న లబ్ధిదారులు
- కిలోకు రూ.18 వరకు కొనుగోలు చేసి రూ.25కు మిల్లర్లకు విక్రయం
- బియ్యంలో 25 శాతం నూకలే ఉండడంతో అమ్ముతున్న వినియోగదారులు
- పట్టించుకోని పౌరసరఫరాలు, రెవెన్యూ వర్గాలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ఇరవై శాతానికి పైగా జిల్లాలో పక్కదారి పడుతున్నాయి. రేషన్ షాపుల డీలర్లే సూత్రధారులుగా వ్యవహరిస్తూ వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి రైస్‌మిల్లర్లకు విక్రయిస్తున్నారు. వీళ్లే గాకుండా సంచార జాతులకు చెందిన వాళ్లు బియ్యం కొంటాం.. బియ్యం కొంటాం.. అంటూ మైకులు పెట్టుకుని బహిరంగంగా తిరుగుతూ వినియోగదారుల నుంచి సన్న బియ్యం కొను గోలు చేస్తూ అక్రమ దందా నిర్వహిస్తున్నారు. అయినా పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు రేషన్ షాపులను తనిఖీ చేసి అక్రమ దం దాకు అడ్డుకట్ట వేయడం లేదు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయ నేందుకు పెద్దపల్లి పట్టణంలో గురువారం రాత్రి 35 క్వింటాళ్ల బియ్యం పట్టుబడడమే నిదర్శనం. జిల్లాలో 413 రేషన్ షాపులు ఉండగా, వీటి పరిధిలో 2,46,781 రేషన్ కార్డులున్నాయి. వీటి ద్వారా ఒక్కో వ్యక్తి పేరిట 6 కిలోల చొప్పున ప్రతీ నెలా 4,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మూడు నెలలకు ఒకేసారి బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో 13,646 టన్నుల బియ్యం కోటాను విడుదల చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు.
ఫ గతేడాది నుంచి సన్న బియ్యం పంపిణీ..
గతంలో రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో అందులో 70 శాతానికి పైగా బ్లాక్ మార్కెట్‌కు చేరేవి. దీంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇందుకు కావాల్సిన సన్న బియ్యం కోసం వానాకాలం సీజన్‌లో సన్న రకాలకు సాగు చేసే రైతులకు క్వింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించడంతో సన్నాల సాగు పెరిగింది. తద్వారా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ బియ్యాన్ని చాలా మంది వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ, కొందరు అక్కడికక్కడే రేషన్ షాపు డీలర్లకే విక్రయి స్తున్నారు. మొదట చాలా మంది సన్న బియ్యం విక్రయించక పోయిన ప్పటికీ బియ్యంలో 25 శాతం వరకు నూకలు ఉండడం, అన్ని రకాల సన్నాలు మిక్స్‌డ్‌గా వస్తుండడంతో వాటిని 20 శాతానికి పైగా వినియోగదారులు సద్వినియోగం చేసుకోవడం లేదు.
ఫ కిలోకు రూ.15 నుంచి 18కి కొనుగోలు..
రేషన్ షాపుల డీలర్లు కిలో సన్నబియ్యాన్ని 15 నుంచి 18 రూపాయల వరకు కొనుగోలు చేసి రైస్‌మిల్లర్లకు 25 నుంచి 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో సన్న రకం వరి సాగు తగ్గుముఖం పట్టనుండడంతో సన్న బియ్యానికి డిమాండ్ పెరిగింది. ధరలు కూడా పెరిగాయి. సీఎంఆర్ కింద మిల్లర్లకు ప్రభుత్వం ఇచ్చిన సన్న ధాన్యాన్ని మర ఆడించి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తుండగా, డీలర్లు, దళారుల నుంచి కొనుగోలు చేసి సన్న బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి ఇస్తున్నారని తెలుస్తున్నది. సంచార జాతులకు చెందిన వాళ్లు రేషన్ షాపుల వద్దనే మకాం వేసి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. వాళ్లు మిల్లర్లకు కాకుండా మధ్య దళారులకు విక్రయిస్తున్నారు. ఆ దళారులు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రేషన్ షాపులకు ఒకేసారి గాకుండా రెండు, మూడు పర్యాయాలుగా బియ్యం సరఫరా అవుతుంటాయి. కొందరు డీలర్లు మొదటి విడతలో వినియోగదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని రెండో విడతలో ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి వాహనంలో వచ్చే బియ్యంలో కొన్ని బియ్యాన్ని మార్గమధ్యలోనే సంచులు మార్చకుండానే మరొక వాహనంలోకి లోడింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి అవి నేరుగా రైస్‌మిల్లులకు తరలిస్తున్నారని సమాచారం. అక్రమ బియ్యం దందాతో రేషన్ డీలర్లు, సంచార జాతులు, మధ్య దళారులు, కొందరు రైస్‌మిల్లర్లు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. అధికారులు రేషన్ షాపులను సంద ర్శించి స్టాక్ వివరాలను, డీలర్లు సెల్‌ఫోన్ ద్వారా చేసే యూపీఐ లావా దేవీలను పరిశీలిస్తే అక్రమ బాగోతం బయట పడుతుందని ప్రజలు అంటున్నారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.