పంచాయతీలకు ఆర్థిక భరోసా
ABN , Publish Date - May 28 , 2026 | 01:08 AM
గ్రామపంచాయతీలకు కేంద్రప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసే నిధులు ఆర్థిక భరోసా కల్పించనున్నాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
గ్రామపంచాయతీలకు కేంద్రప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసే నిధులు ఆర్థిక భరోసా కల్పించనున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంతో 16వ ఆర్థిక సంఘం ముగియగా 2026-27నుంచి 2030-31సంవత్సరాలకు గాను కేంద్రప్రభుత్వం ఆర్థికప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగా రాష్ట్రానికి 9,968కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. జిల్లాలో ఉన్నటువంటి 263 గ్రామపంచాయతీలకు గాను ఐదేళ్లలో 120నుంచి 130కోట్ల రూపాయల వరకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ నిధులతో గ్రామాల్లో మౌలికసదుపాయాలు కల్పించేందుకు డోకా లేకుండా పోనున్నది. ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. కేంద్రప్రభుత్వం 16వ ఆర్ధిక సంఘం నిధులను ఏఏ ఆవసరాలకు వినియోగించాలో స్పష్టంగా నిర్దేశించింది. స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీలు, మండల, జిల్లా ప్రజాపరిషత్‌ల్లో మౌలికసదుపాయాల కల్పనలో తాగునీటిసరఫరా, పారిశుధ్య, నిర్వహణ, గ్రామీణ రహదారుల నిర్మాణం, వీధిదీపాలు, ఇతర ప్రజాసేవల కోసం వినియోగించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఈ నిధులను వేతనాలు, పింఛన్ల చెల్లింపుల కోసం వినియోగించరాదని ఆదేశించారు.
ఫ నిధుల్లో 80 శాతం పంచాయతీలకే..
కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘ నిధుల్లో 80శాతం పంచాయతీలకు కేటాయిస్తోంది. మండల, జిల్లా పరిషత్‌లకు 10శాతం చొప్పున కేటాయిస్తారు. ప్రతి ఆర్థికసంవత్సరంలో మొదట జూన్‌లో ఒకసారి, అక్టోబరులో మరోసారి నిధులు విడుదల అవుతాయి. స్థానిక సంస్థలకు ఏ మేరకు ఆర్థిక వనరులు సమకూర్చుతారనే అంశం ఆధారంగా రాష్ట్ర పనితీరును, పన్నుల వసూలు, సొంత ఆదాయ వనరుల పెంపుదల ఆధారంగా పంచాయతీల పనితీరును పరిశీలించి మిగిలిన 10శాతం నిధులు ఇవ్వడంపై కేంద్రంనిర్ణయం తీసుకుంటుంది. 2036 నాటి అంచనా ప్రకారం గ్రామీణ జనాభాకు 90శాతం, రాష్ట్ర వైశాల్యానికి 10శాతం వెయిటేజీ ప్రాతిపదికన, కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు చేయనున్నారు. ఆయా పంచాయతీల్లో జనాభా ఆధారంగా నిధులు కేటాయించి పనులు చేయనున్నారు. 16వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి ఉంది. అంతేగాకుండా త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా సమగ్ర నివేదికలను రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆడిట్‌లో గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిధులు దారి మళ్లించినా, దుర్వినియోగం చేసినా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
ఫ ఆడిట్‌ను తప్పనిసరిగా సమర్పించాలి..
మొదటి విడత నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన 2025-26 బడ్జెట్‌ను ఆయా స్థానికసంస్థల ఆడిట్‌ను సమర్పించారు. మొదటి విడత నిధుల వినియోగ ధ్రువీకరణ, పురోగతి నివేదికల ప్రకారం రెండోవిడత నిధులను కేంద్రప్రభుత్వం విడుదల చేస్తుంటుంది. గ్రాంట్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు విడుదల చేస్తారు. వాటిని 10రోజుల్లో సంబంధిత స్థానికసంస్థలకు బదిలీ చేస్తుంటారు. నిర్ధేశించిన అవసరాలకు కేటాయించే నిధులను వెచ్చించాలి. వాటిని టైడ్ నిధులుగా వ్యవహరిస్తారు. ఆన్‌టైడ్ నిధుల్లో 30శాతం కన్నా ఎక్కువ నిధులను రోడ్లనిర్మాణం, నిర్వహణ కోసం ఖర్చు చేయరాదు. నిధుల వినియోగంపై గ్రామ పంచాయ తీలు, మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో విధిగా తీర్మానం చేయాలి. వాటిని ఈ-గ్రామ్ పోర్టల్లో నమోదు చేయాలి. కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేయడానికి బట్టి పోర్టల్‌లో నమోదు చేసిన పనులను దశల వారీగా చేపట్టనున్నారు.