చి‘వరి’కి.. తెగుళ్ల దిగులు..
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:33 AM
అన్నదాతలకు పంట చేతికొచ్చే సమయంలో వరి పంటను వెంటాడుతున్న తెగుళ్లు దిగాలుపరుస్తోంది. మరోవైపు అకాల వర్షాలు గుబులు పుట్టిస్తున్నాయి. ఎండలు ముదురుతుండడంతో బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులపై ముప్పేట దాడిలాగా మారడంతో సాగు చేసిన వరి పంట చేతికి వస్తుందో రాదోననే ఆందోళనకు గురవుతున్నారు.
- మొగి పురుగు.. అగ్గి తెగులు గుబులు
- భయపెడుతున్న అకాల వర్షాలు
- మరోవైపు తగ్గిపోతున్న భూగర్భ జలాలు
- నీరుగారుతున్న దిగుబడి ఆశలు
- జిల్లాలో 1.81 లక్షల ఎకరాల్లో వరి సాగు
- కలవర పడుతున్న రైతులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అన్నదాతలకు పంట చేతికొచ్చే సమయంలో వరి పంటను వెంటాడుతున్న తెగుళ్లు దిగాలుపరుస్తోంది. మరోవైపు అకాల వర్షాలు గుబులు పుట్టిస్తున్నాయి. ఎండలు ముదురుతుండడంతో బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులపై ముప్పేట దాడిలాగా మారడంతో సాగు చేసిన వరి పంట చేతికి వస్తుందో రాదోననే ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా వరిలో కాండం తొలుచు పురుగు, మొగి పురుగు, అగ్గి తెగులు వంటి వాటిపై రైతులకు అవగాహన ఉంది. జిల్లాలో ఇప్పటికే తంగళ్ళపల్లి, వేములవాడ రూరల్, బోయిన్‌పల్లి, చందుర్తి, వీర్నపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో అగ్గి తెగులు రావడంతో రైతులు మందులు పిచికారీ చేయడంతో తగ్గుమొఖం పట్టింది. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా వారికి నూతన తెగుళ్లు కూడా వస్తున్నాయి. ఇల్లంతకుంటలో సల్ఫైడ్ ఇంజురీ అని తెగులు కూడా వచ్చింది. వ్యవ సాయ అధికారులు రైతులకు నిరంతరం సూచనలు చేస్తూ వంటను కాపాడుకునే దిశగా అప్రమత్తం చేస్తున్నారు. రైతులకు మాత్రం వివిధ ప్రాంతాల్లో వస్తున్న తెల్లకంకి తెగులు, సూక్ష్మ ధాతువు లోపం, వరి పైరు పసుపు రంగులోకి మారడం వంటివి చూస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60 శాతంపైగా వరి పంట కోత దశకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రకృతిపై ఆందోళన చెందుతున్నారు.
ఎండుతున్న వరి..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో 1.89 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా 1.81 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. ఈసారి ఎండలు మార్చి మాసంలోనే తీవ్రత చూపడంతో భూగర్భ జలాలు వేగంగా పడి పోతున్నాయి. జిల్లాలో జనవరిలో 7.50 మీటర్లకు భుగర్భ జలాలు పడిపోగా, ఫిబ్రవరిలో 9.08 మీట ర్లకు పడిపోయింది. మరోవైపు మిడ్‌మానేరు ప్రాజె క్టులో నిల్వ ఉన్న నీటిని దిగువకు వదలడంతో ప్రాజె క్టులో నీటిమట్టం తగ్గి భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయి. 27.55 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 11.46 టీఎంసీలకు తగ్గిపోయింది. జిల్లాలో 80,389 బోరు బావులు ఉండగా, సగానికి పైగా బోరు బావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. వరి పంటకు నీళ్లు అందని పరిస్థితుల్లో కొన్ని చోట్ల పంట ఎండిపోయింది. రైతులు పశువులకు మేతగా పొలాలు వదిలివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంట దిగుబడి పడిపోవడమే కాకుండా ఏప్రిల్, మే మాసంలో చివరి దశలో చేతికి వచ్చే పంట చేజారిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వడగళ్ల బీభత్సం.. రైతుల్లో భయం
ఎండుతున్న పంటలు.. తెగుళ్లతో దిగుబడిపోయి ఆందోళన చెందుతున్న రైతులను వడగళ్ల బీభత్సం భయాన్ని నింపుతోంది. గాలి వాన, వడగళ్ల వర్షాలు మొదలు కావడంతో జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే చందుర్తి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో వడగళ్ల వర్షానికి పంటల నష్టానికి గురయ్యాయి. కోతల దశలో అకాల వర్షం ఎలాంటి నష్టాన్ని మిగులుస్తుందనే ఆందోళన చెందుతున్నారు. చందుర్తిలో ఇప్పటికే 150 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. ప్రతి సంవత్సరం గాలివాన బీభత్సం రైతులను నష్టానికి గురిచేస్తున్న సందర్భాలు ఉండడంతో యాసంగి పంట చేతికి వచ్చేవరకు రైతులను భయం వెంటాడుతూనే ఉంది. రైతులు అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవాలనే తపనతో దేవాలయాల్లో ముడుపులు వేస్తున్నారు.
యాసంగి పంట సాగు ఇలా..
జిల్లాలో 1.89 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు ఇందులో వరిసాగు 1.81 లక్షల ఎకరాల్లో వేసుకున్నారు. ప్రధానంగా వరి సాగు చేయగా మొక్కజొన్న 4,308 ఎకరాలు, నువ్వులు 288 ఎకరాలు, పొద్దుతిరుగుడు 1,400 ఎకరాలు, కందులు 356 ఎకరాలు, వేరుశనగ 23 ఎకరాలు, పెసర 7 ఎకరాలు, ఇతర పంటలు 763 ఎకరాల్లో సాగు చేశారు.
మండలం మొత్తం సాగు వరి సాగు
గంభీరావుపేట 18,705 18,700
ఇల్లంతకుంట 26,436 23,500
ముస్తాబాద్ 21,107 21,100
సిరిసిల్ల 4,523 4,500
తంగళ్ళపల్లి 20,005 20,000
వీర్నపల్లి 7,400 7,400
ఎల్లారెడ్డిపేట 18,505 18,500
బోయినపల్లి 13,889 12,600
చందుర్తి 16,687 15,500
కోనరావుపేట 19,350 19,200
రుద్రంగి 6,120 4,770
వేములవాడ 5,318 5,200
వేములవాడ రూరల్ 11,070 10,950
-----------------------------------------------------------------
మొత్తం 1,89,115 1,81,920
జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిన తీరు(మీటర్లలో)
మండలం ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 2026
బోయినపల్లి 7.21 6.30
చందుర్తి 5.23 6.14
గంభీరావుపేట 11.59 9.64
ఇల్లంతకుంట 5.90 5.76
కోనరావుపేట 9.72 8.59
ముస్తాబాద్ 9.79 10.38
రుద్రంగి 6.73 7.20
సిరిసిల్ల 12.15 13.09
తంగళ్లపల్లి 7.87 6.98
వీర్నపల్లి 13.45 15.75
వేములవాడ రూరల్ 4.77 5.10
వేములవాడ అర్భన్ 13.18 14.41
ఎల్లారెడ్డిపేట 15.62 15.04
--------------------------------------------------------------------------------------
జిల్లా సరాసరి 9.28 9.08
--------------------------------------------------------------------------------------