ఎట్టకేలకు ‘అంగారిక’ అభివృద్ధి
ABN , Publish Date - May 30 , 2026 | 01:25 AM
తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీలోని అంగారికా టౌన్‌షిప్ అభివృద్ధి పనులపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు దృష్టి పెట్టడంతో ప్లాట్ ఓనర్లలో ఆశలు చిగురిస్తున్నాయి. 2022 జూన్‌లో అప్పటి ప్రభుత్వం 85 ఎకరాల రాజీవ్ స్వగృహ స్థలాన్ని 819 ప్లాట్లుగా విభజించింది. అంగారికా టౌన్‌షిప్ పేరిట నాలుగు విడతలుగా డిసెంబర్ 2023 వరకు వేలం నిర్వహించి ప్లాట్లను విక్రయించింది.
- టౌన్‌షిప్‌ను సందర్శించిన రాజీవ్ స్వగృహ జీఎం
- సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం
- మౌలిక వసతులను కల్పించాలని కలెక్టర్ ఆదేశం
కరీంనగర్ టౌన్, మే 29 (ఆంధ్రజ్యోతి): తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీలోని అంగారికా టౌన్‌షిప్ అభివృద్ధి పనులపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు దృష్టి పెట్టడంతో ప్లాట్ ఓనర్లలో ఆశలు చిగురిస్తున్నాయి. 2022 జూన్‌లో అప్పటి ప్రభుత్వం 85 ఎకరాల రాజీవ్ స్వగృహ స్థలాన్ని 819 ప్లాట్లుగా విభజించింది. అంగారికా టౌన్‌షిప్ పేరిట నాలుగు విడతలుగా డిసెంబర్ 2023 వరకు వేలం నిర్వహించి ప్లాట్లను విక్రయించింది. దీంతో ప్రభుత్వానికి ఈ వెంచర్ ద్వారా 147 కోట్ల ఆదాయం సమకూరింది.
ఫ అన్ని సదుపాయాలు కల్పిస్తామని..
అంగారిక టౌన్‌షిప్‌లో విశాలమైన రోడ్లు, డ్రైనేజీలు, నీటివసతి, పార్కులు, చుట్టూ ప్రహారీ, స్వాగత తోరణం, విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తామని బ్రోచర్‌తో ప్రచారం చేశారు. 47 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించామంటూ ప్రీబిడ్ సమావేశంలో అధికారులు ప్రకటించారు. దీంతో చాలా మంది పోటీపడి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రెండు, మూడింతలు పెంచి వేలంలో ప్లాట్లను చేజిక్కించుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, నీటి వసతి కల్పిస్తే ఇళ్లను నిర్మించుకోవాలని ప్లాట్ ఓనర్లు నిర్ణయించుకొని ప్రయత్నాలను ప్రారంభించారు. ప్లాట్లను విక్రయించిన అధికారులు అభివృద్ధిని పూర్తిగా మరిచిపోవడమేకాకుండా అంగారికా టౌన్‌షిప్ వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. కనీసం విద్యుత్ సౌకర్యం, నీటి వసతి కల్పించలేదు. ఇళ్లు నిర్మించుకున్న ఒకరిద్దరు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకున్నారు. జనరేటర్ల సహాయంతో విద్యుత్ అవసరాలు తీర్చుకున్నారు.
ఫ సుడా నిధులతో రోడ్ల ఫార్మేషన్
ప్లాట్లు కొన్నవారు అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకొని అంగారికా టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని, వసతులను కల్పించాలంటూ పలుమార్లు కలెక్టర్, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి స్పందించి కోటి 50 లక్షల నిధులతో రోడ్లు ఫార్మేషన్ చేయించారు. మరో 20 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ అక్కడ ఫార్మేషన్ చేసిన రోడ్లు తప్ప ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. దీంతో ప్లాట్ ఓనర్లు తీవ్ర నిరాశకు లోనుకాగా ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన స్పందించి రాజీవ్ స్వగృహ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంగారికాలో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు. దీంతో రాజీవ్ స్వగృహ జనరల్ మేనేజర్ నరేందర్‌రెడ్డి అంగారిక టౌన్‌షిప్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. రాజీవ్ స్వగృహ జీఎం నరేందర్‌రెడ్డి బుధవారం కరీంనగర్‌కు వచ్చి అంగారికా టౌన్‌షిప్‌ను సందర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ చిత్రామిశ్రాతో సమావేశమై అంగారికా టౌన్‌షిప్ అభివృద్ధిపై చర్చించి ఎన్‌పీడీసీఎల్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, రాజీవ్ స్వగృహ, మిషన్ భగీరథ, సుడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అంగారికా టౌన్‌షిప్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికైనా పనులను ప్రారంభించాలి
- ఎం రఘుశంకర్‌రెడ్డి, అధ్యక్షుడు, అంగారికా ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
నాలుగేళ్ల నుంచి చేసిన పోరాట ఫలితంగా ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి, రాజీవ్ స్వగృహ జీఎం నరేందర్‌రెడ్డికి, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి, కలెక్టర్ చిత్రా మిశ్రాకు ప్లాట్ ఓనర్ల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా అభివృద్ధి పనులను ప్రారంభించాలి.