ఎట్టకేలకు మోక్షం..
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:03 AM
పౌష్టికాహార కేంద్రాలుగా.. చిన్నారులకు విద్యాబోధన అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏళ్ల తరబడి టీచర్, సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పౌష్టికాహార కేంద్రాలుగా.. చిన్నారులకు విద్యాబోధన అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏళ్ల తరబడి టీచర్, సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇబ్బందికర పరిస్థితుల్లోనే పలు అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గత సంవత్సరం మార్చి 8 మహిళా దినోత్సవ కానుకగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. అప్పటినుంచి మహిళలు అంగన్‌వాడీలోని కొలువుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు అంగన్‌వాడీ కేంద్రాల్లోని టీచర్లు, సహాయకుల భర్తీకి దృష్టి పెట్టడమే కాకుండా రాష్ట్రంలోని దాదాపు 10 జిల్లాల్లో గత వారం రోజులుగా అంగన్‌వాడీ ఖాళీలపై నోటిఫికేషన్లు జారీ చేశారు. నోటిఫికేషన్లు జారీ చేసిన జిల్లాలో ఈనెల చివరి వరకే ప్రక్రియ పూర్తి చేసే దిశగా అధికారులు సిద్ధమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఒకవైపు నోటిఫికేషన్ ఎప్పడు వస్తుందనోని ఎదురు చూస్తుండగా, మరోవైపు ఈనెల చివరి వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఆశావహుల్లో ఆశలు మొదలయ్యాయి. జిల్లా అధికారులు కూడా అందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో అనేకమార్లు నోటిఫికేషన్లు వస్తున్నట్లు హడావుడి జరిగిన చివరి దశలో నిలిచిపోయాయి. ఈసారి ప్రభుత్వం ఇతర జిల్లాలో నోటిఫికేషన్లు జారీ చేయడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఖాళీల భర్తీ జరుగుతుందని మహిళలు భావిస్తున్నారు.
ఫ జిల్లాలో 57 టీచర్లు.. 183 సహాయకుల పోస్టుల ఖాళీలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 586 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ బెనిఫిట్స్ రావడంతో ప్రతినెల 10 నుంచి 15 మంది వరకు పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో టీచర్ పోస్టు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యత పక్కనే ఉన్న కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో అదనపు భారం మోయాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం ఇటీవల వివిధ యాప్‌ల ద్వారా ఫోటో క్యాప్చర్ విధానం తీసుకురావడంతో కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరని పరిస్థితిలో ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలో 586 అంగన్‌వాడీ కేంద్రాల్లో 57 టీచర్లు, 183 సహాయకుల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇందులో సిరిసిల్ల ప్రాజెక్టు పరిధిలో 57 టీచర్లు, 113 సహాయకులు, వేములవాడ ప్రాజెక్టు పరిధిలో 12టీచర్లు, 70 సహాయకుల పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటికి సంబంధించిన ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కలెక్టర్ నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేసే దిశగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో సహాయకుల పోస్టులు నిలిచిపోతాయనే నిరాశ కూడా ఆశావహుల్లో ఉంది. వారం రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు.
ఫ అంగన్‌వాడీ పోస్టులకు పైరవీలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 57 అంగన్‌వాడీ టీచర్లు, 183 సహాయకుల పోస్టులు ఖాళీ ఉండటంతో ఆశావహులు కొలువులు దక్కించుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇతర జిల్లాలో నోటిఫికేషన్లు వచ్చిన నేపథ్యంలో అంగన్‌వాడీ పోస్టుల కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో రాజకీయ నేతలు తమ అనుచరులు, బంధువులకు పోస్టులు వచ్చే విధంగా దృష్టి పెట్టడమే కాకుండా ఆశావహులకు హామీలు ఇస్తున్నారు. రాజకీయ పైరవీలకు అప్పుడే తెరలేచినప్పటికీ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్‌కు రూ.13500, సహాయకులకు రూ.8500 గౌరవ వేతనంగా ఇస్తున్నారు. వేతనాలు మరింత పెరగడమే కాకుండా ఉద్యోగులుగా గుర్తిస్తారని భావిస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో అంగన్‌వాడీ పోస్ట్ దక్కించుకోవడానికి పెద్ద సంఖ్యలోని ఆశావహులు ముందుకు రానుండడంతో పోటీ తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఫ ఈసారి లోకల్.. ఇంటర్ తప్పనిసరి
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అంగన్‌వాడీ కొలువుల్లో కొలువుదీరే తరుణం కొద్దిదూరంలోనే ఉండడంతో అందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఈసారి కొత్త నిబంధనలను ముందుకు తీసుకొచ్చింది. గతంలో టీచర్ పోస్టుకు పదో తరగతి విద్యార్హత, సహాయకులకు ఏడో తరగతి అంతకంటే తక్కువగా విద్యార్హతలతో ఉన్నవారిని కూడా భర్తీ చేశారు. ఈసారి మహిళా అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయస్సు లోపువారు అర్హులుగా నిర్ణయించారు. టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్, సహాయకులకు ఇంటర్ లేదా కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో పోస్ట్‌ఖాళీ ఉందో ఆ గ్రామానికి చెందిన వారే అర్హులుగా ఉంటారు. మున్సిపల్ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రం ఉన్న వార్డు వారే అర్హులుగా ఉంటారు. స్థానికతను ప్రామాణికంగా పరిగణించి ఖాళీలు భర్తీ చేస్తారు. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగ, అనాథ ఇతర అన్ని రకాల రిజర్వేషన్లను వర్తింపచేస్తారు. దివ్యాంగుల్లో కాళ్లు, చేతులకు వైకల్యం ఉన్న, వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు, అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా పూర్వ ప్రాథమిక విద్యను నేర్పేందుకు, పిల్లల సంరక్షణకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉన్నవారు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయనున్న కమిటీకి అప్పగించనున్నారు. కలెక్టర్, జిల్లా స్ర్తీ,శిశు సంక్షేమ అధికారి, జిల్లా వైద్యాధికారి ఆర్డీవో కమిటీలు ఉంటారు. త్వరలోనే జిల్లాకు సంబంధించిన ఖాళీలపై నోటిఫికేషన్ రానుడడంతో గ్రామల్లో కొలువుల సందడి మొదలు కానున్నది.