ఎట్టకేలకు యాంత్రీకరణ
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:49 AM
వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఎట్టకేలకు రైతులకు అందుబాటులోకి వచ్చింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఎట్టకేలకు రైతులకు అందుబాటులోకి వచ్చింది. గత ప్రభుత్వం సుమారు 8 ఏళ్ల పాటు యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల తర్వాత ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈనెల 9న భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని రైతు మేళాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పథకాన్ని పునఃప్రారంభించారు. నిలిచిపోయిన యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తూ 131182 వ్యవసాయ పరికరాలను 50శాతం రాయితీతో రాష్ట్రంలో రైతులకు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.101.93 కోట్లు కేటాయించారు. జిల్లాలో రైతు మేళాలు ఏర్పాటు చేసి సాగు పరికరాల పంపిణీ చేపట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి నుంచి పరికరాల పంపిణీ ప్రక్రియ చేపట్టి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగు పరికరాల కోసం రైతులు ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న రైతులకు ఊరట కలుగనుంది.
జిల్లాలో సాగు పరికరాలకు 2369 దరఖాస్తులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే వ్యవసాయ యాంత్రీకరణలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా పరికరాల పంపిణీపై షెడ్యూల్ ఖరారు చేసిన యాంత్రీకరణలో జాప్యం రైతులను ఊరిస్తూ నిరాశ పరుస్తూవచ్చింది. గత సంవత్సరం సెప్టెంబరు 17 తేదీలోగా పరికరాలు రైతులకు అందించాల్సి ఉన్న యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు యారియా సమస్యపై నిమగ్నం కావడంతో యాంత్రీకరణ పథకం పక్కన వెళ్లింది. అక్టోబరు మాసంలో మళ్లీ పథకంలో వచ్చిన దరఖాస్తులు పరిశీలించి రైతులకు పరికరాలు అందించాలని సిద్ధమైన పంచాయతీ ఎన్నికలు ముందుకు రావడంతో వాయిదా పడింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి గత సంవత్సరం ఆగస్టులో వ్యవసాయ శాఖ అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2369 మంది రైతులు యూనిట్లకు దరఖాస్తు వచ్చాయి.. దీంతోపాటు గతంలో రైతులు చేసుకున్న దరఖాస్తులను సైతం పరిగణలోకి తీసుకున్నారు. మండల వ్యవసాయ అధికారులు అన్ని దరఖాస్తులను పరిశీలించి సుమారు 646 మంది రైతులకు రూ 1.84 కోట్లతో యంత్ర పరికరాలకు అందించే విధంగా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. గతంలో అమల్లో ఉన్నా వ్యవసాయ యాంత్రీకీకరణ పఽథకం 2016- 17 అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ ఈ పథకాన్ని 2025-26 అర్థిక సంవత్సరంలో అమలుచేసేందుకు అడుగులు వేసింది. కేంద్ర నిధులు వెనక్కి వెళ్లకుండా వేగవంతంగా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించాలని వేగవంతం ప్రభుత్వం వేగవంతం చేసినట్లుగా భావిస్తున్నారు.
మహిళా రైతులకే యాంత్రీకరణ..
వ్యవసాయ యాంత్రీకీకరణలో తొలిసారిగా మహిళా రైతులకు పనిముట్లు అందించడానికి నిర్ణయించారు. 15రకాల యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించారు. 50శాతం రాయితీతో మహిళా రైతులకు మాత్రమే యంత్రాలు, పరికరాలు ఇవ్వాలని నిర్ణయించారు. సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లోని మండలాల్లో ప్రణాళికలు కూడా రూపొందించారు. యాంత్రీకరణలో ట్రాక్టర్ రూ.5 లక్షలు, రోటోవేటర్ రూ.1.44 లక్షలు, పవర్ టిల్లర్ రూ లక్ష, స్ర్టాబేలర్స్ రూ.లక్ష, మెయిజ్‌షెల్లర్ రూ లక్ష, కల్టీవేటర్, ప్లవ్, కేజీవీల్, రోటే ఫడ్లర్ రూ 75906, పవర్ స్పేయర్ రూ 45 వేలు, బ్రష్ కట్టర్ రూ 35 వేలు, పవర్ వీటర్ రూ 35 వేలు, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ రూ 30వేలు, బండ్ ఫార్మార్ రూ 13 వేలు, బ్యాటరీ ఆపరేటర్ స్పేయర్ రూ 5 వేలు వంటి రకాలను 50శాతంతో అందించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్‌లలో 4లక్షల ఎకరాల్లో వివిధ సంటలు సాగు చేస్తారు. వ్యవసాయ కూలీల కొరతతో ప్రతి సీజన్‌లోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీపై యంత్రాలు ఇవ్వడం ద్వారా ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు. జిల్లాకు ప్రభుత్వం 12మండలాలు, రెండు మున్సిపాలిటీల్లోని రైతులకు నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో వ్యవసాయ పరికరాల కొనుగోలు చేయాలంటే పెద్దమొత్తంలో ఖర్చు అవుతుంది. కల్టీవేటర్ బయట తయారుచేస్తే రూ 30 నుంచి రూ 50 వేలు, రోటవేటర్ కోనాలంటే రూ లక్ష వరకు ఖర్చు అవుతుంది. పురుగుల మందు పిచికారీ యంత్రాల ధర మార్కెట్‌లో రూ.3వేల నుంచి రూ పది వేల వరకు ఉన్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా సగం ధరకే పరికరాలు రానుండడంతో చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.