తుది ఓటరు జాబితా విడుదల
ABN , Publish Date - Jan 13 , 2026 | 01:40 AM
కరీంనగర్ నగర పాలక సంస్థ, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లోని తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు.
- కరీంనగర్‌లో 3,40,580 మంది ఓటర్లు
- అభ్యంతరాల పరిశీలన నామమాత్రమే
- ముసాయిదా జాబితా నుంచి తొలగించింది 195 ఓట్లు మాత్రమే
- నగరం, పట్టణాల్లో మహిళా ఓటర్లే అధికం
కరీంనగర్ నగర పాలక సంస్థ, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లోని తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. ముసాయుదా ఓటరు జాబితాలపై పలు అభ్యంతరాలు వచ్చినా నామమాత్రంగానే పరిశీలన జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు, మూడు మున్సిపాలిటీల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
కరీంనగర్ టౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): కరీంనరగ్‌లో 3,40,580 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,69,679 మహిళలు 1,70,858. ఇతరులు 43 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,179 మంది అధికంగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధేశాల మేరకు సోమవారం నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించిన తుది ఓటరు జాబితాను కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ విడుదల చేసి కార్పొరేషన్ కార్యాలయం, కలెక్టరేట్, ఆర్డీవో, అర్బన్ తహసీల్దార్ కార్యాలయాల్లో అతికించారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జనవరి 1న నగరపాలకసంస్థ అధికారులు నగర ఓటర్ల సంఖ్య 3,40,775 మంది ఉన్నట్లుగా పేర్కొంటూ డివిజన్ల వారిగా ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ఆ జాబితా తప్పుల తడకగా ఉందని నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున అభ్యంతరాలను వ్యక్తం చేశారు. జనవరి 1 నుంచి 6వ తేదీ వరకు ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించారు. 249 మంది వినతిపత్రాలను సమర్పించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తుది ఓటరు జాబితాను తయారు చేయాలని కోరారు. మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ముసాయిదాలోని తప్పులను ఎత్తిచూపుతూ పలు అభ్యంతరాలతో వినతిపత్రాలను సమర్పించారు. డివిజన్ల వారీగా క్షేత్రస్థాయిలో అభ్యంతరాలను పరిశీలించి ఈనెల 12న తుది జాబితా ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. సోమవారం ప్రకటించిన తుది జాబితాలో కేవలం 195 ఓట్లను తగ్గించారు. నగర ఓటర్ల సంఖ్యను 3,40,580గా తేల్చారు.
ఫ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు
అభ్యంతరాల పరిశీలన నామమాత్రమేనని, తప్పులను సవరించకుండా చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించి చేతులు దులుపుకున్నారని, తుది జాబితా కూడా తప్పుల తడకగానే ఉందంటూ పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాతో తమకు నష్టం తప్పదని పోటీ చేయాలనుకుంటున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో డివిజన్‌కు 4,500 నుంచి ఆరు వేల వరకు ఐదు శాతం హెచ్చుతగ్గులతో జాబితాను తయారు చేశారు. తుది జాబితాపై మరోసారి ఫిర్యాదు చేయాలని, స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని నాయకులు అంటున్నారు.
ఫ హుజూరాబాద్‌లో..
హుజూరాబాద్: హుజూరాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం తుది ఓటర్ జాబితాను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా పురుషులు 14,357, మహిళలు 15,170, ఇతరులు 4, మొత్తం 29531 ఓటర్లు ఉన్నారన్నారు. కార్యక్రమంలో మేనేజర్ భూపాల్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ జమ్మికుంటలో
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 30వార్డుల పరిదిలో గల తుది ఓటరు జాబితాను మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి సోమవారం కార్యాలయం ఆవరణలో విడుదల చేశారు. ఈ నెల 5వ తేది వరకు అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందె. అప్పటి వరకు పురుషులు 16,870మంది, మహిళలు 17,724మంది ఉండగా, తుది జాబితాలో 55 మంది పురుషులు, 85మంది మహిళల ఓట్లను తొలగించారు. తుది జాబితా ప్రకారం 16,815 మంది పురుషులు, 17,639 మంది మహిళలు, ఇతరులు ఒకరు, మొత్తం 34,455మంది ఓటర్లు ఉన్నారు. కార్యక్రమంలో టీపీవో శ్రీధర్, టీపీఎస్ రాజ్‌కుమార్, టీపీబీవో దీపిక, ఏఈ వికాస్, సీనియర్ అసిస్టెంట్లు వాణి, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ చొప్పదండిలో..
చొప్పదండి: పట్టణంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఓటరు జాబితాను విడుదల చేశారు. పట్టణంలోని 14 వార్డుల్లో 13,916 మంది ఓటర్లు ఉండగా, 7,173 మంది మహిళలు, 6,743 మంది పురుషులు ఉన్నారు. పురుషుల కన్నా 430 మహిళలు అధికంగా ఉన్నారు.