Share News

అభ్యంతరాల పరిశీలన తర్వాతే తుది జాబితా

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:10 AM

ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలక్షన్‌ కమిషన్‌ సూచనల మేరకు తుది ఓటరు జాబితాను రూపొందిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ అన్నారు.

అభ్యంతరాల పరిశీలన తర్వాతే తుది జాబితా
సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలక్షన్‌ కమిషన్‌ సూచనల మేరకు తుది ఓటరు జాబితాను రూపొందిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయపార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది జాబితాను రూపొందిస్తామన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికలను పారదర్శకతతో నిర్వహించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఆదివారం వరకు ముసాయిదా ఓటరు జాబితాపై 53 అభ్యంతరాలు వచ్చాయని, క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును పరిశీలిస్తామని తెలిపారు. వార్డు ఆఫీసర్లతోపాటు, బీఎల్‌వోలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసి డివిజన్ల వారీగా ఓటర్లను సవరణ చేసి తుది జాబితా తయారు చేస్తామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి షెడ్యూల్‌ ప్రకారంగా పోలింగ్‌ బూత్‌వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్నికల సంఘం అక్టోబరు 1న పబ్లిష్‌ చేసిన ఓటరు జాబితా ప్రకారం టి ఈ మ్యాపింగ్‌ చేశామన్నారు. ప్రచురించిన ఓటర్ల జాబితాలో పొలిటికల్‌ పార్టీల ప్రతినిధులు దృష్టికి తెచ్చిన గుర్తు తెలియని ఓటర్లు, డబుల్‌ సీరిస్‌ ఇంటి నంబర్లతో ఉన్న ఓటర్లను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్లతోపాటు ఇంటి నంబర్లు లేని ఓటర్లను గుర్తించి ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరపాలక సంస్థకు వచ్చిన ప్రతి అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరుగకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపడుతామన్నారు. నగర పాలక సంస్థ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని కమిషనర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మేయర్లు, బీజేపీ నాయకులు యాదగిరి సునీల్‌రావు, డి శంకర్‌, అర్బన్‌ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, నాయకులు సత్తినేని శ్రీనివాస్‌, ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్‌ గులాం అహ్మద్‌, మాజీ డిప్యూటీ మేయర్‌, ఎంఐఎం నాయకులు అబ్బాస్‌ సమి, సీపీఐ నాయకులు మణికంఠరెడ్డి, పైడిపల్లి రాజు, సీపీఎం నాయకుడు ఎం వాసుదేవరెడ్డి, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు బండారి శేఖర్‌, కాంగ్రెస్‌ నాయకులు మడపు మోహన్‌, వీరదేవేందర్‌పటేల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు ముత్తయ్య, వైసీపీ నాయకుడు రవీందర్‌రెడ్డి, జనసేన నాయకుడు రాజిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:10 AM