Share News

కొన్ని గంటల్లో ఫైనల్‌..

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:04 AM

మున్సిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

కొన్ని గంటల్లో ఫైనల్‌..
సిరిసిల్లలో నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్న అభ్యుర్థి

- నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

- సిరిసిల్ల, వేములవాడల్లో 7 మంది అభ్యర్థుల ఉపసంహరణ

- ప్యాకేజీలతో ఒప్పించే పనిలో పార్టీ నేతలు

- రెబల్స్‌పై పెరిగిన ఒత్తిడి

- రసవత్తరంగా మున్సి ’పోల్స్‌‘

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

మున్సిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఉపసంహరణలకు మంగళవారంతో గడువు ముగియనుండడంతో సిరిసిల్ల, వేములవాడ బల్దియాల్లో బుజ్జగింపులు, బేరసారాలు జోరందుకున్నాయి. రెండు మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఫైనల్‌ లెక్క మంగళవారం తేలనుంది. గెలుపు ఆకాంక్షతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి టికెట్లు లభిస్తాయనే నమ్మకంతో నామినేషన్లు వేశారు. రెండు మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉండగా 391 మంది నామినేషన్లు వేశారు. ఇందులో సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డుల్లో 240 మంది, వేములవాడలో 28 వార్డుల్లో 151 మంది నామినేషన్లు వేశారు. ప్రధానంగా సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో మాజీ మంత్రి కే తారకరామారావు, వేములవాడ పరిధిలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తమకు అనుకూలంగా అభ్యర్థులను విరమింపచేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలో నుంచి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేసిన వారు ఉన్నారు. వీరు రెబెల్స్‌గా బరిలో ఉంటే ఓట్ల నష్టం జరుగుతుందని భావిస్తూ వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. సోమవారం వరకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఏడుగురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సిరిసిల్లలో ఐదు మంది, వేములవాడలో ఇద్దరు ఉన్నారు.

ఏకగ్రీవాలకు భారీ ఆఫర్లు

సిరిసిల్ల, వేములవాడ మునిసిపాలిటీల్లో ఏకగ్రీవాల వైపు దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఏకగ్రీవ ప్రయత్నాలు కొంతమేరకు సఫలం కావడంతో ఈసారి కూడా నామినేషన్లు తక్కువ ఉన్న వార్డుల్లో మంతనాలు జరుపుతున్నట్లుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు స్వతంత్రులను తమకు మద్దతుగా ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అదే బాటలో అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు పార్టీల్లో ఉపసంహరులపై దృష్టి సారించడమే కాకుండా భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల కింద దాదాపు రూ 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు. తాము ఖర్చు పెట్టే డబ్బులు ఏకగ్రీవాలకు ముందుకొచ్చే వారికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

బీ-ఫాంల టెన్షన్‌

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో అభ్యర్థులకు బీఫాంల టెన్షన్‌ పట్టుకుంది. సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించడంతో ప్రచారంలోకి వెళ్లారు. కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థుల జాబితాలను మాత్రం వెల్లడి చేయలేదు. నేరుగా బీఫాంలనే అందించడానికి నిర్ణయించారు. దీంతో నామినేషన్‌ వేసి బీఫాంలో కోసం చూస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్‌ పట్టుకుంది. మరికొందరు బీఫాంలు రాకపోయినా తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలో రెబల్స్‌గా అభ్యర్థులు బరిలోనే ఉంటే ఓట్లు చీలి పార్టీ గుర్తింపుతో రంగంలో ఉన్న అభ్యర్థులకు నష్టం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్నిచోట్ల రెబల్స్‌ గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో సిరిసిల్ల, వేములవాడలో మున్సిపల్‌ ఉపసంహరణలపై అసక్తి ఏర్పడింది.

Updated Date - Feb 03 , 2026 | 01:04 AM