Share News

ఆర్టీసీ ఎన్నికల్లో.. హోరాహోరీ పోరు

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:51 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధమైంది.

ఆర్టీసీ ఎన్నికల్లో.. హోరాహోరీ పోరు

పెద్దపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధమైంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు కార్మికసంఘాలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 సంఘాలు బరిలో ఉండగా.. ప్రధానంగా కూటముల మధ్య పోటీ నెలకొంది. అక్టోబర్‌ 9న శుక్రవారం రోజున పోలింగ్‌ జరగనుండటంతో గురువారం ప్రచారానికి తెరపడింది.

ఫ పెద్దపల్లి జిల్లాలో 603మంది ఓటర్లు..

పెద్దపల్లి జిల్లాలోని మంథని, గోదావరిఖని ఆర్టీసీ డిపోలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. మంథనిడిపో పరిధిలో 178మంది, గోదావరిఖని డిపో పరిధిలో అత్యఽధికంగా 425మంది ఉద్యోగులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. మొత్తంగా ఈ రెండు డిపోల పరిధిలో 603మంది ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు.

ఫ మూడు సంఘాల కూటమి.. హోరెత్తిన ప్రచారం

మంథని, గోదావరిఖని డిపోల పరిధిలో ప్రధానంగా ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ కూటమిగా బరిలోకి దిగాయి. అలాగే తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌, స్టాఫ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, ఎస్‌డబ్ల్యూ సంఘాలు కూడా పోటీలో ఉన్నాయి. ఆయా సంఘాల నాయకులు డిపోల పరిధిలోని కార్మికులను వ్యక్తిగతంగా కలుస్తూ తమ కూటమి విధానాలను వివరిస్తున్నారు. మంథని డిపోలో ఈ కూటమి ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు సమాచారం.

ఫ సమస్యలే ప్రచారాస్త్రాలు

ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కార్మికుల పీఆర్‌సీ, పెండింగ్‌ బకాయిలు, ఉద్యోగ భద్రత, సిబ్బంది కొరత, పని భారం, పదోన్నతులు, బదిలీలు, డ్యూటీ విధానాలు, సంక్షేమ సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో ప్రధాన హామీలుగా మారాయి.

ఫ ఒక్కో ఓటరుకు రెండు ఓట్లు..

ఈసారి ఎన్నికల్లో ప్రతి ఉద్యోగి రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘం కోసం కాగా.. మరోటి ప్రాంతీయ(రీజియన్‌) గుర్తింపుసంఘం కోసం వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35నుంచి 39వేల మంది ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచి, అక్టోబర్‌ 17న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఫ ఉత్కంఠ..

మంథని, గోదావరిఖని డిపోల్లో కొద్దిరోజులుగా కొనసాగిన ప్రచారంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఒకవైపు సంఘాల నేతలు తమ హామీలను కార్మికుల ముందుంచుతుండగా.. మరోవైపు కార్మికులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఎవరు స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తారనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 603మంది ఓటర్ల తీర్పు ఏ దిశగా ఉంటుందన్నది అక్టోబర్‌ 17న తేలనుంది.

Updated Date - Oct 09 , 2026 | 12:51 AM