Share News

కాంగ్రెస్‌లో కలహాల కుంపట్లు

ABN , Publish Date - Jan 19 , 2026 | 01:14 AM

గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క డివిజన్‌ కూడా దక్కలేదు.

కాంగ్రెస్‌లో కలహాల కుంపట్లు

- నాలుగు స్తంభాల ఆటలో నలుగుతున్న శ్రేణులు

- మంత్రుల మధ్య విభేదాలతో ఇబ్బందులు

- టికెట్ల కేటాయింపులో ఎవరి మాట నెగ్గేనో...

- ఆశావహుల్లో గందరగోళం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క డివిజన్‌ కూడా దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ నాలుగు వరుస పరాజయాలను చవిచూసింది. జిల్లా రాజకీయాలకు గుండెకాయ లాంటి కేంద్రంలో నామమాత్రంగా మారిన కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారపార్టీగా అవతరించడంతో ఇక్కడ పూర్వవైభవాన్ని తిరిగి సాధించాలని తహతహలాడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో మెరుగైన ఫలితాలను సాధించిన స్పూర్తితో మున్సిపాలిటీల్లోనూ సత్తాచాటాలని ఆ పార్టీ ఆశిస్తున్నది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పునాదులు వేసుకోవాలనుకుంటోంది. జిల్లా కేంద్రంలో పార్టీ పతాకాన్ని రెపరెపలాడించి మళ్ళీ పాత రోజులను గుర్తు చేయాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆశిస్తున్నది. స్థానిక నేతల పరిస్థితి అందుకు ప్రతికూల వాతావరణాన్ని కల్పిస్తున్నది.

ఫ పలు అధికార కేంద్రాలు

ఇటీవలి వరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి లేరు. అంతకు ముందు ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి ఉండేది. పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిస్థితి అదే విధంగా ఉండడంతో కాంగ్రెస్‌ రాజకీయాలు స్తంబ్ధంగా మారాయి. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌కు రాజకీయంగా ఒకరంటే ఒకరికి పడదు. ఒకరు చెప్పిన దానిని మరొకరు బహిరంగగా కాకున్నా పరోక్షంగా వ్యతిరేకిస్తారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నేతలు, ముఖ్య కార్యకర్తలకు ఎవరి వద్దకు వెళితే ఎవరికి కోపం వస్తుందో అనే పరిస్థితి. స్థానికంగా పట్టించుకునే నాథుడే లేరు అనే స్థితి నుంచి ఇటీవలే కొన్ని నియామకాలు జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం, కరీంనగర్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్‌కుమార్‌, కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వెలిచాల రాజేందర్‌రావును నియమించారు. అంతకుముందే సుడా చైర్మన్‌గా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు నేతలు ఎక్కువై అధికార కేంద్రాలు పెరిగాయి. డీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్‌ అధ్యక్షుడు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, సుడా చైర్మన్‌ అధికార కేంద్రాలుగా మారి ఎవరికివారు తమతమ రాజకీయాలను నిర్వహిస్తున్నారు. వీరికితోడు మంత్రుల ఆధిపత్యపోరు ఉండనే ఉంది. ప్రస్తుతం కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల వ్యవహారానికి ఈ నాలుగు స్తంభాల ఆట ప్రతిబంధకంగా మారింది.

ఫ ఎవరికి వారే..

అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో పర్యటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తనకు కార్పొరేషన్‌ ఎన్నికలను ఎదుర్కొని పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతలను అప్పగించారని చెబుతున్నారు. వివిధ పార్టీల్లో ఉన్నవారిని, గతంలో కాంగ్రెస్‌లో ఉండి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నవారిని పార్టీలో చేర్చుకుంటూ, కండువాలు కప్పుతూ వస్తున్నారు. టికెట్లు ఇచ్చేది, ఆ తర్వాత గెలిపించేంది తానేనని అంటున్నారని సమాచారం. రాజేందర్‌రావు డివిజన్లలో క్రియాశీలంగా రాజకీయాలు నిర్వహిస్తుంటే కార్పొరేషన్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ ఆయన టికెట్లు ఇస్తారనే ప్రచారాన్ని ఆక్షేపిస్తున్నారు. పార్టీ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది తప్ప స్థానికనేతలెవరూ టికెట్లు ఇవ్వరని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించారు. ఈనెల 20 నుంచి డీసీసీ కార్యాలయంలో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయదలుచుకున్నవారు దరఖాస్తులు చేసుకోవాలని, అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి అధిష్ఠానం ఒక కమిటీని వేసి దరఖాస్తులను స్ర్కీనింగ్‌ చేసి అభ్యర్థులను నిర్ణయిస్తుంది తప్ప ఏ ఒక్కరూ ఏ నిర్ణయం తీసుకోలేరని ప్రకటించారు. ఈ ముగ్గురు నేతల మాటల రాజకీయాల్లో టికెట్‌ ఆశిస్తున్న కాంగ్రెస్‌ నేతలు గందరగోళంలో పడిపోయారు. పరిస్థితి విషమిస్తున్నదని గమనించిన డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని నిర్ణయాలు పార్టీ రాష్ట్ర నాయకత్వమే తీసుకుంటుందని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు గందరగోళానికి తావులేదని అన్నారు. స్థానిక నేతలెవరూ ఈ వ్యవహారం గురించి మాట్లాడవద్దని చెప్పారు.

ఫ అందరినీ కలుస్తున్న ఆశావహులు

టికెట్లు ఎవరిస్తారనే విషయంలో ఏర్పడిన గందరగోళానికి తెరపడినా ఏ పుట్టలో ఏ పాముందో .. ఏ నాయకుడిని కలిస్తే టికెట్‌ వస్తుందో అన్న విషయంలో ఒక నిర్దారణకు రాని ఆశావహులు ఒకరికి తెలియకుండా ఒకరిని కలుస్తున్నారు. అవకాశాలు కల్పించాలని కోరుతూ ఎక్కే గడప దిగే గడపగా తిరుగుతున్నారు. స్థానిక నాలుగు స్తంభాల ఆట, మంత్రుల ఆధిపత్య పోరు కాంగ్రెస్‌ను ఏ దిశగా తీసుకువెళ్తాయి, ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్‌ను గెలుచుకోవడం సాధ్యమేనా కాదా తమ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయో అంటూ పోటీచేయాలనుకుంటున్న నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇద్దరు మంత్రుల్లో ఎవరికో ఒకరికి బాధ్యతలు ఇవ్వడమో, ఇద్దరిని సమన్వయంతో పని చేయించి అభ్యర్థులను గెలిపించమని పార్టీ ఆదేశిస్తే తప్ప కాంగ్రెస్‌ పూర్వవైభవాన్ని సాధించాలనుకోవడం సాధ్యం కాదని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. పార్టీ అధిష్ఠానం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో, కలహాల కుంపట్లు మానిపించి కలిసి పనిచేసేలా చేస్తుందో లేదో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 01:14 AM