Share News

మళ్లీ ఎరువుల భారం

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:36 AM

అన్నదాతలకు ఎరువులు భారంగానే మారుతున్నాయి.

మళ్లీ ఎరువుల భారం

- యాసంగి సీజన్‌ ప్రారంభంలోనే రెండుసార్లు పెరిగిన ధరలు

- జిల్లా రైతులపై రూ.8 కోట్ల భారం

- యాసంగి సాగు 1.93 లక్షల ఎకరాలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

అన్నదాతలకు ఎరువులు భారంగానే మారుతున్నాయి. యాసంగి ప్రారంభంలోనే రెండుసార్లు ఎరువుల ధరలు పెరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వానాకాలం సీజన్లో అతివృష్టి, అనావృష్టితో ఇబ్బందులు పడ్డ రైతులకు పెరుగుతున్న ఎరువుల ధరలు మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయి. వానాకాలం సీజన్లో ఒకసారి ఎరువుల ధరలు పెరిగితే యాసంగిలో డీఎపీ, యూరియా మినహా అన్ని రకాల ఎరువుల ధర రూ.50 మేరకు పెంచారు. మరోవైపు యూరియా కొనుగోలుకు ప్రభుత్వం యాప్‌ తీసుకురావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో 1.93 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి 1.83 ఎకరాల్లో, మొక్కజొన్న 2135 ఎకరాలు, నువ్వులు 490 ఎకరాలు, పొద్దుతిరుగుడు 1107 ఎకరాలు, కందులు 375 ఎకరాలు, వేరుశనగ 35 ఎకరాలు, పెసర 81ఎకరాలు, చెరుకు 20ఎకరాలు, జొన్న నాలుగు ఎకరాలు, ఇతర పంటలు 6745 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. వరి ప్రధాన పంటగా 1.83 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందుకోసం 45312 మెట్రిక్‌ టన్నుల ఎరువులు వినియోగించనున్నారు.

యూరియా మినహా అన్నీ..

జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించి 1.93 లక్షల ఎకరాల్లో వేసే పంటలకు ఎరువులు 45312 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ఇందులో యూరియా 23128 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 3562 మెట్రిక్‌ టన్నులు, ఎన్‌పీకేఎస్‌ 12211 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4885 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1526 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు యాసంగిలో ఎరువుల భారం ముందే మొదలైంది. డీఏపీ ధర ప్రస్తుతం పాత ధర 50 కిలోల బస్తాకు రూ.1429 సబ్సిడీ మినహాయిస్తే రూ.267 రైతులకు ఇస్తున్నారు. అలాగే ఉంది. మిగతా ఎరువుల బస్తాలపై రూ.50 పెరిగాయి. 20:20:13 ప్రస్తుతం రూ.1450 నుంచి రూ.1500లకు చేరింది. 14:35:14 ప్రస్తుతం రూ.1900 నుంచి రూ.1950లకు, 28:28:0 ప్రస్తుతం రూ.1850 నుంచి రూ.1900లకు చేరింది. పొటాష్‌ రూ.1700 నుంచి రూ.1800 పెరిగింది. యాసంగిలో కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. దీంతో రైతులకు అదనంగా రెండుసార్లు పెరిగిన ధరలతో రూ.8 కోట్ల వరకు భారం పడుతుంది. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ఎరువులపై పడ్డ భారం రైతులు మోయాల్సి వస్తుంది.

యాసంగి సాగుకు ఢోకా లేదు...

మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమృద్ధిగా కురిసిన వర్షాలతో యాసంగి సాగుకు ఢోకా లేదనే భరోసాతో ఉన్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభంలో వర్షాలు కురవక రైతులు ఇబ్బందులు పడ్డారు. అల్పపీడన ప్రభావంతో భారీగా కురిసిన వర్షాలు సిరిసిల్ల, వేములవాడ మూలవాగులు ఉధృతంగా ప్రవహించడంతో మిడ్‌ మానేరుకు జలకళ వచ్చింది. జిల్లాలోని ఎగువమానేరు, నిమ్మపల్లి ప్రాజెక్ట్‌, అనంతారం ప్రాజెక్ట్‌లతో పాటు భారీ చెరువులు, కుంటలు జల కళతో ఉట్టిపడుతున్నాయి. మిడ్‌ మానేరులో 27.55 టీఎంసీల సామర్థ్యానికి 26.70 టీఎంసీల నీరు ఉంది. సిరిసిల్ల మానేరు వాగు బ్యాక్‌ వాటర్‌తో కళకళలాడుతోంది. దీంతో యాసంగిలో రైతులు పండించే పంటలకు ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అధికంగానే వర్షాలు పడ్డాయి. డిసెంబర్‌ వరకు సాధారణ వర్షపాతం 820.4 మిల్లీమీటర్లకు 997.0 మిల్లీమీటర్ల వర్షం కురసింది. జిల్లాలో రుద్రంగి 819.0మిల్లీమీటర్లు, చందుర్తి 912.4 మిల్లీమీటర్లు, వేములవాడ రూరల్‌ 864.8 మిల్లీమీటర్లు, బోయినపల్లి 795.1 మిల్లీమీటర్లు, వేములవాడ 1058.7 మిల్లీమీటర్లు, సిరిసిల్ల 929.5మిల్లీమీటర్లు, కోనరావుపేట 1027.7 మిల్లీమీటర్లు, వీర్నపల్లి 970.4 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 1024.8 మిల్లీమీటర్లు, గంభీరావుపేట 1156.7 మిల్లీమీటర్లు, ముస్తాబాద్‌ 1135.21 మిల్లీమీటర్లు, తంగళ్లపల్లి 1142.2 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంట 1124.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో యాసంగిసాగుకు ఇబ్బందులు ఉండవని రైతులు భరోసాగా ఉన్నారు.

జిల్లాలో యాసంగి సాగు లెక్కలు

మండలం వరి మొత్తం

గంభీరావుపేట 18,900 19,420

ఇల్లంతకుంట 24,500 26,521

ముస్తాబాద్‌ 22,200 23,555

సిరిసిల్ల 4,700 4,895

తంగళ్లపల్లి 20,200 21,241

వీర్నపల్లి 7,500 7,500

ఎల్లారెడ్డిపేట 18,000 18,255

బోయినపల్లి 13,600 15,545

చందుర్తి 15,500 15,879

కోనరావుపేట 18,100 18,680

రుద్రంగి 4,550 5,682

వేములవాడ 5,300 5,522

వేములవాడ రూరల్‌ 10,800 11,136

-----------------------------------------------------------------------------------------------------

మొత్తం 1,83,850 1,93,837

-----------------------------------------------------------------------------------------------------

Updated Date - Jan 04 , 2026 | 01:36 AM