Share News

‘ఫీ’జులుం..

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:55 AM

ప్రైవేట్‌ పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకటో తరగతికి కట్టే ఫీజులతో డిగ్రీ, పీజీ సైతం పూర్తిచేయవ చ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనిఫాంలు, పాఠ్య, రాత పుస్తకాలు, బ్యాగ్‌ తదితర సామగ్రి మొత్తం తమ పాటశాలలోనే కొనాలంటూ నిబంధనలు పెడుతూ కొన్ని యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నాయి.

‘ఫీ’జులుం..

- ప్రైవేట్‌ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజుల వసూళ్లు

- చిన్న తరగతులకూ రూ. వేలల్లో వసూళ్లు

- యథేచ్ఛగా యూనిఫాం, పుస్తకాల అమ్మకాలు

- భారంగా మారుతున్న పిల్లల చదువులు

- తల పట్టుకుంటున్న తల్లిదండ్రులు

- జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఓ చిరుద్యోగి. తనకొచ్చిన రూ. 12 వేల ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ ఏడాది అతని పిల్లలు 3వ, 5వ తరగతులకు వస్తున్నారు. వారి భవిష్యత్తు బాగుంటుందని పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. అక్కడ ఫీజులే ఒకరికి రూ. 25 వేలు, మరొకరికి రూ. 20 వేలు. ఇవి కాక పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, నోటు పుస్తకాలు, రవాణా వంటివన్నీ లెక్క వేసుకుంటే ఇద్దరికీ కలిపి రూ. అర లక్షపైగా అవుతోంది. తనకొచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. పిల్లల భవిషత్తు కోసం అప్పుచేసేనా చదివించాల్సి వస్తుందని ఆ తండ్రి చెబుతున్నాడు.

- సారంగపూర్‌ మండలంలోని పెంబెట్ల గ్రామానికి చెందిన మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ రైతు కుమారుడు ఇటీవల తొమ్మిదో తరగతి పూర్తిచేశాడు. కుమారుడి భవిష్యత్తు బాగుంటుందని జగిత్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతిలో చేర్పింద్దామని భావించాడు. అక్కడ ఫీజు, ఇతర ఖర్చులు ఏడాదికి సుమారు రూ. అర లక్షకు పైగా అవుతుందని చెప్పడంతో అవాక్కయ్యారు. పిల్లవాడి భవిష్యత్తును ఆలోచించి మరో మార్గం లేక, అప్పోసొప్పో చేసి ఎలాగైనా అక్కడే చదివించాలని నిర్ణయించుకున్నారు.

జగిత్యాల, జూన 26 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకటో తరగతికి కట్టే ఫీజులతో డిగ్రీ, పీజీ సైతం పూర్తిచేయవ చ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనిఫాంలు, పాఠ్య, రాత పుస్తకాలు, బ్యాగ్‌ తదితర సామగ్రి మొత్తం తమ పాటశాలలోనే కొనాలంటూ నిబంధనలు పెడుతూ కొన్ని యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నాయి.

నిబంధనలు బేఖాతరు..

జిల్లావ్యాప్తంగా 292 వివిధ ప్రైవేటు పాఠశాలలున్నాయి. జిల్లాలో సుమారు ఎనబై శాతం పాఠశాలలు నిబంధనలు పాటించడం లేదు. కేవలం ఇరవై శాతం లోపు పాఠశాలలు మాత్రమే రూల్స్‌ పాటిస్తున్నాయి. జిల్లాలో ఇరవై శాతం మినహా మిగిలిన పాఠశాలల్లో ఆట స్థలం ఉండడం లేదు. ఆట స్థలం ఉన్నప్పటికీ పలు పాఠశాలల్లో పీఈటీలు ఉండడం లేదు. అనుమతుల సమయంలో బీఈడీ, పీజీ సర్టిఫికేట్లు ఉన్న వారిని చూపించి..అర్హత లేని వారితో పాఠాలు చెప్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాల వివరాలు, రికగ్నైజేషన్‌, రెన్యూవల్‌ సర్టిఫికేట్లు అందజేయకపోయినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

రెసిడెన్షియల్స్‌ నిర్వహణలో..

జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలలు ఎటువంటి అనుమతి లేకుండా హాస్టల్స్‌ను నిర్వహిస్తున్నాయి. హాస్టల్‌ పేరుతో అదనపు ఫీజులను గుంజుతున్నాయి. ప్రైవేటు హాస్టల్‌ నిర్వహణకు పలు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఎటువంటి సౌకర్యాలు లేని భవనాల్లో హాస్టల్స్‌ నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో ఒకటి, రెండు మినహా ఏ పాఠశాలకు రెసిడెన్షియల్‌ అనుమతి లేనట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 80 వరకు రెసిడెన్షియల్‌ పాఠశాలలున్నట్లు అంచనా. నాణ్యమైన భోజనం, విద్యా, వైద్యం, రక్షణ తదితర వసతులను కల్పించాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

విద్యాహక్కు చట్టం అమలేదీ...

విద్యాహక్కు చట్టం సెక్షన-6 ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన -11లో సూచించిన విధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు గవర్నింగ్‌ బాడీ నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. వసూలు చేసే ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన-12 ప్రకారం విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి 1ః20కి మించరాదు. ప్రతి పాఠశాలలో 25 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనార్టీలకు కేటాయించాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్‌ బుక్స్‌, యూనిఫాం, బ్యాగులు, ఇతర స్టేషనరీ అమ్మరాదు. ఇవేవీ సక్రమంగా అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి.

ఫీజుల నియంత్రణ పట్టదా...

కార్పొరేటు, ప్రైవేటు విద్యాసంస్థలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ లేదు. దీంతో ఆయా విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తూ పోతున్నాయి. భారీగా పెరిగిన ఫీజులతో సామాన్య ప్రజలకు విద్య అందని ద్రాక్షగా మారుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్ర, రాజస్థాన, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌ సహా 15 రాషా్ట్రల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణ కూడా ఇదే తరహా చట్టాలను తెస్తే తప్ప ఫీజుల నియంత్రణకు చెక్‌ పడే అవకాశం కనిపించడం లేదని విద్యార్థి సంఘాలు అంటున్నాయి.

ఫీజులను నియంత్రించాలి..

- అడిగొప్పుల రజిని, గృహిణి, జగిత్యాల

ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూళ్లు చేయడం, ఇష్టారీతిగా పుస్తకాల విక్రయం తదితర వ్యవహారాల వల్ల మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తప్పడం లేదు. అధికారులు ఫీజులను నియంత్రించాలి. నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.

పాఠశాలల దోపిడీ అరికట్టాలి

- దొనికెల నవీన్‌, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

ప్రైవేటు పాఠశాలల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలి. గతంలో పలు కమిటీల నియామకం చేసినప్పటికీ అమలు పట్టించుకోవడం లేదు. జిల్లాస్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటుచేయాలి. పాఠశాలల్లో మౌలికవసతులు, అర్హులైన ఉపాధ్యాయులు, గ్రంథాలయం, ఆటస్థలం నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలి.

నిబంధనలు పాటించాల్సిందే..

- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తప్పవు. విద్యార్థుల ప్రవేశాలు, ఫీజుల వసూళ్లు, రికార్డుల నిర్వహణ, విద్యార్థులకు వసతుల కల్పన తదితర విషయాల్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి.

Updated Date - Jun 27 , 2026 | 12:55 AM