Share News

ముగిసిన రైతు వారోత్సవాలు

ABN , Publish Date - May 11 , 2026 | 02:08 AM

వానాకాలం సాగుకు రైతులను సన్నద్ధం చేయడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు వారోత్సవాలు శనివారం ముగిశాయి.

ముగిసిన రైతు వారోత్సవాలు

- ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు..

- ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ

-ఆధునిక వ్యవసాయం రైతులకు అవగాహన

జగిత్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగుకు రైతులను సన్నద్ధం చేయడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు వారోత్సవాలు శనివారం ముగిశాయి. ఈనెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహించింది. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు మాకునూరి సంజయ్‌ కుమార్‌, కల్వకుంట్ల సంజయ్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్‌, ఇతర ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు భాగస్వామ్యం అయి రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పించారు.

ఫ భూసార పరిరక్షణపై మార్గనిర్దేశం..

వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవాలకు రైతులకు భూసారాన్ని పరిరక్షించే పద్ధతులు, మట్టి నమునాల సేకరణ, సాయిల్‌ హెల్త్‌ వలంటీర్లకు శిక్షణ, సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులు, ఆయిల్‌పామ్‌ సాగు, నానో యూరియా వినియోగంపై రైతులకు మార్గనిర్దేశం చేశారు. సమతుల ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన పంటల సాగు, ఆయిల్‌పామ్‌ విస్తరణ, వ్యవసాయ యాంత్రీకరణ, సోలార్‌ పంప్‌ సెట్లు, డ్రోన్‌ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, పశు సంవర్థక శాఖ, మత్స్య, నీటి పారుదల, ఉద్యానవన శాఖ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. రైతు వేదికల్లో వానాకాలం సాగు ప్రణాళిక, మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగంపై కల్పించారు.

ఫఉద్యానవన రంగానికి ఊతం..

జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు, ముఖ్యంగా ఆయిల్‌పామ్‌, నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చారు. బిందు సేద్యం, నీటి పొదుపు సాంకేతికతల వినియోగంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, సహకార సంఘాల సేవలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గోదాముల నిల్వ సదుపాయాలు, కనీస మద్దతు ధర, మార్కెటింగ్‌ అవకాశాలను రైతులకు అధికారులు వివరించారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్‌ సాంకేతికత ప్రదర్శనలు నిర్వహించారు. పీఎం కుసుమ్‌ పథకం కింద సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు, సబ్సిడీలపై అవగాహన కల్పించారు.

ఫపశు సంవర్థక, మత్స్య రంగాలకు ప్రాధాన్యం..

జిల్లాలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పశు కృతిమ గర్భధారణ క్యాంపులు నిర్వహించి పలు పశువులకు వైద్య పరీక్షలు చేశారు. రైతులకు పచ్చి గడ్డి విత్తనాలు పంపిణీ చేశారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేపల ఉత్పత్తి పెంపు, చెరువుల నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించారు. వేసవిలో పశు సంరక్షణ, పచ్చిగడ్డి సాగు, సమగ్ర నీటి వినియోగం, నీటి లభ్యత ఆధారంగా పంటల ప్రణాళికపై వివరించారు. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో కాలువల మరమ్మతులు, చెరువుల పూడికతీత పనులు వేగవంతం చేయడంపై అవగాహన కల్పించారు. చెరువుల గట్లపై పిచ్చిమొక్కలు, కంప చెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, కాలువల శుభ్రత కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. చెరువుల నల్ల మట్టి వినియోగం వల్ల నేల సారవంతం పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు.

వ్యవసాయ రంగం మరింత బలపడుతుంది

- భాస్కర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

రైతు వారోత్సవ కార్యక్రమాలు రైతులకు శాస్త్రీయ అవగాహణ అధునిక సాంకేతిక ఆర్థిక భోరా అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి దోహదపడనున్నాయి. రైతు సంక్షేమం ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగం మరింత బలపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తుంది.

Updated Date - May 11 , 2026 | 02:08 AM