Share News

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:58 PM

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, స్వల్పకాలిక పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

సిరిసిల్ల, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, స్వల్పకాలిక పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై నీటి పారుదల శాఖ, మిషన్‌ భగీరథ, మున్సిపల్‌ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధి కారులు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఎగువ మానేరు రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం రెండు టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.612 టీఎంసీల నీరు ఉందని వెల్లడించారు. అలాగే మల్క పేట రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.33 టీఎంసీలు, అన్నపూర్ణ రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 3.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.45 టీఎంసీల నీరు ఉందని, మిడ్‌ మానేరు రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.44 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదు అయిం దని వెల్లడించారు. ఎగువ నుంచి రిజర్వాయర్లకు వరద రావడంలేదని, ప్రస్తుతం రిజర్వాయర్లలోని నీటిని తాగునీటి కోసం ఉపయోగించాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని అన్ని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు ఎక్కువగా లేవ ని తెలిపారు. దీంతో ఆయా రిజర్వాయర్లు, చెరువులు, కుంటల కింద సాగునీరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వివరించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. స్వల్పకాలిక పంటలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు, ఆయిల్‌ పామ్‌ తదితర పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికా రులు ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల పరిధిలో ఫాం పాండ్స్‌, బోర్‌ వెల్స్‌, రీచార్జ్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫాం పాండ్స్‌తో రైతుల పొలాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని, ఎన్నో లాభా లు ఉన్నాయని తెలియజేస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫాంపాండ్స్‌ ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో బోర్‌వెల్స్‌ రీచార్జ్‌ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. బోర్‌ వెల్స్‌ రీచార్స్‌తో భూగర్భ జలాలు పెరిగి నీటి ఇబ్బందులు దూరమవుతాయనే విషయాన్ని తెలియజేయా లని అన్నారు.

డ్రైడే కచ్చితంగా పాటించాలి..

జిల్లాలో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే కచ్చితంగా పాటించా లని కలెక్టర్‌ ఆదేశించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై వివరించా లని పేర్కొన్నారు. వర్షం కురిసిన మరుసటి రోజు డ్రైడే నిర్వహించాలని తెలిపారు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒకవేళ పశువులు, మేకలు, గొర్రెలకు దానా, పశుగ్రాసం కోసం కావలసిన ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవా లని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. తినక ముందు, తిన్న తర్వాత చేతులు కడుక్కునేలా వివరించాలని పేర్కొన్నారు. నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాత తాగేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, పశు సంవర్ధక శాఖ అధి కారి రవీందర్‌రెడ్డి, జిల్లా నీటి పారుదల మధుకర్‌, మిషన్‌ భగీరథ ఈఈలు అన్వర్‌, సుమలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేష్‌, నీటి పారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 11:58 PM