రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్తా..
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:41 AM
కెనాల్ నిర్మాణం కోసం నిరసన చేస్తున్న రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : కెనాల్ నిర్మాణం కోసం నిరసన చేస్తున్న రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామసమీపంలో ఎల్‌ఎమ్ 6కెనాల్ నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు చేపట్టిన దీక్ష బుధవారానికి 23వ రోజుకు చేరుకుంది. రైతులు చేస్తున్న దీక్షకు ఎమ్మెల్సీ సంఘీభావం తెలిపారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు ఇద్దరు పెద్దనాయకులు ఉన్న ప్రాంతంలో రైతులు చాలా రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలుగుతుందన్నారు. కేవలం 1.5కిలోమీటర్ల మేర కెనాల్ నిర్మాణం చేస్తే ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతుల గొంతును తాన శాసనమండలిలో వినిపిస్తానని అన్నారు. అన్నదాతల కన్నీళ్లకు వెలకట్టలేమని, రైతులకు నీరందించే బాధ్యతను తానే తీసుకుంటానని పేర్కొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫోన్‌చేసి రైతుల సమస్యలు వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీకుమార్‌యాదవ్, ప్రధానకార్యదర్శి వట్టె జానయ్యయాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్యగౌడ్, రాష్ట్రకార్యదర్శి కొమ్ముల ప్రవీణ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజగౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకుల గీస మధు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బిక్షపతి, మండల అధ్యక్షుడు బాబులతో పాటు రైతులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని రామోజిపేట గ్రామంలో శ్రీరామక్షేత్రంలో ఎమ్మెల్సీ మల్లన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ చొప్పరి భూమయ్య, ఉపసర్పంచ్ జనార్దన్, గ్రామస్థులు పాల్గొన్నారు.