రైతుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - May 11 , 2026 | 12:02 AM
మొక్క జొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు.
హుజూరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): మొక్క జొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. హుజూరాబాద్ పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం కొంకటి చంద్రయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో అరిగోస పడుతుంటే సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. క్వింటాల్‌కు తాలు, తేమ పేరుతో ఐదు నుంచి ఎనిమిది కిలోల వరకు కోత విధించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని కామన్ గ్రేడ్ కింద రైస్‌మిల్లర్లు తీసుకుంటున్నన అధికారులు తమకేమి పట్టినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ హాజరై వియవంతం చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొప్పుల శంకర్, ప్రతాప శ్రీనివాస్, చంద్రయ్య, దేవేందర్, కుమార్, శ్రీకాంత్, సారయ్య పాల్గొన్నారు.