ఎస్సారెస్పీపైనే రైతుల ఆశలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:45 AM
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఎగువ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి నీటి ప్రవాహం పెరగడం లేదు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఎగువ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి నీటి ప్రవాహం పెరగడం లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండకపోతే జిల్లాలో సాగునీటి పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో సగానికి పైగా వ్యవసాయ భూములు ఎస్సారెస్పీ నీటిపైనే ఆధారపడటంతో రైతులంతా ఇప్పుడు ప్రాజెక్టుపైనే దృష్టి సారించారు. ఎస్సారెస్పీ పూర్తి నీటిమట్టం 80.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 15.274 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 19.537 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవక పోవడంతో ఆశించిన స్థాయిలో వరద నీరు ప్రాజెక్టుకు చేరడం లేదు. ఇదే పరిస్థితి మరి కొంత కాలం కొనసాగితే సాగునీటి విడుదలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. గత ఏడాది ప్రాజెక్టు ఎగువ భాగాన జూలై మాసంలోనే వర్షాలు పడడం ఆరంభం అయ్యాయి. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వర్షాకాలం ఆరంభమైన జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 1.875 టీఎంసీల నీళ్లు రాగా, తాగు నీటి అవసరాలకు 2.890 టీఎంసీల నీటిని వినియోగించారు. గత ఏడాది ఆశించిన మేరకు వర్షాలు పడడంతో ఎస్సారెస్పీ ఆగస్టు మొదటి వారంలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. కానీ ఇప్పుడు సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడ లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలయ్యింది..
ఫ ఎస్సారెస్పీ నీళ్లే ప్రధాన ఆధారం..
జిల్లా రైతులకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరప్రదాయినిగా మారింది. యేటా ఆ ప్రాజెక్టు నిండితేనే రైతులు రెండు పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, కమాన్‌పూర్, మంథని, ముత్తారం, రామగిరి, అంతర్గాం, పాలకుర్తి, రామగుండం మండలాల్లోని సుమారు లక్షా 76 వేల ఎకరాల భూములకు డి-83, డి-86 కాలువల ద్వారా యేటా సాగు నీరందుతున్నది. పెద్దపల్లి జిల్లాలో లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు ఎస్సారెస్పీ కాలువల ద్వారానే సాగునీరు అందుతోంది. జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేస్తుంటారు. ప్రాజెక్టు ఆయకట్టు భూముల్లో వరి పంటను మాత్రమే సాగు చేస్తున్నారు. ఆలస్యంగానైనా వర్షాలు పడి ప్రాజెక్టులోకి ఈ సీజన్‌కు సరిపడా నీళ్లు వస్తాయనే ఆశతో రైతులు వ్యవసాయ బావులు, బోరు బావుల కింద వరి నార్లు పోశారు. ప్రాజెక్టు నిండకపోతే కాలువల ద్వారా నీటి సరఫరా కష్టమై, పంటల సాగు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు.
ఫ జిల్లాలోనూ వర్షాల లోటు..
జిల్లాలో కూడా ఈ సీజన్‌లో సాధారణం కంటే 8 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు కురవగా, విస్తృతంగా వర్షాలు పడలేదు. గురువారం నాటికి జిల్లా సగటు సాధారణ వర్షపాతం 225.4 మిల్లీమీటర్లకు గాను 206.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంతర్గాం, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదు కాగా, ధర్మారం, పాలకుర్తి, రామగుండం, రామగిరి, కమాన్‌పూర్, పెద్దపల్లి, ముత్తారం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది. జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, మంథని మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాధారంగా 52,300 ఎకరాల్లో పత్తి, తదితర పంటలను రైతులు సాగు చేయగా, ఇప్పుడిప్పుడే మొలకలు మొలకెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు రైతులు తంటాలు పడుతున్నాయి. వర్షాలు పడని కారణంగా వ్యవసాయ, బోరు బావుల కింద వరి నాట్లు ఆలస్యంగా వేస్తున్నారు. చెరువులు, కుంటలు కూడా ఆశించిన స్థాయిలో నిండలేదు. అలాగే జిల్లాలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా 20.175 టీఎంసీలకు గాను 8.030 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. వరద రాకుంటే మాత్రం జిల్లాతో పాటు పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందులు ఏర్పడనున్నాయి.
ఫ ఎల్‌నినో ప్రభావమే కారణమా?
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాల పడడంలో అసమానతలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో వర్షాలు పడకపోయినా ఈ నెలలోనైనా ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టులోకి గణనీయమైన వరద నీరు చేరే అవకాశం ఉంది. వర్షాలు కురిసి ఎస్సారెస్పీ నిండాలని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరిగితేనే ఖరీఫ్ సీజన్‌కు భరోసా లభిస్తుందని, లేదంటే జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణిస్తేనే ఖరీఫ్ పంటల సాగు ముందుకు సాగనున్నది.