Share News

అన్నదాత ఆశలు ఆవిరి

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:26 AM

సూపర్‌ ఎల్‌నినో విపత్తుతో అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. ఎండిపోతున్న పంటలు.. కరెంటు కోతలతో పల్లెలు దిగాలు పడుతున్నాయి

అన్నదాత ఆశలు ఆవిరి

(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)

సూపర్‌ ఎల్‌నినో విపత్తుతో అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. ఎండిపోతున్న పంటలు.. కరెంటు కోతలతో పల్లెలు దిగాలు పడుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక కరువు బాటలో రాజన్న సిరిసిల్ల జిల్లా విలవిల్లాడుతోంది. వ్యవసాయ శాఖ అంచనాకు తక్కువగానే పంటలు సాగుచేసినా చివరి దశలో అడుగంటుతున్న బోరు బావులు, అప్రకటిత విద్యుత్‌ కోతలు, లో-వోల్టేజీతో కాలిపోతున్న మోటర్లతో పంటలు ఎండి పోతున్నాయి. మరోవైపు మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఎండాకాలం రాక ముందే పొలాలు నెర్రలు వాడుతు న్నాయి. కొన్ని చోట్ల పంటలు పశువుల మేతగా మారుతున్నాయి. పెట్టుబ డి సైతం వచ్చే పరిస్థితులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ శాఖ ఖరీఫ్‌ సీజన్‌ 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు 20 వేల ఎకరాల వరకు సాగు తగ్గించుకున్నారు. 2.23 లక్షల ఎకరాలు వివిధ పంటలు సాగు చేయగా ప్రధానంగా 1.47 లక్షల ఎకరాల్లో వరి, 50,275 ఎకరాలు పత్తి సాగు చేశారు. మొక్కజొన్న 4500 ఎకరాలు, కంది 2800 ఎకరాలు, ఇతర పంటలు 18,646 ఎకరాల్లో వేసుకున్నారు.

ఫ అన్నదాతల్లో ఆందోళన

ప్రభుత్వం అందిస్తున్న రూ. 500 బోనస్‌ నేపథ్యంలో ఈ సారి జిల్లాలో దొడ్డు రకం ధాన్యం బదులుగా సన్న రకాలు సాగు చేశారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలపై ఆశలు పెంచుకొని సాగు చేసారు. వరి సాగులో ఇప్పటి వరకు గంభీరావుపేటలో 15,554 ఎకరాల్లో నాట్లు వేసు కోగా ఇల్లంతకుంటలో 18,600 ఎకరాలు, ముస్తాబాద్‌లో 18,273 ఎకరాలు, సిరిసిల్లలో 3,910 ఎకరాలు, తంగళ్లపల్లిలో 16,600 ఎకరాలు, వీర్నపల్లిలో 5,219 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 16,363 ఎకరాలు, బోయినపల్లిలో 11,836 ఎకరాలు, చందుర్తిలో 12,800 ఎకరాలు, కోనరావుపేటలో 15,200 ఎకరాలు, రుద్రంగిలో 2,350 ఎకరాలు, వేములవాడలో 3,300 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 8,212 ఎకరాల్లో సాగు జరిగింది. ఇందులో 90శాతం సన్న రకాలు వేసుకున్నారు. సమృద్ధిగా వర్షాలు లేక బీడు వాడుతున్న పొలాలను చూసి తలడిల్లుతున్న రైతులకు కరెంటు కోతలు మరింత ఇబ్బందిగా మా ర్చింది. కొన్ని బోరు బావుల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోగా రైతులు పంటలను దక్కించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. బోరు బావుల్లో నీళ్లు ఉండి కరెంటు లేక జనరేటర్లు, మళ్లీ ఆయిల్‌ ఇంజన్లు, ట్రాక్టర్ల ఇంజన్లు ఉపయోగిస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫ పెరిగిన పత్తి సాగు

జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనాకు మించి పత్తి సాగు చేశారు. 47,120 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్వవసాయ శాఖ అంచనా వేయగా వరి తగ్గించి రైతులు 50,275 ఎకరాలు సాగు చేశారు. ఇందులో గంభీరా వుపేటలో 120 ఎకరాలు, ఇల్లంతకుంటలో 12,750 ఎకరాలు, ముస్తాబాద్‌లో 1,050 ఎకరాలు, సిరిసిల్లలో 700 ఎకరాలు, తంగళ్లపల్లిలో 1,400 ఎకరాలు, వీర్నపల్లిలో 450ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 3,300 ఎకరాలు, బోయినపల్లిలో 720ఎకరాలు, చందుర్తిలో 6,500 ఎకరాలు, కోన రావుపేట 5,100 ఎకరాలు, రుద్రంగిలో 2,230 ఎకరాలు, వేములవాడలో 5,200 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 4,300 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో పత్తి వాడిపోతోంది. పొడి వాతావరణం, అధిక ఎండ వేడితో భూమిలో తేమశాతం తగ్గిపోయి పత్తి ఎర్రబారుతోంది. కాయలు నల్లగా మారుతున్నాయి. పెట్టుబడి అయినా వస్తుందో రాదో అనే అందోళనలో రైతులు ఉన్నారు.

ఫ కరెంటు కోతలపై రోడ్డెక్కుతున్న రైతులు

జిల్లాలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా మారుతోంది. బోరు బావుల ద్వారా పంటలకు నీళ్లు అందించలేని రైతులు రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతు న్నారు. చేతికొచ్చే దశలో వరి పంటలు ఎండిపోతుండడంతో రాస్తారోకో, ధర్నాలు, నిరసన తెలుపుతున్నారు. సెప్టెంబర్‌ నుంచి కరెంటు కోతల పెరుగుతున్న దశలో రైతులు కొట్లాట మొదలు పెట్టారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు త్రీఫేస్‌ విద్యుత్‌ ఇవ్వాల్సి ఉండగా సాంకేతిక కారణాల పేరుతో కోతలు విధిస్తున్నారు. మధ్య మధ్యలో కోతలు విధిస్తూ ఉండడంతో చివరి పొలాలకు నీళ్లు అందని పరిస్థితి ఉంది. అధికారికంగా రాత్రి వేళల్లో పూర్తిగా కోత విధిస్తున్నారు. కరెంటు కోతలకు ప్రత్యామ్నాయంగా రైతులు జనరేటర్లను నమ్ముకు న్నారు. రోజు డీజిల్‌ కోసం రైతులు రూ 1500 నుంచి రూ 2 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కొందరు రైతులు జనరేటర్‌ కొనుగోలు చేస్తే మరి కొందరు రోజువారి అద్దె కింద జనరేటర్లు తెచ్చుకుంటున్నారు. జనరేటర్‌కు రూ 3. వేల నుంచి రూ 3500 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని గంభీరావుపేట, కోనరావుపేట, ఇల్లంతకుంట, చందుర్తి, బోయిన్‌పల్లి, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి తదితర ప్రాంతాల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఫ పడిపోతున్న భూగర్భ జలాలు

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలు లోటు వర్షపాతమే కొనసాగింది. సాధారణ వర్షపాతం 764.1 మిల్లీమీటర్లకు 454.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రుద్రంగి మండలంలో 28 శాతం లోటు వర్షపాతం ఉండగా చందుర్తిలో 18 శాతం, వేములవాడ రూరల్‌లో 14 శాతం, సిరిసిల్లలో 10 శాతం, ముస్తాబాద్‌లో 7 శాతం లోటు వర్షపాతం ఉంది. అల్పపీడన ప్రభావంతో కొంతమేరకు లోటు వర్షపాతం కొన్నిచోట్ల సాధారణంగా మా రింది. మరోవైపు జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి గత సంవత్సరం సెప్టెంబర్‌లో 5.09 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉంటే ఈ సంవత్సరం 7.36 మీటర్ల లోతులోకి పడిపోయాయి. మరోవైపు బోరుబావుల్లోను రోజురోజుకు నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి.

Updated Date - Oct 14 , 2026 | 01:26 AM