వెళ్లిరావమ్మా.. గౌరమ్మా..
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:21 AM
పూల పరిమళం పరవశింపజేసింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు కనువిందు చేశాయి. ఆదివారం సాయంత్రం వేళ ఆడపడుచులు ఇంటినుంచి బతుకమ్మలతో ప్రధాన కూడళ్ల వద్దకు చేరుకొని శ్రీ లక్ష్మీ నీ మహిమలు గౌరమ్మా.. చిత్రమై తోచునమ్మా.. గౌరమ్మా... పార్వతీదేవివై... పరమేశురాణివై... శ్రీ లక్ష్మీ నీ మహిళలే గౌరమ్మా.. అంటూ మహిళలు భక్తిపారవశ్యంతో అనందోత్సాహాలతో యువతుల, మహిళలు కోలాటాలు, దాండియా, ఆటపాటలతో సాగిన వేడుకలు అంబరాన్ని అంటాయి.
- జిల్లాలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పూల పరిమళం పరవశింపజేసింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు కనువిందు చేశాయి. ఆదివారం సాయంత్రం వేళ ఆడపడుచులు ఇంటినుంచి బతుకమ్మలతో ప్రధాన కూడళ్ల వద్దకు చేరుకొని శ్రీ లక్ష్మీ నీ మహిమలు గౌరమ్మా.. చిత్రమై తోచునమ్మా.. గౌరమ్మా... పార్వతీదేవివై... పరమేశురాణివై... శ్రీ లక్ష్మీ నీ మహిళలే గౌరమ్మా.. అంటూ మహిళలు భక్తిపారవశ్యంతో అనందోత్సాహాలతో యువతుల, మహిళలు కోలాటాలు, దాండియా, ఆటపాటలతో సాగిన వేడుకలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లోని గ్రామాల్లో సద్దుల మహా బతుకమ్మ వేడుకల్లో ఆవిష్కృతమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జిల్లాలోని పల్లెలు, సిరిసిల్ల కేంద్రంలో బతుకమ్మ పాటలతో ప్రతిధ్వనించాయి. పోయిరావమ్మా... గౌరమ్మా.. మళ్లీ రా బతుకమ్మ.. అంటూ మహిళలు బతుకమ్మలను సాగనంపారు. సద్దుల సంబురంతో వైభవంగా జరగగా పూల పండుగ మురిసిపోయింది. అందాల బతుకమ్మ సొగసు చూసి ఆడపడుచులు పులకరించిపోయారు. గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, గడ్డిపూలతో పాటు తీరొక్కపూలతో తెలంగాణ సంస్కృతికి, వైభవానికి నిలువెత్తూ నిదర్శనంగా బతుకమ్మ పూలతో పుడమి తల్లికి పుష్పార్చన చేశారు. సద్దుల బతుకమ్మ చుట్టూ భక్తి, అనందోత్సాహాలతో పల్లె, పట్టణ కూడళ్లలో మధురంగా వినిపించిన పాటలు ఆటకు అందరూ మహిళలు, యువతులు, చిన్నారులు, చప్పట్లతో జతకలిసి అడుగులు వేశారు. కులాలకతీతంగా ఇచ్చి పుచ్చుకున్న వాయినాలు ఆత్మీయతకు అద్దంపట్టాయి. తొమ్మిది రోజుల పాటు ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలైన సంబరాలను తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటిలో పసుపు పారబోసినట్లు తంగేడు, బంతిపూలు, ఏ దిక్కున చూసినా పలకరింపులుగా కట్ల పూలు, గుమ్మంలోంచి తొంగి చూసిన గునుగులు, మందారాలు పరిమళించాయి. మహిళా ప్రజాప్రతినిధులు బతుకమ్మలు ఆటపాటలతో గడిపారు.
జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు...
బతుకమ్మ సంబురాల ముగింపు ఎంతో అంబురంగా జరుపుకునే విధంగా సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఘాట్తో పాటు నెహ్రూనగర్, సాయిబాబా దేవాలయం, శాంతినగర్, పద్మనగర్, బోనాల, పెద్దూర్, రగుడు, చంద్రంపేట, సర్ధాపూర్, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి, అధికారులు బతుకమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు.