Share News

పడిపోతున్న పత్తి ధర

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:05 AM

ప్రారంభంలో మురిపించిన పత్తి ధర పంట రోజురోజుకు తగ్గిపోతున్నది.

పడిపోతున్న పత్తి ధర

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రారంభంలో మురిపించిన పత్తి ధర పంట రోజురోజుకు తగ్గిపోతున్నది. జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్‌కు 9,250 చొప్పున పలికిన ధర ప్రస్తుతం మద్దతు ధరకు దగ్గరగా వచ్చింది. రోజుకు 100 నుంచి 200 రూపాయల చొప్పున ధర తగ్గిస్తూ వ్యాపారులు కొనుగోలు చేస్తుంటే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అఽధికారికంగా కొనుగోలు కేంద్రాలను తెరవకుండా దోబూచులాడుతోంది. జిల్లాలో పత్తి ఏరడం ముమ్మరం కావడంతో రైతులు మార్కెట్‌కు తమ దిగుబడిని వెంటవెంటనే తీసుకొని వస్తున్నారు.

ఫ ప్రారంభంలో మద్దతు ధరకు మించి..

ప్రారంభంలో పత్తికి మద్దతు ధర కంటే అధిక ధర రావడంతో రైతులు పంట దిగుబడి తగ్గినా నష్టాల పాలు కాకుండా గట్టెక్కవచ్చని సంతోషించారు. దిగుబడి తగ్గడంతో వ్యాపారులు కొంత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తారని ఆశించారు. ప్రారంభంలో రైతులు ఆశించిన విధంగానే ధర ఉన్నా రోజురోజుకు అది తగ్గిపోతుండడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 45,836 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సాధారణంగా జిల్లాలో ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, చివరి రెండు తడులకు నీరు ఆశించిన విధంగా అందక పోవడంతో దిగుబడి సగానికి పడిపోయింది. ఇప్పుడు ఎకరాకు ఏడు క్వింటాళ్ళ చొప్పున దిగుబడి వస్తే అదే గొప్ప అని భావిస్తున్నారు. ఆ లెక్కన జిల్లాలో ఈసారి 3.2 లక్షల క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో దిగుబడి తగ్గినపుడు ధర పెరగడం సాధారణంగా జరిగేదే. అయితే ఇప్పుడు కథ రివర్స్‌ అయింది. దిగుబడి తగ్గింది. దానితోపాటే ఽవ్యాపారుల మాయాజాలం కారణంగా ధర కూడా తగ్గుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

ఫ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 8,667

కేంద్రం పత్తికి పొడుగు నూలు రకానికి క్వింటాల్‌కు 8,667, మధ్యస్త నూలుకు క్వింటాల్‌కు 8,267 మద్దతు ధరను ప్రకటించింది. పత్తి మార్కెట్‌కు తెచ్చినపుడు ఎనిమిది శాతం తేమ ఉంటే 8,667, 9 శాతం తేమ ఉంటే 8,580, 10 శాతం తేమ ఉంటే 8,494, 11 శాతం తేమకు 8,407, 12 శాతం తేమకు 8,320 రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించింది. సీసీఐ జిల్లాలో రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయడానికి కరీంనగర్‌, చొప్పదండి, గోపాల్‌రావుపేటలో మూడు కేంద్రాలను జమ్మికుంటలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఫ ఆసక్తి చూపని సీసీఐ

ప్రతిసారి మంత్రులతోనో, స్థానిక ఎమ్మెల్యేలతోనో ఈ కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టేవారు. ఈసారి అధికారికంగా వాటిని ప్రారంభించకుండా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేసినట్లు చెబుతున్నారు. ప్రతక్ష్యంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చి పత్తి కొనుగోలు చేయని కారణంగా ముందుగా 9,250 రూపాయలకు క్వింటాల్‌ చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు గురువారం జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్‌కు 8,860, గోపాల్‌రావుపేట మార్కెట్‌లో 8,800, కరీంనగర్‌, చొప్పదండి మార్కెట్లలో 8,700 రూపాయలకు కొనుగోలు చేశారు. బుధవారం జమ్మికుంటలో 9,040, కరీంనగర్‌లో 8901, గోపాల్‌రావుపేటలో 8,850, చొప్పదండిలో 8,600 రూపాయలకు కు కొనుగోలు చేశారు. ప్రతీరోజు 100 నుంచి 200 రూపాయల చొప్పున తగ్గిస్తూ వస్తూ ధరను మద్దతుధర స్థాయికి తీసుకువచ్చారు. సీసీఐ అధికారికంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోళ్ళు ప్రారంభించక పోతే మద్దతు ధర కంటే తక్కువకే రైతులు అమ్ముకోవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. గతంలోనూ సీసీఐ తేమ శాతం ఎక్కువగా ఉందని పత్తిని కొనుగోలు చేయకుండా రిజెక్టు చేసిన సందర్బాల్లో విధిలేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించుకున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు రానున్నాయేమోనని ఆందోళన చెందుతున్నారు. తుఫాన్‌ హెచ్చరికలతో వర్షం కురుస్తుందేమోనన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ మాత్రం ప్రైవేట్‌ వ్యాపారులు మద్దతు ధరకు మించి కొనుగోలు చేపడుతుండడంతో పత్తి విక్రయించేందుకు సీసీఐ కేంద్రాలకు రావడం లేదని అంటోంది. తాము కొనుగోలు కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేసి పెట్టామని, రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకుంటే కొనుగోలుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. వ్యాపారులు, సీసీఐ అధికారుల సత్సంబంధాల నేపథ్యంలోనే ఈ రకమైన వ్యవహారం జరుగుతోందని రైతులు అంటున్నారు.

Updated Date - Nov 20 , 2026 | 01:05 AM