Share News

జాతరో.. జాతర..

ABN , Publish Date - Jan 19 , 2026 | 01:12 AM

సిరిసిల్ల మానేరు తీరంలో శివనామం మార్మోగింది.

జాతరో.. జాతర..

- ఉప్పొంగిన భక్తి పారవశ్యం.. కిక్కిరిసిన జనం

- మానేరు తీరంలో శివపార్వతుల కల్యాణాలు

- గంగమ్మ జాతరకు తరలివచ్చిన భక్తులు

- స్వామివార్లను దర్శించుకున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సిరిసిల్ల మానేరు తీరంలో శివనామం మార్మోగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాండవ్య నదీ తీరంలో మూడు చోట్ల శివకల్యాణం జాతరలతో కోలాహలం నెలకొంది. ఆదివారం సిరిసిల్ల మానేరు వాగులో గంగాభవాని జాతర అత్యంత కన్నుల పండువగా సాగింది. గంగాభవానికి పరమేశ్వరునికి కల్యాణం జరిపించారు. సిరిసిల్లతోపాటు తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, వేములవాడ, గంభీరావుపేట, బోయినపల్లి, చందుర్తి, కోనరావుపేట మండలాల నుంచి భక్తులు తరలివచ్చారు. గంగాభవానికి మహిళలు ఓడిబియ్యం సమర్పించుకున్నారు. మడేళేశ్వరస్వామికి కల్యాణం జరగగా, కొడిముంజ గుట్టల్లో చారిత్రాత్మకమైన రామప్పగుడి మిడ్‌మానేరు బ్యాక్‌ వాటర్‌లో మునిగిపోవడంతో ఈసారి సిరిసిల్ల శివారులో మిడ్‌మానేరు కరకట్ట కింద దేవాలయ పునర్నిర్మాణానికి కేటాయించిన స్థలంలో శ్రీరామేశ్వరుడు పార్వతిల కల్యాణం వైభవంగా జరిగింది. మూడుచోట్ల నాయీబ్రహ్మణులు, గంగపుత్రులు, రజక సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్‌ బొమ్మలతో పాటు నిర్మల్‌ కొయ్యబొమ్మలను జనం ఆసక్తిగా కొనుగోలు చేశారు. సిరిసిల్ల పట్టణ ప్రజలు జాతరలో సందడి చేశారు. గంగాభవాని జాతరలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రజక సంఘం రాష్ట్ర గౌరవ ఆధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్‌, బీజేపీ జిల్లా ఆధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ జిందం కళ, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు శివపార్వతులను దర్శించుకున్నారు.

సంస్కృతీసంప్రదాయాలు గొప్ప అనుభూతినిస్తాయి..

- ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

లోక కల్యాణం కోసం జాతరలు, స్వామివారి కల్యాణాలు జరుపుకుంటామని, సంస్కృతి సంప్రదాయాలు గొప్ప అనుభూతిని ఇస్తాయని ప్రభుత్వం ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో గంగమ్మ జాతరతో పాటు మడలేశ్వర స్వామి, రామప్ప రామలింగేశ్వర స్వామి, భీముని మల్లారెడ్డిపేటలో వీరాంజనేయస్వామి, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామిలను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. భారత సంస్కృతి సంప్రదాయాలను ఇతర దేశాల వారు ఆచరిస్తున్న తీరు కనిపిస్తుందన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం మెరుగైన వసతులను కల్పిస్తోందన్నారు. సమ్మక్క సారలమ్మ వద్దకు క్యాబినెట్‌ తరలిరావడం తొలిసారి అన్నారు. వేములవాడలో శివరాత్రి జాతరకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సరూపరెడ్డి, గడ్డం నర్సయ్య, తిరుపతిరెడ్డి, వనిత తదితరులున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 01:12 AM