కో ఆప్షన్ పదవులపై కన్ను..
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:49 AM
గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి గతనెల 22వ తేదీన నూతన పాలకవర్గాలు కొలువుదీరగా, కొందరు స్థానిక నాయకులు పంచాయతీల్లో ఉండే కోఆప్షన్ పదవులపై కన్నేశారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి గతనెల 22వ తేదీన నూతన పాలకవర్గాలు కొలువుదీరగా, కొందరు స్థానిక నాయకులు పంచాయతీల్లో ఉండే కోఆప్షన్ పదవులపై కన్నేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో ముగ్గురు చొప్పున కోఆప్షన్ సభ్యులుగా నియమించుకునే అవకాశం పంచాయతీరాజ్ చట్టం కల్పించింది. దీంతో ప్రభుత్వం కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు త్వరలోనే షెడ్యూల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వచ్చేలోపే కొత్త పాలకవర్గం మద్దతు కూడగట్టుకొని కోఆప్షన్ పదవులు దక్కించుకోవడానికి ఆశావాహులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో 263 గ్రామపంచా యతీలు ఉండగా, రామగిరి మండలం పెద్దంపేట్ పంచాయతీ మినహా 262పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. పెద్దంపేట్‌లో ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ విషయంలో తప్పిదం జరగడంతో సదరు అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికను వాయిదా వేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. 262గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 13గ్రామాల సర్పంచ్ పదవులు ఏకగీవ్రం కాగా, 600కు పైగా వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణలు, ఏకగ్రీవాల సమయంలో కోఆప్షన్ పదవుల ఆశలు చూపి అభ్యర్థులను పోటీనుంచి తప్పించిన సందర్భాలు ఉన్నాయి. కోఆప్షన్ సభ్యుల నియామకానికి సంబంధించిన షెడ్యూల్ నోటిఫికేషన్ ఇంకా జారీ కావలసి ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కొందరు, గెలుపునకు సహకరించామని మరికొందరు కోఆప్షన్ పదవులను ఆశిస్తున్నారు. గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాల చుట్టూ తిరగడంతోపాటు ఆయాపార్టీల ముఖ్యనేతల చుట్టూ కోఆప్షన్ పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని గ్రామపంచాయతీలో కోఆప్షన్ల సందడి కనిపిస్తోంది.
ఫ పంచాయతీకి ముగ్గురు చొప్పున కో ఆప్షన్ సభ్యులు..
ప్రజల భాగస్వామ్యం పెంపొందించేందుకు స్థానిక సంస్థల్లో కో ఆప్షన్ సభ్యులుగా వివిధ వర్గాల నుంచి ముగ్గురిని ఎన్నుకుంటారు. జిల్లాలో 263గ్రామపంచాయతీలు ఉండగా కోఆప్షన్ సభ్యులుగా 789మందికి అవకాశం ఉంటుంది. కోఆప్షన్ సభ్యులలో గతంలో గ్రామ పంచాయతీలో పాలకవర్గాల్లో పనిచేసిన వారు ఒకరు, ఉద్యోగ విరమణ చేసిన వారు ఒకరు, గ్రామ సమైక్య అధ్యక్షురాలు ఒకరు ఉంటారు. కోఆప్షన్ సభ్యుడికి వార్డు సభ్యులతో సమాన హోదా, ప్రోటోకాల్ ఉంటుంది. చర్చల్లో పాల్గొనడం, సూచనలు ఇవ్వడం చేయవచ్చు. తీర్మానంపై ఓటువేసే హక్కు వీరికి ఉండదు. గ్రామపంచాయతీలో కోఆప్షన్ సభ్యుల స్థానాల భర్తీకి ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు వెల్లడించక పోయినా గ్రామాల్లో మాత్రం పదవులు దక్కించుకోవడానికి ఆశావాహులు చేస్తున్న హడావుడి కోలాహలంగా మారింది.
ఫ జిల్లాలో పంచాయతీల్లో కాంగ్రెస్ ఆధిపత్యం..
జిల్లాలోని 262 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సాధించింది. పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలతో పాటు, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుపొందడంతో జిల్లాలో వారిదే ఆధిపత్యం కొనసాగుతున్నది. 183గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు, 51గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు, నాలుగు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు, 24గ్రామాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. పార్టీ రహిత ఎన్నికలు కావడంతో ఏ పార్టీ మద్దతు లేకుండా గెలిచిన కొందరు స్వతంత్రులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరగా, బీఆర్‌ఎస్‌కు చెందిన వాళ్లు సైతం కొందరు కాంగ్రెస్‌లో చేరారు. అధికార పార్టీలో ఉంటే గ్రామాభివృద్ధి కోసం నిధులు తీసుకు రావచ్చనే ఆలోచనలో కొందరు సర్పంచులు ఉన్నారు. కోఆప్షన్ సభ్యులుగా అధికారపార్టీ నాయకులు సూచించిన వారే నియమితులయ్యే అవకాశాలున్నాయి.
ఫ ప్రభుత్వ ఆలోచనపై సందిగ్ధం..
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ముగ్గురు కో ఆప్షన్ సభ్యులను గ్రామపంచాయతీలో నియామకం చేపట్టాల్సి ఉన్నప్పటికీ పంచాయతీ ఆలోచన ఎలా ఉంటుందనే దానిపై ఆశావహుల్లో సందిగ్ధం నెలకొన్నది. పంచాయతీ ఎన్నికలు ముగిసి దాదాపు 20రోజులు దాటిపోతున్నా కూడా ఎలాంటి నిర్ణయం వెలువడక పోవడంతో ఎలాంటి మార్పులు జరుగుతాయనే దానిపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో కొన్ని సవరణలు చేసిన విషయం తెలిసిందే. పదేళ్లకోసారి ఉన్న రిజర్వేషన్‌ను ఐదేళ్లకోసారి రోటేషన్ పద్ధతిలో చేయాలని, ఇద్దరు పిల్లలకు మించి ఉన్నా కూడా పోటీకి అర్హులేననే నిబంధనలు తీసుకవచ్చింది. అయితే కోఆప్షన్ సభ్యుల నియామకం విషయమై ఎలాంటి సవరణలు చేయలేదు. దీంతో యథావిధిగా ముగ్గురిని కోఆప్షన్ సభ్యులుగా నియమిస్తారని భావిస్తూ పదవులు దక్కించుకోవడానికి ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు.