ఫలించిన నిరీక్షణ
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:52 AM
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సహకార సేవలు మరింత చేరువ చేసే దిశగా ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సహకార సేవలు మరింత చేరువ చేసే దిశగా ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు ఆరేళ్లుగా ప్రతిపాదనలతోనే గడిచిపోయిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణకు అడుగులు పడ్డాయి. సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం 24 సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలందిస్తున్నారు. కొత్తగా మరో ఐదు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే చర్యలు తీసుకునేందుకు వ్యవసాయ సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. సహకార సంఘాల పరిధిలోని కూడా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం కూడా ఉన్నప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. ఆరేళ్ల క్రితమే సహకార సంఘాలను కొత్త మండలాలతో పాటు పెద్ద మండలాల్లో అదనంగా సహకార సంఘాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు వచ్చాయి.
ఫ ఎట్టకేలకు ఆమోదం..
కొత్త జిల్లాల్లో ఇప్పటి వరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వం 2019లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 6 వ్యవసాయ ప్రాథమిక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి పంపిన ప్రతిపాదనలు పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మోక్షం లభిస్తుందనే ఆశలు ఉన్నా వరుస ఎన్నికలతో ప్రక్రియ ముందుకు సాగలేదు. 2023 సంవత్సరం మేలో కేంద్ర మంత్రి మండలి దేశంలో వచ్చే ఐదేళ్లలో 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రామానికో సంఘాన్ని ఏర్పాటు చేసి రైతులకు 25 రకాల సేవలు అందించాలని నిర్ణయించిన వివిధ కారణాల వల్ల ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి. గత సంవత్సరం సహకార సంఘాల పరిధి విస్తృతపరిచే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 24 సహకార సంఘాలకు మొదటగా 10 సంఘాల పెరుగుదలకు ప్రతిపాదనలు పంపించారు. వాటిలో 6 సంఘాలు పెంచే దిశగా ప్రతిపాదనలు ముందు వచ్చాయి. చివరకు ఐదు సంఘాలకు ఆమోదం లభించింది.
ఫ సేవలు సులభతరం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం ఉన్న 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పరిపాలన భారాన్ని తగ్గించడం, గ్రామీణ సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చేపట్టిన కొత్త సంఘాల ఏర్పాటులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు సంఘాల కొత్తగా ఏర్పాటు కానున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్, రుద్రంగి మండలంలో రుద్రంగి, వేములవాడ రూరల్ మండలంలో చెక్కపల్లి, వీర్నపల్లి మండలంలో వీర్నపల్లి, గంభీరావుపేట మండలంలో గజసింగవరంలో ప్రాథమిక వ్యవసాయ సంఘాలను ఏర్పాటు కానున్నాయి. పారదర్శకంగా విభజన ప్రక్రియను చేపట్టడానికి చర్యలు చేపట్టారు. కొత్తగా సంఘాలు ఏర్పాటు కావడంతో రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతుంది. రైతులు పంట రుణాలు సులభంగా పొందే వీలుకలుగుతుంది. కొత్తగా ఏర్పడిన సంఘాల్లో సర్వసభ్య సమావేశాల తర్వాత కొత్త సభ్యత్వాలపై నిర్లయం వస్తుంది. కొత్త ఏర్పాటుకాకున్న ఐదు సహకార సంఘాలకు ఆస్తులు, అప్పులు, లాభాలు ఎలా పంపిణీ చేయాలి, సిబ్బంది సర్దుబాటు విషయాలు సంఘాల నోటిఫికేషన్ తర్వాత స్పష్టత వస్తుంది. జిల్లాలో ప్రస్తుతం 24 సంఘాలు ఉన్నాయి. సంఘాల పరిధిలో 74728 మంది సభ్యులు ఉన్నారు. సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 12859 మంది సభ్యులు ఉండగా పెద్దూరు సొసైటీలో 1336 మంది, నేరెల్ల సొసైటీలో 1257 మంది, కోనరావుపేట సొసైటీలో 6196 మంది, కొలనూరు సొసైటీలో 3018 మంది, వేములవాడ సొసైటీలో 8180 మంది, నాంపెల్లి సొసైటీలో 1191 మంది, రుద్రవరం సొసైటీలో 998 మంది, చందుర్తి సొసైటీలో 3369 మంది, సనుగుల సొసైటీలో 1733 మంది, బోయినపల్లి సొసైటీలో 910 మంది, కోరెం సొసైటీలో 1694 మంది, మాన్వాడ సొసైటీలో 1163 మంది, నర్సింగాపూర్ సొసైటీలో 1684 మంది, ఇల్లంతకుంట సొసైటీలో 3547 మంది, గాలిపెల్లి సొసైటీలో 1680 మంది, ముస్తాబాద్ సొసైటీలో 2082 మంది, పోత్గల్ సొసైటీలో 7169 మంది, గంభీరావుపేట సొసైటీలో 8183 మంది, కొత్తపెల్లి సొసైటీలో 3680 మంది, ఎల్లారెడ్డిపేట సొసైటీలో 3864 మంది, అల్మాస్పూర్ సొసైటీలో 2139 మంది, తిమ్మాపూర్ సొసైటీలో 1597 మంది, మానాల సొసైటీలో 199 మంది సభ్యులు ఉన్నారు.
వ్యాపార రంగాల్లోకి సహకార సంఘాలు..
వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతం వైపు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సహకార రంగంలో వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు విసృత సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంది. సహకార పరపపతి సంఘాలను పునర్విభజన చేసే కార్యక్రమాలు జరుగుతుండగానే వ్యాపార రంగాల్లోకి సహాకార సంఘాలను తీసుకవచ్చే దిశగా పరపతి సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చుతోంది. ప్రస్తుతం సహకార సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువుల విక్రయాలతో పాటు ధాన్యం కొనుగోళ్లతో లాభాలు అర్జిస్తున్నాయి. వీటి స్థానంలోనే రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా ఏర్పాటు చేసి ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 311 వ్యవసాయ సహకార పరపతి సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసింది. దీని ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి తేవడం, ఇతర రంగాల్లోనూ అడుగుపెట్టే దిశగా ముందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో 24 వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో తొలి విడతగా ఆరు సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసింది. జిల్లాలో వేములవాడ, సనుగుల, నాంపల్లి, అల్మాస్పూర్, గంభీరావుపేట, ఇల్లంతకుంట సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసి సేవలు అందించనున్నారు. ఈ సంస్థల్లో వాటాదారులుగా చేర్చుకుంటారు. సభ్యులు తమ వాటాకు అనుగుణంగా ఈక్విటీగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈ సొసైటీలకు ఈక్విటీ వాటాగా కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షల వరకు ఒక్కో సొసైటీకి మ్యాచింగ్ గ్రాంట్ కింద అందిస్తుంది. మూడు సంవత్సరాల నిర్వహణకు ఏడాదికి రూ.6 లక్షల చొప్పున రూ.18 లక్షలు ఇస్తుంది. ప్రస్తుతం సహకార శాఖ అధికారులు ఉద్యోగులకే రైతు ఉత్పత్తి సంస్థల బాధ్యతలను అప్పగించనుంది. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక క్రేడిట్ గ్యారంటీ కింద నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు వేర్వేరు లక్ష్యాలతో ఉన్నా ఇవి రెండూ ఒకే రకమైన సంస్థలుగా పనిచేస్తాయి. ఎఫ్పీవోలు ప్రధానంగా రైతుల ఆదాయం పెంచడానికి ఉత్పత్తులు పెంచడానికి, ప్రాసెసింగ్ చేయడంపై దృష్టి పెడుతారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగానే రైతు ఉత్పత్తి సంస్థలు పనిచేస్తాయి.