అంబులెన్సల అడ్డగోలు వసూళ్లు..!
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:54 AM
ఇవీ.. కరీంనగర్ జిల్లాసుపత్రి సమీపంలో రోగులను అత్యవసరవేళ చేర్చేందుకు సిద్ధంగా ఉన్న కొన్ని ప్రైవేటు అంబులెన్స టైర్ల దుస్థితి. తిరిగి తిరిగి అరిగి పోయిన ఈ వాహనంలోనే రోగుల్ని రయ్ రయ్‌మని తీసుకెళ్తున్నారు.
- ఆపదవేళ కొందరి వసూళ్ల దందా
- నిర్వహణ తీరు అధ్వానం
- రోగుల ప్రాణాలతో చెలగాటం
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
ఇవీ.. కరీంనగర్ జిల్లాసుపత్రి సమీపంలో రోగులను అత్యవసరవేళ చేర్చేందుకు సిద్ధంగా ఉన్న కొన్ని ప్రైవేటు అంబులెన్స టైర్ల దుస్థితి. తిరిగి తిరిగి అరిగి పోయిన ఈ వాహనంలోనే రోగుల్ని రయ్ రయ్‌మని తీసుకెళ్తున్నారు. అసలే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి అటు ప్రాణాలతో చెలగాటమాడుతూనే మరోవైపు ఎక్కడ ఈ వాహనం అదుపు తప్పొద్దని బిక్కు బిక్కుమంటూ ఆస్పత్రికి చేరాల్సిన గడ్డు పరిస్థితి ఎదుర్కోవాలి. జిల్లాలో ఈ ఒక్క అంబులెన్సే కాదు చాలా వాటి నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
- కరీంనగర్ నుంచి అత్యవసరంగా హైద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే రూ.4,500 నుంచి రూ.6 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో వారు అడిగినంత ఇవ్వాల్సిందే.! సింగిల్ ట్రిప్‌కు ఒక మాదిరిగా అదే తిరిగి వస్తే కిరాయి మరొకలా వసూల్ చేస్తున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాల్సిన సమయంలోనూ రూ.3,500 వరకు తీసుకుంటున్నారు. ఆక్సిజన ఇతర ఇక్విప్‌మెంట్ ఉంటే అదనంగా రూ.వెయ్యి వెంటిలేటర్ వాహనాల్లో కిరాయికి అదనంగా రూ.2 వేలను తీసుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రైవేటు అంబులెన్సలపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఆపత్కాలంలో సంజీవనిగా నిలవాల్సిన ఈ వాహనం అద్దె భారం రోగుల పాలిట శాపంగా మారుతోంది. కొందరు ఇష్టారాజ్యంగా కిరాయి వసూలు చేస్తుండటంతో రోగులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంటల్లో ఉన్న వందలాది అంబులెన్సలలో కొందరు ఈ వ్యాపారాన్ని దందాగా మార్చుకుంటున్నారు. కనీసం మానవతా దృక్పథాన్ని విస్మరిస్తూ అడ్డగోలు అద్దెలను అడుగుతున్నారు. కొందరు ఉదారత చూపిస్తూ రోగుల వ్యధను గమనిస్తూ ఇచ్చినంత తీసుకుంటుండగా ఇంకొంతమంది ముక్కుపిండి మరీ అడిగినంత జేబులోకి వచ్చే దాకా వదలడం లేదు. రోగి పరిస్థితి, ప్రయాణ దూరం, సమయం, ఆస్పత్రి ఎంపికలను బట్టి కొందరు నిర్వాహకులు నచ్చినంత డిమాండ్ చేస్తున్నారు.
సౌకర్యాల్లోనూ డొల్ల
వాస్తవానికి ప్రైవేటు అంబులెన్సలలో చాలావరకు కాలం చెల్లినవే నడుస్తున్నాయి. వ్యానలను అంబులెన్సలుగా మార్చి నడిపించే వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇందులో కనీసం ఉండాల్సిన సౌకర్యాలు ఉండటం లేదు. రోగిని తరలించడమే కాకుండా ఆస్పత్రికి చేరే వరకు సరైన ప్రాథమిక చికిత్స సహా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఇవి ఒక సదుపాయంగా ఉండాలి. కానీ చాలా వాహనాల్లో స్ర్టెచర్‌లు పాతబడిపోయాయి. దారి పొడుగునా వాహనాల వేగానికి అటు ఇటు కదిలేవే ఎక్కువగా ఉన్నాయి. ఆక్సిజన సిలిండర్ల సదుపాయం మొక్కుబడిగా కొన్నింట్లో ఉంటున్నాయి. అయితే నిబంధనల ప్రకారం అంబులెన్సలలో కొన్ని ప్రమాణాలు ఉండాలని గతంలోనే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అంబులెన్సల నిర్మాణం, పనితీరు, వైద్యపరికరాలపై మార్గదర్శకాలు జారీ చేసింది. నాలుగు కేటగిరీలుగా ఇవి ఉండగా జిల్లాలో మాత్రం ఎక్కువగా సాధారణమైన అంబులెన్సలో ఉన్నాయి. అంబులెన్స రకాన్ని బట్టి స్ర్టెచర్, ఆక్సిజన సిలిండర్, సక్షన యంత్రం, అంబు బ్యాగ్, బీపీ ఏపీ వెంటిలేటర్, కార్డియాక్ మానిటర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, స్ర్టెచర్ బెల్టులు, అత్యవసర లైట్లు ఉండాలి. కానీ వీటి విషయంలో సరైన పర్యవేక్షణ లేక కొన్నింట్లో లోపాలు రోగులకు అత్యవసర వేళ ఇబ్బంది పెడుతున్నాయి.
తనిఖీల ఊసే లేక ఇబ్బంది
వాస్తవానికి అంబులెన్సల విషయంలో రవాణా, పోలీసు, వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలు మొక్కుబడిగా మారాయి. వీటి ఫిట్‌నెస్‌ను తనిఖీ చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. చాలా వాహనాలు పాతవాటికే మెరుగులు దిద్ది కొత్తగా తీర్చిదిద్దుతున్నారు. అప్పటికే వేల కిలోమీటర్లు తిరిగిన వాటిని అంబులెన్సలుగా మారుస్తున్నారు. అసలు రోడ్లపై సురక్షితంగా తిరగాల్సిన వీటి విషయంలో లెక్కలేని తనమే కనిపిస్తోంది. పైగా మితిమీరిన వేగంతో పాటు డ్రైవర్ల నిర్లక్ష్యంపైన అధికారులు సరైన దృష్టి పెట్టడం లేదు. వాహన భద్రతను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు వినియోగిస్తున్న అంబులెన్సలు ఏ కండీషనలో ఉన్నాయనే విషయాన్ని తనిఖీలు చేయడం లేదు. బ్రేక్‌లు, టైర్లు, స్టీరింగ్, ఇంజిన ఇతర పరికరాల పరిస్థితిని గమనించాల్సిన అవసరముంది. చాలా వాహనాలు మధ్యలో ఆగిపోయి మరో వాహనంలో తరలిస్తున్న సందర్భాలు రోగులకు ఎదురవుతున్నాయి. రవాణా శాఖ అధికారులు వాహనాలు ఎన్ని ఏళ్లపాటు నడిచాయనే కోణంలోనూ ఆరా తీయాలి. ఇప్పటి వరకు వీటిని తనిఖీలు చేపట్టి, జరిమానాలు విధించిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ అంబులెన్సల విషయంలో వసూలు చేస్తున్న అద్దెలు, అందులో ఉన్న పరికరాలు, వాహనం భద్రత అనే మూడు కోణాల్లో పక్కాగా పరిశీలనలు జరపాలని రోగుల సంబంధీకులు కోరుతున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటేనే ఆపత్కాలంలో సంజీవని సేవలు జిల్లా వ్యాప్తంగా మరింత మెరుగై రోగుల ప్రాణాల్ని నిలబెట్టేందుకు ఆస్కారముంటుంది.